సాక్షి, బెంగుళూరు: కేరళను వణికిస్తున్న నిపా వైరస్ కర్ణాటకలోకి ప్రవేశించిందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కేరళలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన మంగుళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు జ్వరం బారిన పడ్డారని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రధానాధికారి బుధవారం తెలిపారు. వారికి నిపా వైరస్ సోకొచ్చనే కారణంగా ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు.
మంగుళూరు ఆరోగ్య సేవల పర్యవేక్షకుడు బీవీ రాజేష్ మాట్లాడుతూ.. ‘కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన 20 ఏళ్ల యువకుడు, 75 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను మణిపాల్ రీసెర్చి సెంటర్‌కు పంపామ’ని తెలిపారు. రక్త పరీక్షల నివేదిక గురువారం రానుందనీ, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామన్నారు.
నిపా వైరస్ కారణంగా కోజికోడ్, మలప్పురం జిలాల్లో 10 మంది మరణించారనీ, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు సమాచారమిచ్చామని ఆమె తెలిపారు. కాగా, ఈ వైరస్ బాధితులకు చికిత్సనందిస్తూ లినీ అనే నర్సు సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment