ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం | Government Engineering College to be Rusa funds | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం

Published Sat, Dec 27 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం

ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం

ఎచ్చెర్ల: జిల్లా విద్యార్థులను నాలుగేళ్లుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి అన్నీ సక్రమంగా జరిగితే ‘రూసా’ నిధులతో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా విజయనగరంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) క్యాంపస్ ఉంది.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం రెండు బ్రాంచ్‌లతోనైనా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. అయితే వసతి కొరత కారణంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. ఫలితంగా పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదవలేక, ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరక తప్పడం లేదు. కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతమ్ శిక్ష అభియాన్(రూసా)లో భాగంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.65 కోట్ల మంజూరుకు సూత్రపాయంగా అంగీకరించింది. అయితే ‘రూసా’ ప్రతిపాదనలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

అనుమతి లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలోనే కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కాకినాడ జేఎన్‌టీయూ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క స్థానిక బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వర్సిటీ సమీపంలో ఉన్న 21వ శతాబ్ది గరుకుల భవనాలను తమకు అప్పగిస్తే వసతి కొరత సమస్య పరిష్కారం అవుతుందని, దీం తో పాటు అన్ని విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న విషయాన్ని సైతం ఇక్కడి అధికారులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ముందుగా రూసా నిధులు అధికారికంగా మంజూరైతే ఇంజినీరింగ్ కళాశాలల ఎక్కడ ప్రారంభించాలన్న అంశంపై స్పష్టత రావచ్చు. కళాశాల ఏర్పాటైతే కనీసం మూడు బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చి, 180 మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ప్రభుత్వ కళాశాల మంజూరైతే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement