సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు ఆయా కాలేజీ యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయని, అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుందని భావిస్తోంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలి వస్తారని, తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుందని యాజమాన్యాలతో చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది.
సర్కారు వాదనలతో ప్రైవేటు యాజమాన్యాలు అంగీకరించట్లేదు. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదని, తామిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలని వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘నీట్’ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో తమకు ఆదాయం తగ్గిందని, ఈ నేపథ్యంలో ఉచిత సేవలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న దానిపై సర్కారు సంకటంలో పడిపోయింది. బోధనాసుపత్రుల్లోని పడకలు ఖాళీగా ఉండకుండా వాటిని పేదలకు సేవలు అందించడం ద్వారా భర్తీ చేయాలన్న కృత నిశ్చయంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ మేరకు ఆయన పలు దఫాలుగా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు.
ప్రభుత్వం ఏమంటోంది...
ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయి. అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలివస్తారు. తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుంది.
యాజమాన్యాల వాదన..
‘నీట్’ ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో మాకు ఆదాయం తగ్గిపోయింది. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదు. మేమిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలి.
సర్కారు వైద్య సేవలు అందకపోవడం వల్లే..
రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటికి అనుబంధంగా ఒక్కో దానికి బోధనాసుపత్రి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులకు రోగులు వెల్లువెత్తుతుండగా, ప్రైవేటులో అధిక ఫీజుల కారణంగా రోగులు ఆసక్తి చూపట్లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పడకలు నిండట్లేదు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, దీంతో పేద రోగులు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రభుత్వ బోధనాసుపత్రుల వైపు వెళ్తుండటంతో అక్కడ రద్దీపెరిగింది.
ఆ రెండు హామీలు నెరవేర్చితే..?
ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నట్లు వైద్య సేవలకు ఎంతోకొంత డబ్బులిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ అలా చేస్తే ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వెనకడుగు వేస్తున్నారు. వారు చేసే సేవలకు ఇతరత్రా ఏదో రకంగా మేలు చేసేలా హామీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీలోని దాదాపు 100 రకాల చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులకే సర్కారు పరిమితం చేసింది. వాటికి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయట్లేదు. ఆ చికిత్సలను ప్రైవేటు బోధనాసుత్రులకూ అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఆ డిమాండ్ నెరవేర్చే అంశంపై చర్చ జరుగుతోంది. అలాగే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రైవేటు బోధనాసుపత్రులకూ వర్తింపజేయాలని యాజమాన్యాలు విన్నవిస్తున్నాయి. వీటిపై ఆలోచించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
సర్కారు దవాఖానాల్లో ఓపీ సమయం పెంపు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సమయాన్ని 2 గంటలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ చూస్తుండగా, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో ఈ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు 110 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉన్న డయాగ్నిస్టిక్స్ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment