సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో నిపా వైరస్ కేసులు నమోదైనట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ కే.రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఈ వైరస్‌కు సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అన్నారు. వ్యాధి ప్రబలుతోందనే వదంతులతో ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు.
‘ఫీవర్ హాస్పిటల్‌లో జ్వరంతో బాధ పడుతున్న ఓ వ్యక్తికి ‘నిపా’ సోకిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానితుడు కొద్ది రోజుల క్రితం కేరళ వెళ్లొచ్చాడు. వ్యాధి నిర్ధారణ కోసం అతని రక్త నమూనాలను పుణెలో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కు పంపామ’ని రమేశ్ తెలిపారు. రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
నిపా వైరస్ ప్రబలిన ప్రాంతానికి అనుమానితుడు సందర్శించిన పట్టణానికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుందని ఆయన తెలిపారు. అనుమానితుడికి వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని రమేశ్ అభిప్రాయపడ్డారు. కాగా, మెదడుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. పళ్లు, కూర గాయలు శుభ్రంగా కడిగిన తర్వాత తినాలని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment