
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీ అంశం కొలిక్కి రావడంలేదు. వైద్య విద్య సీట్ల భర్తీ అంశంలో నేషనల్ పూల్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ), నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి.
ఈ నేపథ్యంలో 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్ విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీకి మే 6న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) నిర్వహించాలని సీబీఎస్‌ఈ ఇప్పటికే నిర్ణయించింది. అయితే నేషనల్ పూల్ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు జారీ చేయకపోవడం అయోమయానికి దారితీస్తోంది.
15 శాతంపై అస్పష్టత..
నేషనల్‌పూల్ పరిధిలో ప్రస్తుతం 4,157 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ, ఏపీ ప్రస్తుతం నేషనల్ పూల్‌లో లేవు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో 15 శాతం సీట్లను మెరిట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో 3,200 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు ఉన్నాయి.
ఈ సీట్లలో 85 శాతం స్థానికులకు, మరో 15 శాతం సీట్లలో మెరిట్ కోటా కింద ఏపీ వారికి దక్కే అవకాశం ఉంటోంది. ఏపీలోనూ ఇదే విధానం అమలవుతోంది. మన రాష్ట్రంలో నేషనల్ పూల్ అమలైతే మెరిట్ కోటా సీట్ల భర్తీ పూర్తిగా మారనుంది. నేషనల్ పూల్‌ను అమలు చేస్తే ఏపీకి 15 శాతం సీట్ల కేటాయింపు ఉంటుందా? లేదా? అనే విషయంపై అస్పష్టత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment