సాక్షి, అమరావతి : ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వైద్య పరీక్షల్లోనూ కోట్లు కొల్లగొట్టడానికి ప్రభుత్వం యంత్రాంగం పథకరచన చేసింది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను ఓ కార్పొరేట్ సంస్థకు అప్పగించి కమీషన్లు కొట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య పరీక్షల్లోనూ అలాగే కమీషన్లు జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 32 లక్షల మందికి అందించాల్సిన వైద్య పరీక్షల వ్యవహారంలో ఓ కంపెనీ నుంచి రూ. కోట్లు కమీషన్లు అధికారులకు ముట్టినట్టు తెలుస్తోంది. విజయవాడ బందరు రోడ్డులోని ఓ స్టార్ హోటల్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం ఇటీవలే జరిగిందని, ఆరోగ్యశాఖ సలహాదారు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారని విశ్వసనీయ సమాచారం. కమీషన్ల బేరం కుదిరాక రాత్రికి రాత్రి టెండరు నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశారు.
కంపెనీకి అనుకూలంగా నిబంధనలు..
తమకు అనుకూలమైన ఆ కంపెనీకి వైద్య పరీక్షల నిర్వహణ అప్పగించేందుకు వీలుగా నిబంధనలు మార్చాక టెండరు డాక్యుమెంటును ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్రమౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. తర్వాత ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. అక్కడకి వచ్చిన బిడ్డర్లకు కొత్తగా రూపొందించిన టెండర్ డాక్యుమెంటును ఇచ్చారు. మొదటి డాక్యుమెంట్‌లో గుండె వైద్య పరీక్షలు, దంతవైద్య పరీక్షలు నిర్వహణలో ఆయా సంస్థలకు మూడేళ్ల పూర్వ అనుభవం ఉండాలని ఉండగా కొత్త డాక్యుమెంటులో అది లేకపోవడాన్ని బిడ్డర్లు గుర్తించారు. అంతేగాక ప్రతి జిల్లాలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్ ఉండాలనే నిబంధన చేర్చారు. ఈ రెండు కూడా కమీషన్లు తీసుకున్న కంపెనీ కోసం మార్చినవే. దీంతో అధికారులతో బిడ్డర్లు వాగ్వాదానికి దిగారని తెలిసింది. కొత్త నిబంధనలు మార్చబోమని అధికారులు చెప్పడంతో సమావేశానికి వచ్చిన బిడ్డర్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇక రెండు మూడు రోజుల్లో కమీషన్లు ఇచ్చిన సంస్థకు నిర్వహణా పనులు కట్టబెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు గాను సదరు కంపెనీకి ఏటా రూ. 70 కోట్ల చొప్పున మూడేళ్ల కాలానికి రూ. 210 కోట్లు చెల్లించనున్నట్టు తెలిసింది.
నాలుగేళ్లుగా కొలిక్కిరాని వైద్యం
గడిచిన నాలుగేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్ల వైద్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధానపరిషత్ పరిధిలో 5 వేల మంది ఉద్యోగులు ఉంటే వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకూ కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేకపోయారు. అంతేగాక ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు, గ్రంథాలయాల సిబ్బంది సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారికి కార్డులు రాలేదు. ప్యాకేజీలు తక్కువగా ఉన్నాయన్న కారణంగా చాలా ఆస్పత్రులు ఇప్పటికీ నగదు రహిత వైద్యానికి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మళ్లీ గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు, దంతవైద్య పరీక్షలు తొలగించి దారుణంగా దెబ్బకొడుతున్నారని, గుండె జబ్బుల పరీక్షలు చేయించుకునేవారే ఎక్కువ ఉండగా దాన్ని పరీక్షల నుంచి తొలగించడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేం చెప్పినచోటే కళ్లద్దాలు కొనాలి
ఉచితంగా కంటిపరీక్షలు, కళ్లద్దాలు ఇచ్చే పథకాన్ని ఓ ప్రైవేటు సంస్థకు ఇటీవలే అప్పజెప్పారు. కాగా ఇప్పుడు ఆరోగ్యశాఖలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి.. కళ్లద్దాలు తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని ఆ ప్రైవేటు సంస్థపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఆ సంస్థ ససేమిరా అంటున్నా.. కళ్లద్దాల సంస్థతో కమీషన్లు మాట్లాడుకున్న ఆ వ్యక్తి వినిపించుకోవడంలేదు. దీనిపై గతవారం రోజులుగా ఆ వ్యక్తి, ప్రైవేట్ సంస్థ ప్రతినిధుల మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టు అధికారులు చెప్పారు. వివిధ రకాల టెండర్లు దక్కించుకున్న వారిపై సదరు వ్యక్తి పెత్తనం చేస్తూ.. తాను చెప్పినచోటే పరికరాలు కొనుగోలు చేయాలని పట్టుబడుతున్నారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment