Government Engineering College
-
‘సెల్ఫ్’ ఫైనాన్సింగ్ సీట్లు 1,160
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,160 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా కింద మాత్రమే భర్తీ చేస్తారు. అయితే, ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఈ కేటగిరీ సీట్లకు ఫీజులు వసూలు చేయనున్నట్లు యూనివర్సిటీలు ప్రకటించాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద సీట్ల భర్తీ ప్రక్రియ దశాబ్దం క్రితమే మొదలైనా.. ఈ స్థాయిలో ఫీజులు పెంచడం ఇదే తొలిసారి. ఈ ఫీజులు ఇంచుమించు టాప్‌టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు సమానంగా ఉన్నాయి. మూడేళ్లకోసారి ఫీజులను పెంచుతున్నారు. ఈసారి గుట్టు చప్పుడు కాకుండా ఫీజులు పెంచారు. ఈ కేటగిరీ కింద చేరిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఇప్పటివరకూ రూ.35 వేలుగా ఉన్న ఫీజులు ఇకపై రూ.70 వేలకు చేరనుంది. ఎక్కడెన్ని సీట్లు.. ►జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ, మహా త్మాగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నటీ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలో మొత్తం 15 కాలేజీలున్నాయి. వీటిల్లో 3,645 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ►వీటిలో 1,160 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద పరిగణిస్తారు. వెయ్యిలోపు ఎంసెట్ ర్యాంకు వచ్చిన వారికే ఈ సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అయినా ప్రైవేటు కాలేజీల్లోని ఫీజులే వీళ్లూ చెల్లించాలి. 10వేల లోపు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు వస్తున్నయ్. అయితే, ఇందులో కొందరు రూ.1.2 లక్షల వరకూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫీషియల్ ఇం టెలిజెన్స్ కోర్సు ఫీజు ఏడాదికి రూ.1.3 లక్షలు. ప్రైవేటు కాలేజీల్లో (కన్వీనర్ కోటా కింద)నూ ఇదే ఫీజు ఉండటం విశేషం. ప్రభుత్వకాలేజీలు ఆర్థికం గా పుంజుకోవడం కోస మే ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వర్సిటీలు పేర్కొంటున్నాయి. కానీ, మెరిట్ ఉన్న పేద లకు అన్యాయం జరుగుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు. ►కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలార్జికల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఈ ఏడాది అధికారికంగా ప్రకటించాయి. ►జేఎన్టీయూహెచ్ అనుబంధ క్యాంపస్‌ను సిరిసిల్లలో కొత్తగా ఏర్పాటు చేశారు. దీనిలో 6 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. చాలాకాలం నుం చి ఉన్న జగిత్యాలలో 5 కోర్సులు, మాసబ్‌ట్యాంక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో 3, కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో 7, ఐదేళ్ల ఇంటి గ్రేటెడ్ కాలేజీ ల్లో 6, సుల్తాన్‌పురలో 2012లో ప్రారంభించిన జేఎన్టీయూ అనుబంధ కాలేజీలో 4 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగనున్నాయి. ►కాకతీయ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం కాలేజీలో మూడు, కాకతీయ క్యాంపస్‌లో 4, మహాత్మాగాంధీ వర్సిటీలో 3 కోర్సులు, ఉస్మానియా వర్సిటీ పరిధిలో 6 కోర్సులు, ఇలా ఒక్కో బ్రాంచిలో 30 సీట్లకు తక్కువ కాకుండా, మొత్తం 1,160 సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పరిధిలోకి తెస్తున్నారు. -
ఊరిస్తున్న ‘ఇంజినీరింగ్’ యోగం
ఎచ్చెర్ల: జిల్లా విద్యార్థులను నాలుగేళ్లుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి అన్నీ సక్రమంగా జరిగితే ‘రూసా’ నిధులతో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) క్యాంపస్ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం రెండు బ్రాంచ్‌లతోనైనా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. అయితే వసతి కొరత కారణంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. ఫలితంగా పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదవలేక, ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరక తప్పడం లేదు. కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతమ్ శిక్ష అభియాన్(రూసా)లో భాగంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.65 కోట్ల మంజూరుకు సూత్రపాయంగా అంగీకరించింది. అయితే ‘రూసా’ ప్రతిపాదనలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అనుమతి లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలోనే కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కాకినాడ జేఎన్టీయూ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క స్థానిక బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వర్సిటీ సమీపంలో ఉన్న 21వ శతాబ్ది గరుకుల భవనాలను తమకు అప్పగిస్తే వసతి కొరత సమస్య పరిష్కారం అవుతుందని, దీం తో పాటు అన్ని విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న విషయాన్ని సైతం ఇక్కడి అధికారులు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ముందుగా రూసా నిధులు అధికారికంగా మంజూరైతే ఇంజినీరింగ్ కళాశాలల ఎక్కడ ప్రారంభించాలన్న అంశంపై స్పష్టత రావచ్చు. కళాశాల ఏర్పాటైతే కనీసం మూడు బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చి, 180 మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ప్రభుత్వ కళాశాల మంజూరైతే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. -
ఆ కాలేజీల కథ కంచికేనా..?
ఖమ్మం: ప్రభుత్వం అనుకున్నంత పనిచేసింది. హైదరాబాద్ జేఎన్టీయూ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల స్థితిగతులపై ఓ నివేదిక అందజేశారు. ఆ నివేదిక జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల కొంపముంచింది. సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, తగినంత మంది విద్యార్థులు లేరనే కారణంతో నూతన విద్యాసంవత్సరానికి పలు కళాశాలలను రెన్యూవల్ చేయకుండా నిలిపివేశారు. అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్ మొదలైన రోజునే ఈ చేదువార్త విన్న ఇంజనీరింగ్ కళాశాలల యాజామాన్యాలు హైదరాబాద్‌కు పరుగులు తీశారు. గత సంవత్సరం అన్ని సజావుగా సాగితేనే సగం సీట్లు కూడా నిండలేదు. ఇప్పుడు కళాశాలల పునరుద్ధరణ చేయకపోవడం ఆయా కాలేజిల యాజమాన్యాలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ‘వందల కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలలు కట్టుకున్నాం. నిర్వహణ కోసం ప్రతియేటా లక్షల రూపాయలు అప్పు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాపెట్టకుండా పునరుద్ధరణ చేయకపోతే ఎలా? కళాశాలలను నమ్ముకొని జీవిస్తున్న వందలాదిమంది ఉద్యోగుల జీవితాలు వీధినపడ తాయి. విద్యార్థుల భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి మాకు వెసులుబాటు కల్పిం చాలి..’ అంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కొంపముంచిన తనిఖీ అధికారులు ఓవైపు ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వైరం నడుస్తుండగానే జిల్లాలోని కళాశాలల స్థితిగతులపై అధికారులు తనిఖీ చేశారు. కఠినంగా వ్యవహరించక తప్పదని..ఎక్కడా ఉపేక్షించేది లేదని వారు ఆనాడే తేల్చి చెప్పారు. వారి వ్యవహారశైలిని చూసి ఆయా కళాశాల యాజమాన్యం ఖంగుతింది. తనిఖీ సమయంలో వారు ప్రదర్శించిన దూకుడునే ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల పునరుద్ధరణ విషయంలోనూ చూపించారు. జిల్లాలోని సగానికి తక్కువ కళాశాలలకు మాత్రమే నిబంధనల మేరకు వసతులు, ఇతర సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఉద్యోగుల నియామకం, వేతనాలు, క్రీడా మైదానాలు ఉన్నాయని తేల్చారు. మిగతా వాటిలో ఇవేవీ లేవని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలోని 23 ఇంజినీరింగ్ కళాశాలలకు గాను కేవలం తొమ్మిదింటిని మాత్రమే రెన్యూవల్ చేశారు. వెబ్ ఆప్షన్‌కు అనుమతించారు. జిల్లాలోనే సగానికి పైగా కళాశాలలు పునరుద్ధరణకు నోచుకోక అయోమయస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 13వేల పైచిలుకు సీట్లుకు గాను ఏడువేల సీట్లకు గండిపడేలా ఉంది. అదను చూసి దెబ్బతీశారు.. అసలే కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నానా తంటాలు పడుతుంటే తీరా వెబ్ఆప్షన్లు మొదలైన రోజునే రెన్యూవల్ చేయడంలేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన చందం’గా మారింది. గత సంవత్సరం తొలిదఫా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ముగిసేనాటికి కేవలం 3,722 సీట్లు మాత్రమే నిండాయి. కనీస సంఖ్యలో విద్యార్థులను చేర్పించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని కళాశాలలైతే విద్యార్థులకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ కాలేజీలో చేర్చుకున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని పలు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ ఫలితాలు వచ్చిన నాటి నుండే విద్యార్థుల వేటలో పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా బీహార్ తదితర రాష్ట్రాల నుంచీ విద్యార్థులను చేర్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఈ పరిస్థితిలో కళాశాలలు రెన్యూవల్స్ కాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మలివిడత కౌన్సెలింగ్ నాటికైనా రెన్యూవల్స్ చేయించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్‌లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించడం యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇంజనీరింగ్ కళాశాలల భవితవ్యం ఏవిధంగా ఉంటుందో అని జిల్లాలో చర్చనీయాంశమైంది.