వైద్య,ఆరోగ్యశాఖకు ఈసారి నిధులు గణనీయంగా పెరిగాయి. 2021–22 బడ్జెట్లో రూ.6,295 కోట్లు కేటాయిస్తే.. 2022–23 బడ్జెట్లో ఏకంగా రూ.11,237 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.4,942 కోట్లు అదనంగా కేటాయించారన్నమాట. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. ఏ జిల్లాలో ఎప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలో నిర్ధారించారు.
హైదరాబాద్ నగరం నలుదిక్కులా.. అంటే గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు, నిమ్స్‌లో మరో రెండు వేల పడకలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి. వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– సాక్షి, హైదరాబాద్
వచ్చే ఏడాది నుంచి 8 మెడికల్ కాలేజీలు
ప్రతి జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 5 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది.
మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 8 కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. 2023 సంవత్సరంలో మిగతా జిల్లాలు.. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో ఏర్పాటు చేయనుంది. కొత్త కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. కాగా ఆరోగ్యశ్రీకి రూ.1,343 కోట్లు, కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు కేటాయించింది.
వైద్యారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం
బడ్జెట్‌లో 4.5 శాతం ఆరోగ్యరంగ అభివృద్ధికే కేటాయించడం శుభపరిణామమని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావులకు డిపార్ట్‌మెంట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దవాఖాన్లాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ తదితరాలకు రూ.1,400 కోట్లు కేటాయించారని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మారుమూల ప్రజలకు కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment