faculty shortage
-
అరకొర ఫ్యాకల్టీ.. క్లాసులు పల్టీ.. దయనీయ స్థితిలో బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రస్తుతం సగం ఫ్యాకల్టీతోనే నడుస్తున్నాయి. బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)కి సంబంధించి మంజూరైన పోస్టులు 183 ఉండగా, కేవలం 92 మందినే నియమించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని వెల్లడిస్తుండగా.. ఏకంగా 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఎయిమ్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభమైన అనేక ఎయిమ్స్‌ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భోపాల్ ఎయిమ్స్‌లో 305 పోస్టులకు, 105 ఖాళీగా ఉన్నాయి. భువనేశ్వర్‌లో 305కు గాను 74, జో«ధ్‌పూర్‌లో 305కు గాను 77, పాట్నాలో 305కు గాను 151, రాయిపూర్లో 305కు 135, రిషికేష్‌లో 305కు గాను 106, మంగళగిరిలో 183కు గాను 65, నాగ్‌పూర్‌లో 183కు గాను 64, కళ్యాణిలో 183కు గాను 88, గోరఖ్‌పూర్‌లో 183కు గాను 105, భటిండాలో 183కు గాను 72, భిలాస్పూర్లో 183కు గాను 90, గౌహతిలో 183కు గాను 89, రాజ్‌కోట్‌లో 183కు గాను 143, విజయ్‌పూర్‌లో 183కు గాను 107, రాయ్‌బరేలీలో 183కు గాను 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ ఇంత తక్కువగా ఉండటం వల్ల తరగతులు సరిగా జరగక పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని రాష్ట్ర వైద్య వర్గాలు చెబుతున్నాయి. 2021లో శస్త్రచికిత్సలు షురూ బీబీనగర్ ఎయిమ్స్‌లో 2021లో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం ప్రధాన శస్త్రచికిత్సలు 26 జరగ్గా, 2022 జూలై నాటి వరకు 294 జరిగాయి. ఇక చిన్నపాటి శస్త్రచికిత్సలు ఇప్పటివరకు 3,600పైగా జరిగాయి. అయితే సీనియర్ రెసిడెంట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచ్చింది. అలాగే అక్కడ నిమ్స్ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. అనంతరం 2019 నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్‌తో అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రధాన ఉద్దేశం. కీలకమైన 50 రకాల స్పెషలిస్టు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంబీబీఎస్, నర్సింగ్ విద్య అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఎయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో, ఔటర్‌రింగ్ రోడ్డుకు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అన్ని జిల్లాలకూ సులువుగా వెళ్లి వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు ఇక్కడి నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిపుణులైన వైద్యులు సులభంగా వచ్చివెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంత కీలకమైన ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
డాక్టర్ చదువు డీలా!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఇందులో భాగంగా వైద్య కళాశాలలకు సైతం వాటిల్లోని ప్రమాణాలు, కొన సాగుతున్న పరిశోధనలు, అందుతున్న సేవలు, పడకల సామర్థ్యం.. ఆక్యుపెన్సీ, అవుట్ పేషెంట్లు, బోధన సిబ్బంది, ఆర్థిక వనరులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు, దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇదే క్రమంలో 2021 సంవత్సరానికి కూడా ప్రకటించింది. అయితే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కూడా దేశంలోని టాప్ 50 వైద్య కళాశాలల్లో చోటు దక్కలేదు. ఈ సంవత్సరమే కాదు..గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో వైద్య విద్య దుస్థితికి ఇదే నిదర్శనమని వైద్య నిపుణులు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ప్రజల ప్రాణాలు కాపాడేలా చదువు నేర్పే వైద్య కళాశాలలు రాష్ట్రంలో తూతూమంత్రంగా నడుస్తున్నాయి. బోధన సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభా వం చూపిస్తోంది. ప్రధానంగా అధ్యాపకులు లేకపోవ డంతో వైద్య విద్యలో నాణ్యత నాసిరకంగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలనూ ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రైవేటు కళాశాలలు కూడా సరిపడా బోధన సిబ్బందిని నియమించుకోవడం లేదు. ఫీజుల వసూళ్లపై చూపెడు తున్న శ్రద్ధ విద్యా ప్రమాణాలు, సదుపాయాల కల్పన, పరిశోధనలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం ఒక మెడికల్ కాలేజీకి చెందిన వారిని మరో మెడికల్ కాలేజీకి పంపించి తగిన సంఖ్య చూపించి కాలేజీని రెన్యువల్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలే ఖాళీలు..! రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలా బాద్ (రిమ్స్), వరంగల్ (కాకతీయ), మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు కలిపి 2,866 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ దాదాపు 655 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంటోం ది. కానీ నిజానికి ఈ సంఖ్య వెయ్యి వరకు ఉంటుందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)’ను ఏర్పాటు చేసింది. ఖాళీ అయిన వెంటనే వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బోర్డు చైర్మన్‌గా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సభ్య కార్యదర్శిగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ పోస్టుల భర్తీపై శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలున్నాయి. పలు సర్కారీ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీ... నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2013లో నెలకొల్పిన ఈ కాలేజీలో అన్ని రకాలైన 750 పోస్టులు భర్తీ చేయాల్సి ఉం డగా ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రధానంగా ప్రొఫెసర్ పోస్టులు 35 మంజూరు చేయగా, రెగ్యులర్ 21 మంది, కాంట్రాక్ట్ పద్ధతిన ఇద్దరు ఉన్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. 57 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 17 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ పద్ధతిన ఉన్నారు. ఏకంగా 37 ఖాళీలున్నాయి. 109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 52 మంది రెగ్యులర్, 32 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నా రు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 23 మంజూరు కాగా, రెగ్యులర్ 9 మంది, కాంట్రాక్ట్‌లో 12 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 69 మంజూరు కాగా, 48 మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తుండటం గమనార్హం కాగా.. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ మెడికల్ కాలేజీ... నల్లగొండ మెడికల్ కాలేజీలో ట్యూటర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48, ప్రొఫెసర్లు 25 మంది ఉండాలి. అయితే ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 32, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 42, ట్యూటర్లు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీకి సొంత భవనం కూడా లేదు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోగల పాత భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులకు తోడు క్యాంటీన్, డైనింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీ.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆధునీకరించి అందులో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు. కళాశాలలో మొదటి సంవత్సరం 150 మంది, ద్వితీయ సంవత్సరం 150 మంది చదువుకుంటున్నారు. ట్యూటర్లు 15, ప్రొఫెసర్లు 24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48 మంది ఇలా మొత్తం 202 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ట్యూటర్లు 13, ప్రొఫెసర్లు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 80, అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మంది కలిపి మొత్తం 143 మందే పనిచేస్తున్నారు. 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పడిపోతున్న వైద్య విద్య నాణ్యత రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా అన్ని రకాల ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువు చెప్పే నాథుడే లేడు. ఉన్నవారే క్లాసులు తీసుకోవడం, పేషెంట్లను చూడడం, పేపర్లు దిద్దాల్సి ఉండటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చేప్పుడు ఒక కాలేజీ ఫ్యాకల్టీని మరో కాలేజీకి పంపిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌లో విద్యార్థులు సరిగా నేర్చుకోలేకపోతున్నారు. నాసిరకమైన వైద్య విద్య వల్ల పీజీ సీట్లు పొందలేకపోతున్నారు. – విజయేందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు, జూడా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 150 సీట్లతో మొదలైంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 25 సీట్లు పెరిగాయి. కళాశాలకు మొత్తం 981 పోస్టులు మంజూరు చేయగా ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 242 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్టు కలిపి 121 బోధన సిబ్బంది ఉండగా