Rusa funds
-
'ఆ జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతాం'
సాక్షి, వైవీయూ: రాష్ట్రంలో వైఎస్ఆర్ కడపను విద్యలో కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఐఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో రూసా పనుల తీరును పరిశీలించేందుకు రూసా బృందం జిల్లాకు విచ్చేసింది. ఈ సందర్భంగా రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో రూసా నిధులతో నిర్మించిన నూతన భవనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూసా నిధులతో కళాశాలల రూపురేఖలు మారాయన్నారు. రూసా నిధుల సక్రమ వినియోగంలోను, ప్రగతి సాధించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రథమస్థానంలో ఉన్న కేరళతో ప్రథమస్థానం కోసం పోటీపడుతున్నామని పేర్కొన్నారు. ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం సాధించేలా వారిని ఆల్‌రౌండ్ డెవలప్మెంట్ సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థి ఆంగ్లంలో పట్టు సాధించేలా చేయాలని.. ఆంగ్లభాషను నేర్చుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రానున్న పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నింటా అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయంలో రూ.20 కోట్లు, ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు, కడపలోని ఆర్ట్స్ కళాశాలకు రూ.2 కోట్లు చొప్పున రూసా నిధులు కేటాయించమన్నారు. వీటితో పాటు పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన న్యూమోడల్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి తదుపరి ప్రతిపాదనలు పంపితే మళ్లీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం తీసుకురావడం ఒక గొప్ప విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లేనన్నారు. రానున్న రోజుల్లో అన్ని డిగ్రీ కళాశాలల్లో ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్భారత్’ పేరుతో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య, రూసా ప్రతినిధులు ఎస్. బాలయ్య, తిరుపతిరావు, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీధర్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. రవికుమార్ పాల్గొన్నారు. రూసా నిధుల వినియోగంలో వైవీయూ భేష్ రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధుల వినియోగంలో యోగివేమన విశ్వవిద్యాలయం పనితీరు చక్కగా ఉందని రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. హరిప్రసాద్ అన్నారు. శనివారం యోగివేమన విశ్వవిద్యాలయాన్ని రూసా బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు వీసీ ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలో రూసా నిధులు వెచ్చించి నిర్మిస్తున్న పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పరికరాలు, ఈ క్లాస్‌రూంలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ వైవీయూకు రావాల్సిన రూ.5 కోట్ల రూసా నిధులను విడుదల చేస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.శ్రీధర్‌రెడ్డి, రూసా పరిపాలనాధికారి తిరుపతయ్య, వైవీయూ రూసా కోఆర్డినేటర్ డా. విజయ్‌కుమార్‌నాయుడు, ఆచార్యులు ఎం.వి.శంకర్, చంద్రమతిశంకర్, ఏజీ దాము, నజీర్అహ్మద్, వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు డా. జయరామిరెడ్డి, రమణయ్య, శ్రీనివాసులు, ఇంజినీరింగ్ విభాగం డీఈ రామచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్కేయూకు భ'రూసా'
గత ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా భావించిన చంద్రబాబు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ప్రచారం హోరెత్తించేందుకు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించారు. చివరకు ఎస్కేయూలో సౌకర్యాల కల్పన, కోర్సుల బలోపేతానికి ‘రూసా’ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులనూ వర్సిటీకి పంపకుండా దారిమళ్లించారు. ఖర్చు చేసిన వాటికి లెక్కలు చెప్పాలని ‘రూసా’ అధికారులు కోరగా.. ఖర్చే చేయలేదంటూ మాటమార్చారు. దీంతో సకాలంలో వినియోగించని రూ.15 కోట్లు వెనక్కుపంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా.. ప్రస్తుత సర్కారు గడువు పెంచేలా ‘రూసా’ అధికారులతో చర్చలు జరిపి సఫలమైంది. దీంతో రూసా పథకం అమలుకు ఏర్పడిన గ్రహణం తొలగింది. – ఎస్కేయూ ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలు, కోర్సులను బలోపేతం చేయడానికి తగిన వనరుల సమీకరణకు రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్(రూసా) పథకం భారీ స్థాయిలో నిధులను మంజూరు చేస్తోంది. న్యాక్(నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఏ–గ్రేడ్ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.100 కోట్లు, బీ–గ్రేడ్ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.20 కోట్లు చొప్పున మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాక్ బీ–గ్రేడ్ దక్కించుకున్న ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు మంజూరుకు మార్గం ఏర్పడింది. తొలి విడతలో 2016 ఫిబ్రవరి నాటికే రూ.10 కోట్ల నిధులను కేంద్రం రూసా రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు పంపగా.. ఆ నిధులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇతర పథకాలకు వినియోగించింది. అనంతరం మరో రూ.5 కోట్లు విడుదల చేయగా వాటిని కూడా ఇతర పథకాలకు మళ్లించారు. అయితే ఖర్చు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) పంపాలని గత ప్రభుత్వానికి రూసా అధికారులు లేఖరాశారు. దీంతో 2018 జూలైలో హడావుడిగా వినియోగించిన నిధులను రూ.15 కోట్లను ఎస్కేయూ ఖాతాకు పంపించారు. ఈ క్రమంలో నాలుగు నెలల వ్యవధిలో ఆ నిధులను ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొనగా.. సకాలంలో ఖర్చు చేయని నిధులను వెనక్కి పంపాలని రూసా పథకం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజా సర్కార్ విన్నపంతో గడువు పెంపు రూసా పథకం నిధులు ఒక్కసారి వెనక్కి పంపితే...తిరిగి ఏటా అందవు. కరువు జిల్లాలోని వర్సిటీకి నిధుల లభ్యతకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ఎస్కేయూ ఉన్నతాధికారులతో మాట్లాడి గతంలో జరిగిన తప్పిదాన్ని ‘రూసా’ ఉన్నతాధికారులకు వివరించింది. కాస్త సమయం ఇవ్వాలని కోరింది. దీంతో అక్కడి అధికారులు 2020 ఆగస్టులోపు రూ.15 కోట్ల నిధులను వినియోగించి యూసీలు పంపితే .. మరో రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎస్కేయూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నిధులన్నీ ఖర్చు చేసి వసతులు, కోర్సుల బలోపేతానికి చర్యలు తీసుకుంటే వర్సిటీకి న్యాక్–ఏ గ్రేడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో రూ.100 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. వెసులుబాటు కల్పించారు వాస్తవానికి ఆగస్టు 2018లోపు ‘రూసా’ పథకం నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖాతా నుంచి ఎస్కేయూ ఖాతాకు నిధులు జమ కావడంలో జాప్యం జరిగింది. ఈ అంశాన్ని కేంద్ర రూసా పథకం అధికారులకు స్పష్టంగా వివరించారు. దీంతో నిధుల వినియోగానికి సంబంధించి వెసులుబాటు కల్పించారు. 2020 ఆగస్టులోపు నిధులను వినియోగించి యూసీలు పంపాలని సూచించారు. – ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ -
పాలమూరు యూనివర్సిటీకి బంపర్ ఆఫర్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వెనుకబడిన పాలమూరు జిల్లాలో అక్షర జ్యోతులు వెలిగించాలన్న ఉద్దేశ్యంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పాలమూరు యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతోంది. పదేళ్లనుంచి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో సర్దుకుపోతుండగా ఇప్పడు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాష్ట్రీయ ఉచ్చాచితర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. న్యాక్ గుర్తింపుతోనే.. పాలమూరు యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌంన్సిల్ (న్యాక్) గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పీయూకు న్యాక్‌లో పీయూ 2.31 స్కోర్ చేయడంతో బీ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. పీయూతో పాటు ఇదే గ్రేడింగ్ సాధించిన మహాత్మాగాందీ యూనివర్సిటీ, నల్లగొండకు కూడా ఇవే నిధులుకేటాయించింది. అయితే సాధారణంగా రూసా నిధులు మంచి గ్రేడింగ్ వచ్చిన యూనివర్సీటీలకు మాత్రమే కేటాయిస్తుండగా ఈ సంవత్సరం సాధారణ గ్రేడింగ్ సాధించిన యూనివర్సిటీలకు నిధులను కేటాయిస్తే త్వరతగతిన అభివృద్ధి సాధిస్తారని భావించి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. పెరగనున్న వసతులు సాధారణంగా యూనివర్సిటీలకు న్యాక్ గుర్తింపు వస్తే వసతులు పెరిగి మెరుగైన విద్య, వసతుల అభివృద్ధి సాధిస్తే రాష్ట్రీయ ఉచ్చాచితర్ శిక్షా అభియాన్, న్యాక్, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ప్రత్యేక నిధులు అందుతాయి. వీటిలో యూనివర్సిటీలో నాణ్యత, ప్రమాణాల ఆధారంగా ఏ,బీ,సీ వంటి గ్రేడులను ఆధారం చేసుకుని నిధులు అందిస్తుంది. 2016లో బాధ్యతలు స్వీకరించిన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ రాజరత్నం కృషి ఎంతో ఉందని, అ«ధికారులు, విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. న్యాక్ గుర్తింపు కోసం వసతుల కల్పన, విద్యలో నాణ్యత, భవనాల నిర్మాణం వంటి అనేక అంశాలపై ఆయన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, పకడ్బందీగా న్యాక్ దరఖాస్తు చేయడంతో ఈ నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాక్ బృందం పీయూలోని వివిధ వసతులను పరిశీలించేందుకు 2018 సెప్టెంబర్ 18న పీయూను సందర్శంచి, మూడురోజుల పర్యటన చేశారు. అనంతరం 2019 ప్రారంభంలో న్యాక్ గుర్తింపు ఇస్తూ బి–గ్రేడ్‌ను కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇందులో బీ గ్రేడ్ వచ్చిన కళాశాలలకు నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. శాతాల వారీగా నిధుల వినియోగం న్యాక్ గ్రేడింగ్ వచ్చిన కళాశాలలకు నిధులు కేటాయించే క్రమంలో వీటిని వినియోగానికి సంబంధించి కచ్చితమైన పరిధులు ఉంటాయి. ఇందులో అకాడమిక్ డెవలప్మెంట్ నుంచి ఇఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు ప్రతిఅంశం కూడా రూసా నిబంధనల మేరకు మాత్రమే వినియోగించాల్సి ఉంటంది. మొత్తం రూ.20 కోట్లలో 50 శాతం నిధులు యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు, వివిధ భవనాల నిర్మాణం, చేపట్టేందుకు కేటాయించాల్సి ఉంది. 20శాతం నిధులను యూనివర్సిటీలోని గతంలో నిర్మించిన వివిధ భవనాలకు రీపేర్లు చేసేందుకు కేటాయించాలి. 20 శాతం నిధులు డిపార్ట్మెంట్ల వారీగా విద్యార్థులకు అవసరమయ్యే ఎక్యూప్మెంట్ కోసం కేటాయించాలి. 10 శాతం నిధులు సైన్స్ విధులు చేసే ప్రయోగాల కోసం వినియోగించే కెమికల్స్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. రూ.20 కోట్ల ఖర్చుకు ప్రతిపాదనలు నిధుల కేయింపునకు ముందు ప్రభుత్వం అందుకు సంబంధించి ప్రతిపాదనలను యూనివర్సిటీ అధికారుల నుంచి కోరుతుంది. పీయూ అధికారులు కూడా చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించారు. ఇందులో మొదటగా యూనివర్సిటీలో చదువుతున్న బాలికలు, ఆర్ట్స్, సైన్స్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థునులు ఒకే హాస్టల్లో సంఖ్యకు మించి ఉంటున్నారు. బాలికలకు నూతన భవనం నిర్మించనున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి నిర్మాణం కూడా చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న సైన్స్, ఆర్ట్స్ అకాడమిక్ భవనాలతో పాటు అధనంగా మరో అకాడమిక్ బిల్డిండ్ నిర్మించనున్నారు. విద్యార్థులకు ఆడుకునేందుకు సౌకర్యంగా రన్నింగ్ ట్రాక్, ఫుట్‌బాల్ గ్రౌండ్, ఫీల్డ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి రీసెర్చ్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో స్కాలర్స్‌ను భర్తీ చేయనున్నారు. అందుకోసం వివిధ డిపార్ట్మెంట్ల వారీగా రీసెర్చ్ ఎక్యూప్మెంట్, ల్యాబ్‌లను పెద్ద ఎత్తున సమకూరుస్తారని తెలుస్తోంది. వీటితో పాటు పీయూకు అనుబంధ పీజీ సెంటర్లలో కూడా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందరి సహకారంతోనే.. పాలమూరు యూనిర్సిటీ ప్రతి సంవత్సరం కొత్త పంథాను అనుసరిస్తోంది. అందుకు ప్రధాన కారణం యూనివర్సిటీ అధికారుల సమిష్టి కృషియే. ప్రస్తుతం ఉన్న న్యాక్–బీ గ్రేడ్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా పీయూను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఏ–గ్రేడ్ సా«ధించే విధంగా కృషిచేస్తూ రాష్ట్రంలోనే మంచి యూనివర్సిటీగా పీయూ పేరును నిలబెడతాం. – పిండి పవన్‌కుమార్, పాలమూరు యూనివర్సిటీ, రిజిస్ట్రార్ నిధులు రావడం సంతోషకరం పాలమూరు యూనివర్సిటీ ఇప్పటివరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతోనే నడిచేది. న్యాక్ గుర్తింపు ద్వారా రూసా నిధులు కూడా రావడం సంతోషంగా ఉంది. ఈ నిధుల ద్వారా యూనివర్సిటీలో వసతులు పెరగడంతో పాటు, పీయూ పరిధిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అవకాశం ఉంటుంది. – మధుసూదన్‌రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ, కోఆర్డినేటర్ -
ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం
ఎచ్చెర్ల: జిల్లా విద్యార్థులను నాలుగేళ్లుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి అన్నీ సక్రమంగా జరిగితే ‘రూసా’ నిధులతో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) క్యాంపస్ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం రెండు బ్రాంచ్‌లతోనైనా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. అయితే వసతి కొరత కారణంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. ఫలితంగా పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదవలేక, ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరక తప్పడం లేదు. కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతమ్ శిక్ష అభియాన్(రూసా)లో భాగంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.65 కోట్ల మంజూరుకు సూత్రపాయంగా అంగీకరించింది. అయితే ‘రూసా’ ప్రతిపాదనలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అనుమతి లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలోనే కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కాకినాడ జేఎన్టీయూ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క స్థానిక బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వర్సిటీ సమీపంలో ఉన్న 21వ శతాబ్ది గరుకుల భవనాలను తమకు అప్పగిస్తే వసతి కొరత సమస్య పరిష్కారం అవుతుందని, దీం తో పాటు అన్ని విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న విషయాన్ని సైతం ఇక్కడి అధికారులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ముందుగా రూసా నిధులు అధికారికంగా మంజూరైతే ఇంజినీరింగ్ కళాశాలల ఎక్కడ ప్రారంభించాలన్న అంశంపై స్పష్టత రావచ్చు. కళాశాల ఏర్పాటైతే కనీసం మూడు బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చి, 180 మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ప్రభుత్వ కళాశాల మంజూరైతే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.