నీట్‌లో బాలికల హవా | CBSE declares results of National Eligibility-Cum-Entrance Test-UG, 2016. | Sakshi
Sakshi News home page

నీట్‌లో బాలికల హవా

Published Wed, Aug 17 2016 1:25 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

నీట్‌లో బాలికల హవా - Sakshi

నీట్‌లో బాలికల హవా

* వైద్య విద్య జాతీయ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించిన సీబీఎస్‌ఈ
* నీట్-1, నీట్-2 రెండు పరీక్షల ఫలితాలనూ కలిపి ర్యాంకుల ప్రకటన

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో బాలుర కన్నా బాలికలే అధిక సంఖ్యలో విజయం సాధించారు. తొలి 15 శాతం మందిలో బాలికల (8,266 మంది) కన్నా.. బాలురే (11,058 మంది) ఎక్కువగా ఉన్నప్పటికీ.. మొత్తంగా అర్హత సాధించిన వారిలో బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది. రెండు విడతలుగా నిర్వహించిన నీట్ పరీక్షను కలిపేసి ఒకే పరీక్ష కింద ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం ప్రకటించింది.

మొత్తం 4,09,477 మంది అర్హత సాధించగా.. అందులో 2,26,049 మంది బాలికలు, 1,83,424 మంది బాలురు ఉన్నారు. నీట్ పరీక్ష 7,31,223 మంది రాశారు. 720 మార్కులకుగాను 685 మార్కులు సాధించి హేత్ షా ప్రథమ స్థానంలో నిలిచాడు. ఏకాన్ష్ గోయల్ (682) రెండో స్థానం, నిఖిల్ బాజియా (678) మూడో స్థానం సాధించారు. జనరల్ కేటగిరీలో 145 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. జనరల్ కేటగిరీలో 1,71,329 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరంతా కౌన్సిలింగ్‌కు అర్హత సాధించారు. ఓబీసీ కేటగిరీలో కటాఫ్ 678 నుంచి 118 మార్కులుగా ప్రకటించారు. ఈ కేటగిరీలో అర్హత సాధించినవారు 1,75,226 మంది ఉన్నారు.

ఇలా వివిధ కేటగిరీలకు చెందిన వారి కటాఫ్ మార్కుల వివరాలను ప్రకటించారు. ఫలితాలు వెల్లడి కావటంతో వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సీబీఎస్‌ఈ (కేంద్ర పాఠశాల విద్యా బోర్డు) మే 1న నీట్-1, జూలై 24న నీట్-2 పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు పరీక్షల ఫలితాలను కలిపి నీట్-2016 ఫలితాలుగా ప్రకటించామని.. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించామని సీబీఎస్‌ఈ తెలిపింది. పరీక్షా ఫలితాలు http://results.digilocker.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయంది.   
 
నీట్  ద్వారానే యాజమాన్య సీట్ల భర్తీ
తెలంగాణలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. అవిగాక మరో మూడు ప్రైవేటు కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. వాటిల్లో 450 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా పోను మిగిలిన మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 1,250 సీట్లు ఉన్నాయి. డెంటల్‌లో ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,040 సీట్లున్నాయి. వాటిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 520 ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నింటి నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 1,000 మేనేజ్‌మెంట్ కోటా సీట్లనూ ఇలానే భర్తీ చేస్తారు. నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రస్థాయిలో సాధించిన ర్యాంకుల జాబితాను నీట్ నిర్వాహకులు రాష్ట్రానికి అందజేస్తారు. ఆ ర్యాంకుల ప్రకారమే రాష్ట్రంలోని ఆయా సీట్లనూ భర్తీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement