రూసా నిధులతో నిర్మితమైన భవనాలను పరిశీలిస్తున్న రూసా ఎస్‌పీడీ కె. హరిప్రసాద్
సాక్షి, వైవీయూ: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కడపను విద్యలో కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఐఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో రూసా పనుల తీరును పరిశీలించేందుకు రూసా బృందం జిల్లాకు విచ్చేసింది. ఈ సందర్భంగా రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో రూసా నిధులతో నిర్మించిన నూతన భవనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూసా నిధులతో కళాశాలల రూపురేఖలు మారాయన్నారు. రూసా నిధుల సక్రమ వినియోగంలోను, ప్రగతి సాధించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రథమస్థానంలో ఉన్న కేరళతో ప్రథమస్థానం కోసం పోటీపడుతున్నామని పేర్కొన్నారు. ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం సాధించేలా వారిని ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ సాధించేలా పనిచేయాలని ఆదేశించారు.
దీంతో పాటు ప్రతి విద్యార్థి ఆంగ్లంలో పట్టు సాధించేలా చేయాలని.. ఆంగ్లభాషను నేర్చుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రానున్న పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నింటా అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయంలో రూ.20 కోట్లు, ప్రొద్దుటూరు ఎస్‌సీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు, కడపలోని ఆర్ట్స్ కళాశాలకు రూ.2 కోట్లు చొప్పున రూసా నిధులు కేటాయించమన్నారు. వీటితో పాటు పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన న్యూమోడల్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి తదుపరి ప్రతిపాదనలు పంపితే మళ్లీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం తీసుకురావడం ఒక గొప్ప విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లేనన్నారు. రానున్న రోజుల్లో అన్ని డిగ్రీ కళాశాలల్లో ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్‌భారత్’ పేరుతో స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య, రూసా ప్రతినిధులు ఎస్. బాలయ్య, తిరుపతిరావు, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీధర్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. రవికుమార్ పాల్గొన్నారు.
రూసా నిధుల వినియోగంలో వైవీయూ భేష్
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల వినియోగంలో యోగివేమన విశ్వవిద్యాలయం పనితీరు చక్కగా ఉందని రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. హరిప్రసాద్ అన్నారు. శనివారం యోగివేమన విశ్వవిద్యాలయాన్ని రూసా బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు వీసీ ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలో రూసా నిధులు వెచ్చించి నిర్మిస్తున్న పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పరికరాలు, ఈ క్లాస్‌రూంలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ వైవీయూకు రావాల్సిన రూ.5 కోట్ల రూసా నిధులను విడుదల చేస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.శ్రీధర్‌రెడ్డి, రూసా పరిపాలనాధికారి తిరుపతయ్య, వైవీయూ రూసా కోఆర్డినేటర్ డా. విజయ్‌కుమార్‌నాయుడు, ఆచార్యులు ఎం.వి.శంకర్, చంద్రమతిశంకర్, ఏజీ దాము, నజీర్‌అహ్మద్, వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు డా. జయరామిరెడ్డి, రమణయ్య, శ్రీనివాసులు, ఇంజినీరింగ్ విభాగం డీఈ రామచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment