పోలీస్‌ విభాగంలో కరోనా వైరస్‌ కలకలం | Coronavirus Positive Cases in Hyderabad Police | Sakshi
Sakshi News home page

రక్షణ లేని భటులు!

Published Tue, May 26 2020 11:25 AM | Last Updated on Tue, May 26 2020 11:25 AM

Coronavirus Positive Cases in Hyderabad Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగానికి కరోనా ఫీవర్‌ పట్టుకుంది. అధికారులు, సిబ్బందిలో వరుసగా పాజిటివ్‌ లక్షణాలు వెలుగు చూస్తుండటంతో దినదిన గండంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందికి వైరస్‌ సోకగా.. ఓ కానిస్టేబుల్‌ అసువులు బాశారు. కోవిడ్‌ లక్షణాలున్న మరికొందరు పోలీసులు, వారి కుటుంబికుల రిపోర్టులు రావాల్సి ఉంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఏడుగురు పోలీసులకు కరోనా సోకినట్లు తేలింది. పోలీసు అధికారులు, సిబ్బంది విషయంలో పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వీప్‌మెంట్‌ (పీపీఈ) కిట్ల కొరతతో పాటు లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది.  

క్షేత్రస్థాయి సిబ్బందే బాధితులు..
లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి పోలీసు అధికారులు అనునిత్యం విధులకు అంకితమయ్యారు. సర్వకాల సర్వావస్థల్లోనూ కోవిడ్‌ను కట్టడికి, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చూసేందుకు పని చేశారు. పోలీసు విభాగంలో ప్రధానంగా రెండు రకాలైన అధికారులు, సిబ్బంది ఉంటారు. రోడ్లపైకి వచ్చి డ్యూటీలు చేసే క్షేత్రస్థాయి విధులు నిర్వర్తించే వారితో పాటు కార్యాలయాల్లో ఉండి పర్యవేక్షణ వ్యవహారాలు నెరిపే వారు ఉంటారు. ఇప్పటి వరకు కరోనా బారినపడిన అధికారులు, సిబ్బందిలో క్షేత్రస్థాయి విధులు నిర్వర్తించిన వారే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు ఏర్పాటైన చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి ద్వారా కొందరు కుటుంబికులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కొందరు అధికారులు, సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  

చెక్‌పోస్టు విధులూ ‘ప్రమాదకరమే’..
లాక్‌డౌన్‌ అమలు పర్యవేక్షణ, వాహనాల రాకపోకలక్రమబద్ధీకరణ, కర్ఫ్యూ అమలు కోసం నగర వ్యాప్తంగా దాదాపు 200 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పడ్డాయి. వీటిలో పగలు, రాత్రి కనీసం పది మంది చొప్పున విధులు నిర్వర్తించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంçఘిస్తూ బయటకు వచ్చిన వారిని, మాస్కులు ధరించకుండా సంచరిస్తున్న వారిని ఆపే ఈ సిబ్బంది వారితో సమీపం నుంచి మాట్లాడాల్సి వచ్చింది. ఈ కారణంగానూ కొందరు వైరస్‌ బారినడిపట్లు అనుమానాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమలవుతున్న వలసకూలీల తరలింపు పోలీసులకు మరో గండంగా మారింది. నగరంలో మర్కజ్‌ లింకుల తర్వాత ఆ స్థాయిలో వలస కూలీలకు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు ఎక్కువగా పాజిటివ్‌ వస్తోంది. వీరి రిజిస్ట్రేషన్, తరలింపు విధులు నిర్వర్తించిన పోలీసులూ పీపీఈలు ధరించకపోవడంతో వైరస్‌ విజృంభిస్తోంది.

కుటుంబాల్లో ఆందోళన..
పోలీసు విభాగాన్ని కరోనా చుట్టేస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.  వైరస్‌ లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించడానికి గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.  ఇక్కడకు వైద్యులు సక్రమంగా రాకపోవడంతో ఆశించిన విధంగా  ల్యాబ్‌ పని చేయట్లేదు.   గాంధీ ఆస్పత్రితో పాటు కంటైన్మెంట్‌ ఏరియాల్లో పని చేసిన సిబ్బంది, అధికారులతో పాటు వారి కుటుంబికుల్లోనూ తీవ్రఆందోళన నెలకొంది.  

‘గాంధీ’ లింకులతో..  
గత నెలలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్‌ విషయంలో అతని బంధువులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. అప్పటి నుంచి పోలీసు విభాగం గాంధీ ఆస్పత్రికి అదనపు భద్రత కల్పించింది.  కొన్నాళ్లపాటు గాంధీ ఆస్పత్రి వార్డులు, ప్రాంగణంలో కలిపి ప్రతి రోజూ 200 మంది వరకు పోలీసులు విధులు నిర్వర్తించారు. వీరికి రక్షణ సామగ్రి అందించడంలో తొలినాళ్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పీపీఈ కిట్ల కొరతతో అందించలేకపోయారు. ఆ తర్వాత కేవలం వార్డుల్లో విధులు నిర్వర్తించిన వారికి మాత్రమే ఈ కిట్లు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలోని ఇతర ప్రాంతాల్లో డ్యూటీలు చేసిన వారికి కేవలం గ్లౌజులు, మాస్కులు కొందరికి ఫేస్‌ షీల్డ్స్‌ మాత్రమే దక్కాయి. ఫలితంగా అక్కడ పని చేసిన సిబ్బందిలో లక్షణాలు బయటపడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement