సమస్యలపై విద్యార్థుల ఏకరువు
ప్రొద్దుటూరు:
కళాశాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజి ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. తమ కళాశాలలో కనీస వసతులు కల్పించాలని లేకుంటే కడపలోని యూనివర్సిటీ ప్రాంగణం లోకి కళాశాలను షిఫ్ట్ చేయాలని డిమాం డ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ భాస్కర్‌తోపాటు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తమకు చదువుకునేందుకు భవనాల వసతి లేదని, విద్యుత్ సౌకర్యం లేనప్పుడు అంధకారంలోనే ఉంటున్నామని తెలిపారు. హాస్టల్ వసతి లేని కారణంగా నానా అవస్థలు పడుతున్నామన్నారు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వసతులు కల్పించాలని కోరారు. వీరికి బీసీ యువజన నాయకు డు మాదాసు మురళీ మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డికి వినతి పత్రమిచ్చారు.
ఉపకారవేతనాలు మంజూరు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే మంజూరు చేయాని డిమాండ్ చేస్తూ నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బయన్న మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు కోసం కేవలం 30 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు.
ఇంకా 70 శాతం బడ్జెట్‌ను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ఇంతవరకు విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్పులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్, నాయకులు అంకుశం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.