yogivemana University
-
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ
సాక్షి, వైఎస్సార్ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి తెలిపారు. చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి) -
'ఆ జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతాం'
సాక్షి, వైవీయూ: రాష్ట్రంలో వైఎస్ఆర్ కడపను విద్యలో కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఐఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో రూసా పనుల తీరును పరిశీలించేందుకు రూసా బృందం జిల్లాకు విచ్చేసింది. ఈ సందర్భంగా రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో రూసా నిధులతో నిర్మించిన నూతన భవనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూసా నిధులతో కళాశాలల రూపురేఖలు మారాయన్నారు. రూసా నిధుల సక్రమ వినియోగంలోను, ప్రగతి సాధించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రథమస్థానంలో ఉన్న కేరళతో ప్రథమస్థానం కోసం పోటీపడుతున్నామని పేర్కొన్నారు. ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం సాధించేలా వారిని ఆల్‌రౌండ్ డెవలప్మెంట్ సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థి ఆంగ్లంలో పట్టు సాధించేలా చేయాలని.. ఆంగ్లభాషను నేర్చుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రానున్న పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నింటా అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయంలో రూ.20 కోట్లు, ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు, కడపలోని ఆర్ట్స్ కళాశాలకు రూ.2 కోట్లు చొప్పున రూసా నిధులు కేటాయించమన్నారు. వీటితో పాటు పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన న్యూమోడల్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి తదుపరి ప్రతిపాదనలు పంపితే మళ్లీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం తీసుకురావడం ఒక గొప్ప విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లేనన్నారు. రానున్న రోజుల్లో అన్ని డిగ్రీ కళాశాలల్లో ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్భారత్’ పేరుతో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య, రూసా ప్రతినిధులు ఎస్. బాలయ్య, తిరుపతిరావు, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీధర్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. రవికుమార్ పాల్గొన్నారు. రూసా నిధుల వినియోగంలో వైవీయూ భేష్ రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల వినియోగంలో యోగివేమన విశ్వవిద్యాలయం పనితీరు చక్కగా ఉందని రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. హరిప్రసాద్ అన్నారు. శనివారం యోగివేమన విశ్వవిద్యాలయాన్ని రూసా బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు వీసీ ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలో రూసా నిధులు వెచ్చించి నిర్మిస్తున్న పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పరికరాలు, ఈ క్లాస్‌రూంలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ వైవీయూకు రావాల్సిన రూ.5 కోట్ల రూసా నిధులను విడుదల చేస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.శ్రీధర్‌రెడ్డి, రూసా పరిపాలనాధికారి తిరుపతయ్య, వైవీయూ రూసా కోఆర్డినేటర్ డా. విజయ్‌కుమార్‌నాయుడు, ఆచార్యులు ఎం.వి.శంకర్, చంద్రమతిశంకర్, ఏజీ దాము, నజీర్అహ్మద్, వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు డా. జయరామిరెడ్డి, రమణయ్య, శ్రీనివాసులు, ఇంజినీరింగ్ విభాగం డీఈ రామచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆది’ ప్రసంగానికి స్పందన నిల్
వైవీయూ : వైఎస్ఆర్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన రాజకీయ ప్రసంగాన్ని విద్యార్థులు పట్టించుకోలేదు. పొంతనలేని మాటలతో ప్రారంభించిన ఆయన ఉపన్యాసంలో ఎప్పటిలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసేందుకు యత్నించగా.. అదే సమయంలో వెనుకవైపు ఉన్న యువత జైజగన్.. అంటూ ఆయనకు తిరుగు సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైవీయూకు రూ. 100కోట్లకు పైగా నిధులు కేటాయించగా.. పస్తుతం ప్రభుత్వం రూ. 40 కోట్లను ఇచ్చారని.. ఇది వైఎస్ హయాం కంటే ఎక్కువ ఎక్కువ నిధులు ఇచ్చారని పేర్కొనడం గమనార్హం. చివరగా ప్రతి ఒక్కరూ 10 మొక్కలు కాదు 100 మొక్కలు నాటాలని.. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వానికి రాజకీయాల్లో అండగా నిలవాలని కోరారు. అండగా నిలుస్తామనేవారు చేతులెత్తి మద్ధతు ప్రకటించాలని కోరారు. ఈయన పిలుపుకు విద్యార్థులెవరూ చేతులెత్తకపోవడంతో మరోసారి చేతులెత్తాలని కోరినా విద్యార్థులెవరూ పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఉపన్యాసం ముగించారు. సభలో సీఎం డౌన్‌డౌన్ నినాదాలు.. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో తమ గొం తును వినిపించేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో తామేమైనా అసాంఘిక శక్తులమా అంటూ వారితో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని హరించేలా ఏపీఆర్‌సెట్, స్క్రీనింగ్టెస్ట్లు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని దీని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. దీనికి ససేమిరా పోలీసులు ససేమిరా అనడంతో విద్యార్థి సంఘాల నాయకులు సీఎం గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి నాయకుల నోరు మూసి, మెడలు విరుస్తూ ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన విద్యార్థి విభాగం నాయకులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగించే సమయంలోతిరుగుముఖం పట్టిన విద్యార్థులు.. ఉదయం 7 గంటల నుంచి ముఖ్యమంత్రి కోసం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వేచి ఉన్నారు. దాదాపు 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కావడంతో అప్పటికే విసిగిపోయిన విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. వీరిని ఆపేందుకు పోలీసులు కూర్చోవాలని కోరినా పట్టించుకోకుండా వెనుతిరిగారు. -
సీకే దిన్నె పీఎస్ వద్ద ఊద్రిక్తత
-
యోగివేమన యూనివర్సిటీకి నిధుల కొరత
-
వేమన బిడ్డలకు పట్టాలు
♦ నేడు వైవీయూ స్నాతకోత్సవం ♦ 31 మందికి డాక్టరేట్లు ♦ 45 మందికి గోల్డ్‌మెడల్స్ ♦ భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి ♦ వీఎస్. సంపత్ రాక వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహిస్తున్న స్నాతకోత్సవంలో 31మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. వీరితో పాటు వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన 100 మంది విద్యార్థులు గోల్డ్‌మెడల్‌కు అర్హత సాధించారు. అయితే వీరిలో 45 మంది స్నాతకోత్సవంలో అతిథుల చేతులమీదుగా బంగారు పతకం అందుకోనున్నారు. మిగతా 55 మంది తర్వాత తీసుకోనున్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ పూర్తయిన విద్యార్థులు పట్టాలు తీసుకునేందుకు 8,507 మంది దరఖాస్తు చేయగా వీరిలో 780 మంది అతిథులు చేతులమీదుగా అందుకోనున్నారు. మిగతా 7,727 మంది తర్వాత పట్టాలు అందుకుంటారు. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలకు సంబంధించి వివిధ సంవత్సరాల్లో ప్రథములుగా నిలిచి పతకాలు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సైన్స్ విభాగం ఎమ్మెస్సీ (బోటనీ) : జి.విజయలక్ష్మి (2010-12), కె.సురేష్‌బాబు (2011-13), ఎ.రెడ్డి హిమబిందు (2012-14), పి.సునంద (2013-15). ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) : వి.శ్రీదేవి (2010-12), ఇంద్రకంటి షర్వాణి (2011-13), డి.సుశీలమ్మ (2012-14), పి.నవీన్ (2013-15). ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ) : పి.సాయిగిరీష (2010-12), కె.గురులక్ష్మి (2011-13), పి.వినయ (2012-14), జి.మల్లికార్జున (2013-15). ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్) : కె.విష్ణుప్రియ (2007-12), ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి (2008-13), ఎం.సరస్వతి (2009-14), ఎప్రసన్నబాబు (2010-15). ఎమ్మెస్సీ (జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్): ఎన్ఏ సోమయాజులు (2010-12), జి.శివకుమార్ (2011-13), పి.సుబ్బలక్షుమ్మ (2012-14), ఎం.మధుసూదన్ (2013-15). ఎమ్మెస్సీ (జియాలజీ) : బి.లక్ష్మన్న (2010-12), ఆర్.సిద్దిరాజు (2011-13), ఎం.రాజశేఖర్ (2012-14), వై.సుదర్శన్‌రెడ్డి (2013-15). జువాలజీ : కె.సూర్యనారాయణ (2010-12), డి.అనూరాధ (2011-13), పి.శేషుబాబు (2012-14), జి.రాధ (2013-15). ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ): కె.శివజ్యోతి (2010-12), సి.శిరీష (2011-13), జె.లక్ష్మిదేవి (2012-14), జి.అనూష (2013-15). ఎమ్మెస్సీ (మెటీరియల్ సైన్స్ అండ్నానో టెక్నాలజీ) : ఎన్.లక్ష్మిరెడ్డి (2010-12), ఎ.సాయికుమార్ (2011-13), ఏపీ రంగప్ప (2012-14), ఇ.సునంద (2013-15). ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్ : ఎస్ఏ తబస్సుమ్ (2010-12),వి.సుమలత (2011-13), ఎన్.జీవన సంధ్య (2012-14), ఎస్సునీత (2013-15), ఎస్.మహమ్మద్ (2013-15). ఎంఎస్సీ(ఫిజిక్స్) : బి.సుజిత (2010-12), కె.అమీదాబి (2011-13), ఎం.గురులక్ష్మి (2012-14), ఎస్.సల్మా (2013-15). బీఎస్సీ : జి.జ్యోతి (2010-13), ఎం.రాజేశ్వరి (2011-14), ఎస్.సాగరిక (2012-15). -
సహాయ నిరాకరణం
♦ వైవీయూలో కొనసాగుతున్న సమ్మె ♦ వీసీ కారు డ్రైవర్ సహా అందరూ సమ్మెలోకి.. ♦ మంగళవారం విధులకు గైర్హాజరు ♦ బోధనేతర సిబ్బంది సమస్యలపై కమిటీ ఏర్పాటు వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణలో భాగంగా మంగళవారం విధులకు గైర్హాజరయ్యారు. స్నాతకోత్సవ పనులకు సైతం వీరంతా దూరంగా ఉండిపోయారు. విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నీటిసమస్య తలెత్తడంతో అధికారులు బయటి నుంచి మినరల్ వాటర్ తెప్పించుకుని పనులు కానించారు. దీంతో పాటు వైస్ చాన్స్‌లర్ వాహన డ్రైవర్ సైతం సమ్మెలోకి వెళ్లడంతో ఆయన ప్రైవేట్ డ్రైవర్‌ను పిలిపించుకుని విధులకు హాజరయ్యారు. సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ...! గత నాలుగురోజులుగా బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో వైవీయూలో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. కాగా బోధనేతర సిబ్బంది పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటుండగా... తమ సమస్యలను పట్టించుకోనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని బోధనేతర సిబ్బంది వాదిస్తున్నారు. దీనికి తోడు స్నాతకోత్సవం, ఈనెల 30 నుంచి వైవీయూ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సమ్మె మరింతకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. సమ్మెను విరమించేందుకు పలు ప్రతిపాదనలతో సబ్‌కమిటీ వేసినట్లు సమాచారం. వైవీయూ రెక్టార్, పాలకమండలి సభ్యుడు అయిన ఆచార్య ఎం. ధనుంజయనాయుడు అధ్యక్షతన పలువురు పాలకమండలి సభ్యులతో పాలకమండలి సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
వైవీయూకు మొండిచేయి
4 యూనివర్సిటీలకు రూ.383 కోట్లు కేటాయింపు వైవీయూకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని ప్రభుత్వం కడప: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేయగా... వైఎస్ఆర్ జిల్లాలోని వైవీయూకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే అభివృద్ధి చెందిందనా? లేదంటే వైఎస్సార్ జిల్లాకు నిధులు ఇవ్వకూడదనే సంకల్పమా? అంటూ విద్యాధికులు నిలదీస్తున్నారు. జిల్లాపై వివక్ష ఉన్నా, విద్యారంగాన్ని రాజకీయ కోణంలో చూడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల పాపం యోగివేమన విశ్వవిద్యాలయానికి శాపంగా పరిణమిస్తోంది. నిధులు లేక నీరసిస్తున్న విశ్వవిద్యాలయానికి ఆర్థిక చేయూతనిచ్చి ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు.. పట్టించుకోకపోవడంతో గత 6 సంవత్సరాలుగా వైవీయూలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 1977 లో ఎస్వీయూ పీజీ సెంటర్‌గా ప్రారంభమైన కళాశాల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో 2006 మార్చి 9 న విశ్వవిద్యాలయంగా అవతరించింది. అప్పట్లో వైవీయూకు నిధుల వరద పారింది. అవసరమైన వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. వైఎస్ మరణానంతరం నిర్మాణంలో ఉన్న పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత పాలకులు వైవీయూ పట్ల చిన్నచూపు చూడటంతో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. 7 విభాగాలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు 26 విభాగాలతో దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులతో దినదినాభివృద్ధి చెందింది. వసతుల పరంగా ఇంకా నాలుగు ప్రధానమైన భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నా నిధుల కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి అయ్యేందుకు అప్పటి అంచనాల ప్రకారమే రూ.20 కోట్లు కావాల్సి ఉంది. పెరిగిన ధరలతో అంచనా వేస్తే అందుకు రెట్టింపు నిధులు అవసరం. వీటితో పాటు అసలు నిర్మాణాలే మొదలు పెట్టని భవనాలను పూర్తి చేయాలంటే మరో రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరం. మొత్తంగా మరో రూ.100 కోట్ల వరకు నిర్మాణాలకు నిధులు అవసరమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జిల్లా పట్ల ఉన్న వివక్ష ప్రదర్శిసోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అకడమిక్‌గా రాణిస్తున్నా... 2006లో ప్రారంభమైన విశ్వవిద్యాలయాలతో పోల్చుకుంటే వైవీయూ శరవేగంగా అభివృద్ధి చెందిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మంజూరైన నిధుల కారణంగా వైవీయూలో చాలా భవనాలు పూర్తయ్యాయి. ఆమేరకు 2012 నవంబర్‌లో 12(బీ) గుర్తింపును యూజీసీ ఇచ్చింది. తాజాగా 2016లో న్యాక్ బీ గ్రేడ్ సాధించింది. ఆలిండియా ర్యాంకింగ్‌లో 92వ స్థానంతో, రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయం అధ్యాపకులు లక్షలాది విలువైన పరిశోధక ప్రాజెక్టులను, యంగ్ సైంటిస్ట్ అవార్డులను దక్కించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కలల స్వప్నంగా నిలిచిన వైవీయూలో ఆయన మరణానంతరం అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం రూ.383కోట్లు 14 యూనివర్సిటీలకు కేటాయించగా అందులో వైవీయూకు స్థానం దక్కకపోవడం గమనార్హం. అధికారులు నివేదిక పంపినా.. యోగివేమన విశ్వవిద్యాలయంలో నిలిచిపోయిన నిర్మాణాల గురించి గత ఏడాది అధికారులు నివేదికలు పంపారు. మూడు నెలల క్రితం కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో మంత్రి గంటాశ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సైతం ఆ నివేదికలు అందజేశారు. ఇలా మొత్తంగా మూడుసార్లు వైవీయూ అవసరాల గురించి నివేదికలను పంపినట్లు సమాచారం. అయినప్పటీకీ వైఎస్ఆర్ జిల్లా పట్ల ఉన్న వివక్షత కారణంగానే నిధులు కేటాయించలేదని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అనేకమార్లు జిల్లా పర్యటనకు వస్తున్నా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో కనీసం ఒక్కసారి కూడా యోగివేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించకపోవడం విచారకరం. విశ్వవిద్యాలయాలను రాజకీయ కోణంలో చూడొద్దు మేధో నిలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలను రాజకీయ కోణంలో పాలకులు చూడకూడదు న్యాక్ గ్రేడింగ్ సైతం సాధించిన వైవీయూకు నిధులు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా పాలకులు పునఃసమీక్షించి యోగివేమన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయాలి. - డాక్టర్ కంకణాల గంగయ్య, వైవీయూ అధ్యాపక సంఘం అధ్యక్షుడు సీట్లు ఇవ్వలేదని కక్ష సాధింపు ప్రస్తుత పాలకులకు వైఎస్ఆర్ జిల్లాలో సీట్లు రాలేదన్న అక్కసును అడుగడుగునా చూపుతున్నారు. విశ్వవిద్యాలయానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా వివక్షత చూపుతున్నారు. ఇలా ఒక్క విశ్వవిద్యాలయాన్ని పక్షపాత ధోరణితో చూడటం పాలకులకు తగదు. - దస్తగిరి, వైవీయూ పరిశోధక విద్యార్థి సంఘం నాయకుడు -
వైవీయూకు సుస్తీ
సాక్షి కడప/వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో పాలన పడకేయడంతో అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. కీలకమైన విభాగాలన్నీ కొన్ని నెలలుగా ఇన్చార్జిల పాలనలో సాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా ఏర్పడ్డ యోగివేమన విశ్వవిద్యాలయం ఆయన హయాంలో ఒక వెలుగు వెలుగగా నేడు.. దీనస్థితికి చేరుకుంది. అధ్యాపకుల కొరతతో పాటు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన పాలకమండలి లేకపోవడంతో పాటు ముఖ్యమైన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, యూఆర్సీ సెల్, సీడీసీ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌తో పాటు పలు విభాగాల్లో రెగ్యులర్ అధికారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేధిస్తున్న రెగ్యులర్ అధికారుల కొరత.. వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆచార్య ధనుంజయనాయుడు 2013లో ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మరొకరిని నియమించలేదు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య టి. వాసంతినే కొంత కాలం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆమె సైతం ఇటీవల దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. అటు రిజిస్ట్రార్, ఇటు ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటికే పరీక్షల నియంత్రణాధికారిగా కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తున్న ఆచార్య జి. సాంబశివారెడ్డిని ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రిన్సిపాల్ పోస్టుకు సైతం ఎంబీఏ విభాగాధిపతిగా, డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌గా విధులు నిర్వహిస్తున్న డా.రఘునాథరెడ్డిని నియమించారు. అదే విధంగా సీడీసీ డీన్‌గా సైతం యూఆర్సీ సెల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఒక్కరే రెండు విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో నిర్ణయాల జాప్యంతో అభివృద్ధి కుంటుపడుతోందన్న అభిప్రాయం నెలకొంది. దీనికి సంబంధించి 10 డిగ్రీ కళాశాలలకు విద్యాసంవత్సరం ప్రారంభమై 6 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ శాశ్వత అఫిలియేషన్ పెండింగ్‌లో ఉండడం పరిపాలన తీరుకు నిదర్శనం. పదోన్నతుల్లోనూ వివక్ష.. యోగివేమన విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్డ్ స్కీం పేరుతో నిర్వహించే పదోన్నతుల ప్రక్రియలో సైతం వివక్ష చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో దాదాపు 50 మందికి గ్రేడ్ మార్చిన అధికారులు మిగతా వారిని గూర్చి పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. మరో 10 మంది అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నా వారికి పదోన్నతి కల్పించడంలో జాప్యం వల్ల కీలకమైన పదవులు ఖాళీగా ఉన్నాయి. బోధనాపరంగా నాణ్యమైన విద్యనందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అకడమిక్ కన్సల్టెంట్ల కొరత వెంటాడుతోంది. దీనికి తోడు డిసెంబర్ నెలలో విశ్వవిద్యాలయం నుంచి 7 మంది సహాయ ఆచార్యులు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు వెళుతున్నారు. వారి స్థానంలో అకడమిక్ కన్సల్టెంట్లను నియమించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు లేనట్లుంది. నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా.. విశ్వవిద్యాలయ అభివృద్ధి నిధులు ఉన్నా ‘నిజాయితీ’ పేరుతో వాటిని వినియోగించకుండా ఉండటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ రెవిన్యూ అకౌంట్, బ్లాక్గ్రాంట్ల నిధులను అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించే వీలున్నా మిన్నకుండిపోవడం పట్ల అసంతృప్తి నెలకొంది. 4 సంవత్సరాలైనా నిర్వహించని రీసెట్... యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటై దాదాపు 9 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే రీసెట్‌ను కేవలం రెండుసార్లే నిర్వహించారు. 2011 తర్వాత దాని ఊసే లేకపోవడం విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. -
సమస్యలపై విద్యార్థుల ఏకరువు
ప్రొద్దుటూరు: కళాశాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజి ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. తమ కళాశాలలో కనీస వసతులు కల్పించాలని లేకుంటే కడపలోని యూనివర్సిటీ ప్రాంగణం లోకి కళాశాలను షిఫ్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్‌తోపాటు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తమకు చదువుకునేందుకు భవనాల వసతి లేదని, విద్యుత్ సౌకర్యం లేనప్పుడు అంధకారంలోనే ఉంటున్నామని తెలిపారు. హాస్టల్ వసతి లేని కారణంగా నానా అవస్థలు పడుతున్నామన్నారు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వసతులు కల్పించాలని కోరారు. వీరికి బీసీ యువజన నాయకు డు మాదాసు మురళీ మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దార్ రాంభూపాల్రెడ్డికి వినతి పత్రమిచ్చారు. ఉపకారవేతనాలు మంజూరు చేయాలి కడప సెవెన్‌రోడ్స్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే మంజూరు చేయాని డిమాండ్ చేస్తూ నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బయన్న మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు కోసం కేవలం 30 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఇంకా 70 శాతం బడ్జెట్‌ను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఇంతవరకు విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్పులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్, నాయకులు అంకుశం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.