మరో 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్... ఆదిలాబాద్ రిమ్స్ 120 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతోంది. అయితే అనేక ఖాళీల కారణంగా వైద్య కళాశాలలో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. మరోపక్క ఖాళీ పోస్టుల కారణంగా ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఇలావుండగా రిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అన్ని హంగులతో నిర్మించారు కానీ, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కాకతీయ మెడికల్ కాలేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కాకతీయ మెడికల్ కాలేజీ 250 సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలోని 26 విభాగాల్లో 250 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇందులో 34 మంది ప్రొఫెసర్లకు గాను 27 మంది ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 71మంది అసోçసియేట్ ప్రొఫెసర్లకు 43 మంది ఉన్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 145 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 100 మంది ఉండగా 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీలో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన అకడమిక్ భవనం పూర్తయితే విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. 250 మంది విద్యార్థులు ఒకే తరగతి గదిలో సౌకర్యంగా కూర్చునే అవకాశం కూడా ఉంటుంది. -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
ఐఐటీల్లో 34 శాతం అధ్యాపకుల కొరత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. ఏడాదికేడాది ఆ సంస్థల్ని విస్తరిస్తూ పోతున్న కేంద్ర ప్రభుత్వం అందులో అధ్యాపకుల నియామకంపై దృష్టి పెడుతున్నట్టుగా లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉంటే అన్ని సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య అధ్యాపకుల కొరత. అన్ని సంస్థల్లో కలిపి మొత్తంగా చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 34 శాతం అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పాలక్కడ్, తిరుపతి, గోవా వంటి కొత్తగా ఏర్పాటైన ఐఐటీల్లోనే కాదు ఎంతో ఘనతవహించిన ముంబై, ఖరగపూర్, కాన్పూర్ వంటి సంస్థల్లోనూ ఇదే దుస్థితి. ఎప్పట్నుంచో ఉన్న ఈ పాత సంస్థల్లోనే అధ్యాపకుల కొరత 25 శాతం నుంచి 45శాతం వరకు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఏ ఐఐటీలో అధ్యాపకుల కొరత ఎంత? ఐఐటీ–గోవా 62 % ఐఐటీ–భిలాయ్ 58 % ఐఐటీ–ధర్వాడ్ 47 % ఐఐటీ–ఖర్గపూర్ 46 % ఐఐటీ–కాన్పూర్ 37 % ఐఐటీ–ఢిల్లీ 29 % ఐఐటీ–చెన్నై 28 % ఐఐటీ–ముంబై 27 % ఎందుకీ పరిస్థితి ? ఐఐటీల్లో ఫాకల్టీ కొరత కొత్త సమస్యేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుల కొరత, సదుపాయాల లేమితో ఐఐటీల ప్రతిష్ట మసకబారుతోంది. ఐఐటీల్లో డిగ్రీలు తీసుకుంటున్న వారు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోతున్నారే తప్ప, తిరిగి ఆ సంస్థల్లో ఫాకల్టీగా చేరుదామని అనుకోవడం లేదు. ఒకప్పుడు ఐఐటీలో విద్యాభ్యాసం చేసినవారిలో 15 శాతం మంది అదే సంస్థల్లో అధ్యాపకులగా చేరేవారు. కానీ ఇప్పుడది గణనీయంగా తగ్గిపోయింది. ఐఐటీ విద్యార్థుల్లో 50శాతం మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటే మిగిలిన వారిలో అత్యధిక శాతం భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అధ్యాపక వృత్తి పట్ల యువతరంలో ఆకర్షణ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రప్రభుత్వం అందులో మౌలిక సదుపాయాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఐఐటీలను మంజూరు చేస్తూ ఉండడంతో బోధనా నైపుణ్యం కలిగిన అధ్యాపకులెవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ‘కర్ణాటకలోని ధర్వాడ్ వంటి పట్టణాల్లో సదుపాయాలే ఉండవు. పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైనవి లేని పట్టణాలకు నైపుణ్యం కలిగిన బోధకులు ఎందుకు వస్తారు’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి ? ఐఐటీల్లో అధ్యాపకుల కొరత అధిగమించడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీలో ఒక నియామకం జరగాలంటే ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ఐఐటీల సంఖ్యమాత్రమే పెంచితే సరిపోదు. అధ్యాపకుల్ని ఆకర్షించేలా వేతనాలు పెంచడం, గ్యాడ్యుయేషన్‌తో చదువు ఆపేయకుండా విద్యార్థులు పీహెచ్డీ చేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ కొరతని అధిగమించగలం’ అని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐటీల్లోకి ఫారెన్ ఫాకల్టీని కూడా తీసుకురావడానికి వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు పదవీవిరమణ చేసిన అధ్యాపకుల్ని తిరిగి తీసుకోవడం, ఉన్నవారికి మరి కొన్నేళ్లు పదవీకాలం పొడిగింపు వంటి చర్యలు కూడా తీసుకోనుంది. ఏదిఏమైనా ఐఐటీల ప్రతిష్ట మరింత మసకబారకుండా కేంద్రమే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వైవీయూకు సుస్తీ
సాక్షి కడప/వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో పాలన పడకేయడంతో అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. కీలకమైన విభాగాలన్నీ కొన్ని నెలలుగా ఇన్చార్జిల పాలనలో సాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా ఏర్పడ్డ యోగివేమన విశ్వవిద్యాలయం ఆయన హయాంలో ఒక వెలుగు వెలుగగా నేడు.. దీనస్థితికి చేరుకుంది. అధ్యాపకుల కొరతతో పాటు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన పాలకమండలి లేకపోవడంతో పాటు ముఖ్యమైన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, యూఆర్సీ సెల్, సీడీసీ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌తో పాటు పలు విభాగాల్లో రెగ్యులర్ అధికారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేధిస్తున్న రెగ్యులర్ అధికారుల కొరత.. వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆచార్య ధనుంజయనాయుడు 2013లో ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మరొకరిని నియమించలేదు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య టి. వాసంతినే కొంత కాలం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆమె సైతం ఇటీవల దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. అటు రిజిస్ట్రార్, ఇటు ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటికే పరీక్షల నియంత్రణాధికారిగా కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తున్న ఆచార్య జి. సాంబశివారెడ్డిని ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రిన్సిపాల్ పోస్టుకు సైతం ఎంబీఏ విభాగాధిపతిగా, డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌గా విధులు నిర్వహిస్తున్న డా.రఘునాథరెడ్డిని నియమించారు. అదే విధంగా సీడీసీ డీన్‌గా సైతం యూఆర్సీ సెల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఒక్కరే రెండు విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో నిర్ణయాల జాప్యంతో అభివృద్ధి కుంటుపడుతోందన్న అభిప్రాయం నెలకొంది. దీనికి సంబంధించి 10 డిగ్రీ కళాశాలలకు విద్యాసంవత్సరం ప్రారంభమై 6 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ శాశ్వత అఫిలియేషన్ పెండింగ్‌లో ఉండడం పరిపాలన తీరుకు నిదర్శనం. పదోన్నతుల్లోనూ వివక్ష.. యోగివేమన విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్డ్ స్కీం పేరుతో నిర్వహించే పదోన్నతుల ప్రక్రియలో సైతం వివక్ష చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో దాదాపు 50 మందికి గ్రేడ్ మార్చిన అధికారులు మిగతా వారిని గూర్చి పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. మరో 10 మంది అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నా వారికి పదోన్నతి కల్పించడంలో జాప్యం వల్ల కీలకమైన పదవులు ఖాళీగా ఉన్నాయి. బోధనాపరంగా నాణ్యమైన విద్యనందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అకడమిక్ కన్సల్టెంట్ల కొరత వెంటాడుతోంది. దీనికి తోడు డిసెంబర్ నెలలో విశ్వవిద్యాలయం నుంచి 7 మంది సహాయ ఆచార్యులు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు వెళుతున్నారు. వారి స్థానంలో అకడమిక్ కన్సల్టెంట్లను నియమించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు లేనట్లుంది. నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా.. విశ్వవిద్యాలయ అభివృద్ధి నిధులు ఉన్నా ‘నిజాయితీ’ పేరుతో వాటిని వినియోగించకుండా ఉండటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ రెవిన్యూ అకౌంట్, బ్లాక్గ్రాంట్ల నిధులను అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించే వీలున్నా మిన్నకుండిపోవడం పట్ల అసంతృప్తి నెలకొంది. 4 సంవత్సరాలైనా నిర్వహించని రీసెట్... యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటై దాదాపు 9 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే రీసెట్‌ను కేవలం రెండుసార్లే నిర్వహించారు. 2011 తర్వాత దాని ఊసే లేకపోవడం విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తోంది.