వైవీయూకు సుస్తీ
సాక్షి కడప/వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో పాలన పడకేయడంతో అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. కీలకమైన విభాగాలన్నీ కొన్ని నెలలుగా ఇన్‌చార్జిల పాలనలో సాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా ఏర్పడ్డ యోగివేమన విశ్వవిద్యాలయం ఆయన హయాంలో ఒక వెలుగు వెలుగగా నేడు.. దీనస్థితికి చేరుకుంది.
అధ్యాపకుల కొరతతో పాటు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన పాలకమండలి లేకపోవడంతో పాటు ముఖ్యమైన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, యూఆర్‌సీ సెల్, సీడీసీ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌తో పాటు పలు విభాగాల్లో రెగ్యులర్ అధికారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేధిస్తున్న రెగ్యులర్ అధికారుల కొరత..
వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆచార్య ధనుంజయనాయుడు 2013లో ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మరొకరిని నియమించలేదు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య టి. వాసంతినే కొంత కాలం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆమె సైతం ఇటీవల దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు.
అటు రిజిస్ట్రార్, ఇటు ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటికే పరీక్షల నియంత్రణాధికారిగా కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తున్న ఆచార్య జి. సాంబశివారెడ్డిని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రిన్సిపాల్ పోస్టుకు సైతం ఎంబీఏ విభాగాధిపతిగా, డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌గా విధులు నిర్వహిస్తున్న డా.రఘునాథరెడ్డిని నియమించారు. అదే విధంగా సీడీసీ డీన్‌గా సైతం యూఆర్‌సీ సెల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాస్‌ను నియమించారు.
దీంతో ఒక్కరే రెండు విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో నిర్ణయాల జాప్యంతో అభివృద్ధి కుంటుపడుతోందన్న అభిప్రాయం నెలకొంది. దీనికి సంబంధించి 10 డిగ్రీ కళాశాలలకు విద్యాసంవత్సరం ప్రారంభమై 6 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ శాశ్వత అఫిలియేషన్ పెండింగ్‌లో ఉండడం పరిపాలన తీరుకు నిదర్శనం.
పదోన్నతుల్లోనూ వివక్ష..
యోగివేమన విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్‌డ్ స్కీం పేరుతో నిర్వహించే పదోన్నతుల ప్రక్రియలో సైతం వివక్ష చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో దాదాపు 50 మందికి గ్రేడ్ మార్చిన అధికారులు మిగతా వారిని గూర్చి పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. మరో 10 మంది అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నా వారికి పదోన్నతి కల్పించడంలో జాప్యం వల్ల కీలకమైన పదవులు ఖాళీగా ఉన్నాయి.
బోధనాపరంగా నాణ్యమైన విద్యనందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అకడమిక్ కన్సల్టెంట్‌ల కొరత వెంటాడుతోంది. దీనికి తోడు డిసెంబర్ నెలలో విశ్వవిద్యాలయం నుంచి 7 మంది సహాయ ఆచార్యులు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు వెళుతున్నారు. వారి స్థానంలో అకడమిక్ కన్సల్టెంట్‌లను నియమించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు లేనట్లుంది.
నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా..
విశ్వవిద్యాలయ అభివృద్ధి నిధులు ఉన్నా ‘నిజాయితీ’ పేరుతో వాటిని వినియోగించకుండా ఉండటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ రెవిన్యూ అకౌంట్, బ్లాక్‌గ్రాంట్‌ల నిధులను అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించే వీలున్నా మిన్నకుండిపోవడం పట్ల అసంతృప్తి నెలకొంది.
4 సంవత్సరాలైనా నిర్వహించని రీసెట్...
యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటై దాదాపు 9 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే రీసెట్‌ను కేవలం రెండుసార్లే నిర్వహించారు. 2011 తర్వాత దాని ఊసే లేకపోవడం విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తోంది.