న్యూఢిల్లీ: జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పీజీ డిప్లొమాను పునరుద్ధరించింది. నీట్–పీజీ పరీక్ష పాస్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థులను ఈ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఈ డిప్లొమా కోర్సులు ప్రారంభించాలంటే, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ) నుంచి అక్రెడిటేషన్ తీసుకొన్న, కనీసం 100 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆరోగ్య శాఖ కింద పనిచేసే ఎన్‌బీఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎనిమిది ప్రధాన విభాగాల్లో రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించనుంది.
అనస్తీషియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ఈఎన్‌టీ, టీబీ, హృద్రోగ సంబంధిత కోర్సుల్లో పీజీ డిప్లొమా ప్రవేశ పెట్టనున్నారు. 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దేశంలో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ డిప్లొమా కోర్సులను డిగ్రీ కోర్సులుగా మార్చింది.
ఎంసీఐ ఈ కోర్సులను రద్దు చేయడంతో ఏర్పడిన లోటును పూడ్చడానికి ఆరోగ్య శాఖ ఎన్‌బీఈని వారి పరిధిలో, డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశా లను పరిశీలించాల్సిందిగా కోరింది. గ్రామీణ, చిన్న పట్టణాలలో ప్రజలకు వైద్యమందిస్తోన్న ఆసుపత్రులకు వైద్య సిబ్బందిని అందించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఎన్‌బీఈ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పవనేంద్ర లాల్ చెప్పారు. నీతి ఆయోగ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య శాఖతో వివిధ దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ పీజీ డిప్లొమా కోర్సులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment