‘నీట్‌’తోనే ఆయుష్‌ సీట్ల భర్తీ | Ayush seat replacement with NEET | Sakshi
Sakshi News home page

‘నీట్‌’తోనే ఆయుష్‌ సీట్ల భర్తీ

Published Thu, Feb 15 2018 2:12 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

Ayush seat replacement with NEET - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య డిగ్రీ కోర్సుల సీట్లను ఇకపై జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆధారంగానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల సీట్లనే తప్పనిసరిగా నీట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. తాజాగా ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ డిగ్రీ కోర్సుల సీట్లను కూడా నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

రాష్ట్రంలో వైద్య విద్యను పర్యవేక్షించే కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఈ మేరకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలు 10 ఉన్నాయి. వీటిలో మొత్తం 695 సీట్లు ఉన్నాయి. నాచురోపతి–యోగిక్‌ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. వైద్య విద్యకు సంబంధించి అన్ని కోర్సులకు ఈసారి ఉమ్మడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

నీట్‌ తప్పనిసరి
కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులతోపాటు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సుల్లో చేరాలనుకునేవారు కచ్చితంగా నీట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. మే 6న నీట్‌ జరగనుంది. కాళోజీ వర్సిటీ రాష్ట్రంలోని ఆయుర్వేద అనుబంధ కోర్సుల సీట్లను గతేడాది నీట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేసింది. వచ్చే ఏడాది కూడా ఈ ర్యాంకుల ప్రాతిపదికతోనే కౌన్సెలింగ్‌ జరగనుంది.
– బి.కరుణాకర్‌రెడ్డి, వైస్‌ చాన్స్‌లర్, కాళోజీ వర్సిటీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement