భారతదేశంలో సుమారు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. హిందీ మీడియం విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహారాష్ట్రలో చదవటం కష్టమైపోతుంది. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయం. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కేంద్ర పాలకులు కొనియాడుతున్నారు. కానీ నిజమైన పునరుజ్జీవనం భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది.
ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించిన మూడు సెట్ల వైద్య పాఠ్య పుస్తకాలను గత వారాంతంలో భోపాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈ పాఠ్యపుస్తకాలు భాగం. నూతన విద్యావిధానం అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ఆదేశాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోంది. ఇతర అంశా లతోపాటు, భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను నూతన విద్యావిధానం నొక్కి చెబుతోంది. వృత్తివిద్యా కోర్సుల కోసం జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలు వంటి అన్ని ప్రధానమైన పోటీ పరీక్షలను ఇప్పటికే ఇంగ్లిష్‌తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వ హిస్తున్నారు.
యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవలే ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా ఈ విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషల్లో బోధన పూర్తిగా కొత్త విషయం కాదు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు వివిధ భారతీయ భాషల్లో పీహెచ్డీ స్థాయి వరకు కోర్సులను ప్రతిపాదిస్తున్నాయి. ఆయుర్వేదిక్ వైద్య కోర్సులను హిందీ, ఇతర భారతీయ భాషల్లో బోధిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం, తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1918 నుంచి 1948 వరకు ఉర్దూలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులను బోధించారు. భోపాల్‌లో పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల వెనుక లాజిక్ ఏమిటంటే– ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అభిజ్ఞా నైపుణ్యాలు నేర్చుకోవడంలో పిల్లలు మెరుగ్గా ఉంటారన్నదే.
మాతృభాషల్లో విద్యాబోధన వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ మార్పును మరీ తొందరగా మొదలెట్టినట్లు కనిపిస్తోంది. సాంకే తిక, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదిం చడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, శాస్త్రీయ పదజాలాన్ని ఉపయో గించడమే. ఇంగ్లిష్‌లోని మూల పదజాలాన్ని అలాగే ఉంచాలా, భార తీయ భాషల్లోకి అనువదించవచ్చా? భోపాల్‌లో విడుదల చేసిన మూడు మెడికల్ పుస్తకాల (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ) టైటిల్సు చూసినట్లయితే, ఇంగ్లిష్‌లో సుపరిచితమైన పదాలను యథా తథంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంటే వివరణాత్మక విషయాన్ని హిందీలో అందుబాటులో ఉంచుతారు. అది సంస్కృతీకరించిన హిందీలా కాకుండా, వాడుక భాషలోనే ఉంటుందని ఆశిద్దాము.
ఏవిధంగా చూసినా సరే, వైద్య పుస్తకాలను అనువదించటం కష్టమైన ప్రయత్నం. ఎందుకంటే ఈ వైద్యవిద్యా పట్టభద్రులు మానవుల ప్రాణాలతో వ్యవహరిస్తారు. పైగా పాఠ్యపుస్తకాలు అనేవి వైద్య కోర్సులో ఒక భాగం మాత్రమే. పాఠ్యపుస్తకాలతోపాటు, వంద లాది రిఫరెన్స్ పుస్తకాలు, మాన్యువల్స్ కూడా వీరు తిరగేస్తారు. ఇవి చాలావరకు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఒక డాక్టర్ శిక్షణ, బాధ్యతల నిర్వహణలో ఇవి చాలా ముఖ్యమైనవి. హిందీ, ఇతర భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వైద్యులకు తదుపరి చదువులు, కెరీర్ అవకా శాలు సవాలుగా నిలుస్తాయి.
ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సూపర్ స్పెషలైజేషన్, మెడికల్ రీసెర్చ్ వంటివి ఇంగ్లిష్‌లోనే కొనసాగుతాయి. వైద్య బోధనను భారతీయ భాషల్లోనే చేయాలని ఆతృత ప్రదర్శిస్తున్నవారు వీటిని కూడా అనువదించి ఇస్తారా, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది స్పష్టం కావడం లేదు. పాఠ్యపుస్తకాలు, ‘కోర్స్‌వేర్’తో పాటు శిక్షణ పొందిన టీచర్లు, పరీక్ష యంత్రాంగం, బహు భాషా రీసెర్చ్ జర్నల్స్ వగైరాలు కూడా అవసరమే. జాతీయ వైద్య కమిషన్ లేక రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు దీనికి సంబంధించి ఏదైనా బ్లూప్రింట్‌ను రూపొందించి ఉంటే దాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచాలి.
ప్రస్తుతం, భారతదేశంలో 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ నుండి హిందీ మీడియం డిగ్రీ ఉన్న ఒక విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహా రాష్ట్రలోని కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యలో కోర్సులు బోధిస్తు న్నప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం తప్పని సరిగా ఉండేది. పాఠ్యపుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉండేవి. ఉర్దూలో బోధన ప్రారంభం కావడానికి ముందే, ఒక అనువాద బ్యూరోని ఏర్ప ర్చారు. శాస్త్రీయ పదజాలంతో వ్యవహరించడానికి అనువాద మెథడా లజీ వృద్ధిచేశారు. రవీంద్రనాథ్ టాగూరు సహా దేశమంతటి నుంచి విద్యా నిపుణులను సంప్రదించేవారు. ప్రస్తుత సందర్భంలో అలాంటి పథకం లేదు. విద్యార్థి బృందంతో సహా విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత సంప్రదింపులు జరపడం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పలు భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాలు అనువదించినట్లయితే, అనుకూలత లేదా సమరూపతకు హామీ ఇవ్వ డానికి సాంకేతిక పదాలను ప్రామాణీకరించాలి.
మాతృభాషలో సాంకేతిక కోర్సులను బోధించడాన్ని సమర్థించే వారు జపాన్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. జపనీస్ భాషలో బోధన ద్వారా జపాన్ గొప్ప సాంకేతిక, పారిశ్రామిక ముందంజ వేయగలిగిందని చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అప్పట్లో జపాన్ నుండి ప్రేరణ పొందింది. 1920లలో హైదరాబాద్ పబ్లిక్ ఇన్స్‌ట్రక్షన్ డైరెక్టర్ సయ్యద్ రాస్ మసూద్‌ను జపనీస్ సాంకేతిక విద్యా నమూనా అధ్యయనం కోసం జపాన్ పంపించారు. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధించేవి. ఇవి దశాబ్దాలపాటు శాస్త్ర సంబంధ పదజాలాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దేశాలకూ, భారతదేశానికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అవి చాలావరకు ఏక భాషా సమాజాలు. భారత్ బహు భాషల నిలయం.
ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సెల విచ్చారు. ఇంజినీరింగ్ విద్యను భారతీయ భాషల్లోనే బోధించడానికి పది రాష్ట్రాల్లో సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లో బోధనలో పదజాలం, ఇతర సమస్యలతో పాటు అలాంటి ఇంజినీరింగ్ కోర్సులు కీలక రంగాల్లో పోటీతత్వాన్ని హరింప జేస్తాయి.
ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పరిశ్రమలో పోటీ ఎంతగా ఉంటుందో తెలిసిందే. సాఫ్ట్‌వేర్, ఐటీ ఆధారిత సేవల్లో భారత్ అగ్రగామిగా ఉండటానికి ఆంగ్లంతో సుపరిచితమైన ఇంజినీరింగ్ వర్క్ ఫోర్స్ కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నప్పుడు, సాధారణ ఉద్యోగాల స్థానంలో యాంత్రికీకరణ వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు ఈ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు.
హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కొనియాడుతున్నారు. నిజమైన పునరుజ్జీవనం అనేది భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment