![Clarity soon on future of Ukraine students - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/17/YSRCP-MP-PC-5.jpg.webp?itok=lxJagmAW)
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే చదువుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు డాక్టర్ సంజీవకుమార్, గొడ్డేటి మాధవి, బి.వి.సత్యవతి, గురుమూర్తి, చింతా అనూరాధ మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మొత్తం 918 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారన్నారని తెలిపారు.
దేశంలో కంటే వైద్యవిద్య విదేశాల్లో ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఖర్చు తక్కువగా ఉన్నందువల్లే విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌కు వేగంగా రప్పించేందుకు మేడపాటి వెంకట్, చంద్రహాసరెడ్డి, రత్నాకర్, రవీందర్‌రెడ్డిలను సీఎం జగన్ పంపించారని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల విషయమై ఈ నెల 24న ప్రపంచ దేశ ప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్ విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్.ఎం.సి.తో, కేంద్రంతో చర్చిస్తామన్నారు. గ్రామాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వెయ్యి జనాభాకు ఒక డాక్టర్, ప్రతి రెండువేల జనాభాకు ఒక పి.హెచ్.సి. ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ప్రతి పదివేల మందికి ఒక డాక్టర్ ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment