కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఇందులో భాగంగా వైద్య కళాశాలలకు సైతం వాటిల్లోని ప్రమాణాలు, కొన సాగుతున్న పరిశోధనలు, అందుతున్న సేవలు, పడకల సామర్థ్యం.. ఆక్యుపెన్సీ, అవుట్ పేషెంట్లు, బోధన సిబ్బంది, ఆర్థిక వనరులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు, దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటిస్తుంది.
ఇదే క్రమంలో 2021 సంవత్సరానికి కూడా ప్రకటించింది. అయితే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కూడా దేశంలోని టాప్ 50 వైద్య కళాశాలల్లో చోటు దక్కలేదు. ఈ సంవత్సరమే కాదు..గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో వైద్య విద్య దుస్థితికి ఇదే నిదర్శనమని వైద్య నిపుణులు అంటున్నారు.
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: ప్రజల ప్రాణాలు కాపాడేలా చదువు నేర్పే వైద్య కళాశాలలు రాష్ట్రంలో తూతూమంత్రంగా నడుస్తున్నాయి. బోధన సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభా వం చూపిస్తోంది. ప్రధానంగా అధ్యాపకులు లేకపోవ డంతో వైద్య విద్యలో నాణ్యత నాసిరకంగా మారుతోంది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలనూ ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రైవేటు కళాశాలలు కూడా సరిపడా బోధన సిబ్బందిని నియమించుకోవడం లేదు. ఫీజుల వసూళ్లపై చూపెడు తున్న శ్రద్ధ విద్యా ప్రమాణాలు, సదుపాయాల కల్పన, పరిశోధనలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం ఒక మెడికల్ కాలేజీకి చెందిన వారిని మరో మెడికల్ కాలేజీకి పంపించి తగిన సంఖ్య చూపించి కాలేజీని రెన్యువల్ చేయించుకుంటున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలే ఖాళీలు..!
రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలా బాద్ (రిమ్స్), వరంగల్ (కాకతీయ), మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు కలిపి 2,866 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ దాదాపు 655 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంటోం ది. కానీ నిజానికి ఈ సంఖ్య వెయ్యి వరకు ఉంటుందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు వైద్య ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఆర్‌బీ)’ను ఏర్పాటు చేసింది. ఖాళీ అయిన వెంటనే వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బోర్డు చైర్మన్‌గా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సభ్య కార్యదర్శిగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ పోస్టుల భర్తీపై శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలున్నాయి. పలు సర్కారీ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది.
నిజామాబాద్ మెడికల్ కాలేజీ...
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2013లో నెలకొల్పిన ఈ కాలేజీలో అన్ని రకాలైన 750 పోస్టులు భర్తీ చేయాల్సి ఉం డగా ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రధానంగా ప్రొఫెసర్ పోస్టులు 35 మంజూరు చేయగా, రెగ్యులర్ 21 మంది, కాంట్రాక్ట్ పద్ధతిన ఇద్దరు ఉన్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. 57 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 17 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ పద్ధతిన ఉన్నారు.
ఏకంగా 37 ఖాళీలున్నాయి. 109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 52 మంది రెగ్యులర్, 32 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నా రు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 23 మంజూరు కాగా, రెగ్యులర్ 9 మంది, కాంట్రాక్ట్‌లో 12 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 69 మంజూరు కాగా, 48 మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తుండటం గమనార్హం కాగా.. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నల్లగొండ మెడికల్ కాలేజీ...
నల్లగొండ మెడికల్ కాలేజీలో ట్యూటర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48, ప్రొఫెసర్లు 25 మంది ఉండాలి. అయితే ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 32, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 42, ట్యూటర్లు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీకి సొంత భవనం కూడా లేదు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోగల పాత భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులకు తోడు క్యాంటీన్, డైనింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీ..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆధునీకరించి అందులో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు. కళాశాలలో మొదటి సంవత్సరం 150 మంది, ద్వితీయ సంవత్సరం 150 మంది చదువుకుంటున్నారు. ట్యూటర్లు 15, ప్రొఫెసర్లు 24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48 మంది ఇలా మొత్తం 202 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ట్యూటర్లు 13, ప్రొఫెసర్లు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 80, అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మంది కలిపి మొత్తం 143 మందే పనిచేస్తున్నారు. 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పడిపోతున్న వైద్య విద్య నాణ్యత
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా అన్ని రకాల ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువు చెప్పే నాథుడే లేడు. ఉన్నవారే క్లాసులు తీసుకోవడం, పేషెంట్లను చూడడం, పేపర్లు దిద్దాల్సి ఉండటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చేప్పుడు ఒక కాలేజీ ఫ్యాకల్టీని మరో కాలేజీకి పంపిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌లో విద్యార్థులు సరిగా నేర్చుకోలేకపోతున్నారు. నాసిరకమైన వైద్య విద్య వల్ల పీజీ సీట్లు పొందలేకపోతున్నారు.
– విజయేందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు, జూడా
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ
మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 150 సీట్లతో మొదలైంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 25 సీట్లు పెరిగాయి. కళాశాలకు మొత్తం 981 పోస్టులు మంజూరు చేయగా ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 242 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్టు కలిపి 121 బోధన సిబ్బంది ఉండగా మరో 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆదిలాబాద్ రిమ్స్...
ఆదిలాబాద్ రిమ్స్ 120 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతోంది. అయితే అనేక ఖాళీల కారణంగా వైద్య కళాశాలలో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. మరోపక్క ఖాళీ పోస్టుల కారణంగా ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఇలావుండగా రిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అన్ని హంగులతో నిర్మించారు కానీ, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
కాకతీయ మెడికల్ కాలేజీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కాకతీయ మెడికల్ కాలేజీ 250 సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలోని 26 విభాగాల్లో 250 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇందులో 34 మంది ప్రొఫెసర్లకు గాను 27 మంది ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 71మంది అసోçసియేట్ ప్రొఫెసర్లకు 43 మంది ఉన్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
145 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 100 మంది ఉండగా 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీలో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన అకడమిక్ భవనం పూర్తయితే విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. 250 మంది విద్యార్థులు ఒకే తరగతి గదిలో సౌకర్యంగా కూర్చునే అవకాశం కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment