ఖమ్మం: ప్రభుత్వం అనుకున్నంత పనిచేసింది. హైదరాబాద్ జేఎన్‌టీయూ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల స్థితిగతులపై ఓ నివేదిక అందజేశారు. ఆ నివేదిక జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల కొంపముంచింది.
సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, తగినంత మంది విద్యార్థులు లేరనే కారణంతో నూతన విద్యాసంవత్సరానికి పలు కళాశాలలను రెన్యూవల్ చేయకుండా నిలిపివేశారు. అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్ మొదలైన రోజునే ఈ చేదువార్త విన్న ఇంజనీరింగ్ కళాశాలల యాజామాన్యాలు హైదరాబాద్‌కు పరుగులు తీశారు. గత సంవత్సరం అన్ని సజావుగా సాగితేనే సగం సీట్లు కూడా నిండలేదు. ఇప్పుడు కళాశాలల పునరుద్ధరణ చేయకపోవడం ఆయా కాలేజిల యాజమాన్యాలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
‘వందల కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలలు కట్టుకున్నాం. నిర్వహణ కోసం ప్రతియేటా లక్షల రూపాయలు అప్పు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాపెట్టకుండా పునరుద్ధరణ చేయకపోతే ఎలా? కళాశాలలను నమ్ముకొని జీవిస్తున్న వందలాదిమంది ఉద్యోగుల జీవితాలు వీధినపడ తాయి. విద్యార్థుల భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి మాకు వెసులుబాటు కల్పిం చాలి..’ అంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం.
కొంపముంచిన తనిఖీ అధికారులు
ఓవైపు ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వైరం నడుస్తుండగానే జిల్లాలోని కళాశాలల స్థితిగతులపై అధికారులు తనిఖీ చేశారు. కఠినంగా వ్యవహరించక తప్పదని..ఎక్కడా ఉపేక్షించేది లేదని వారు ఆనాడే తేల్చి చెప్పారు. వారి వ్యవహారశైలిని చూసి ఆయా కళాశాల యాజమాన్యం ఖంగుతింది. తనిఖీ సమయంలో వారు ప్రదర్శించిన దూకుడునే ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల పునరుద్ధరణ విషయంలోనూ చూపించారు.
జిల్లాలోని సగానికి తక్కువ కళాశాలలకు మాత్రమే నిబంధనల మేరకు వసతులు, ఇతర సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఉద్యోగుల నియామకం, వేతనాలు, క్రీడా మైదానాలు ఉన్నాయని తేల్చారు. మిగతా వాటిలో ఇవేవీ లేవని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలోని 23 ఇంజినీరింగ్ కళాశాలలకు గాను కేవలం తొమ్మిదింటిని మాత్రమే రెన్యూవల్ చేశారు. వెబ్ ఆప్షన్‌కు అనుమతించారు. జిల్లాలోనే సగానికి పైగా కళాశాలలు పునరుద్ధరణకు నోచుకోక అయోమయస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 13వేల పైచిలుకు సీట్లుకు గాను ఏడువేల సీట్లకు గండిపడేలా ఉంది.
అదను చూసి దెబ్బతీశారు..
అసలే కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నానా తంటాలు పడుతుంటే తీరా వెబ్‌ఆప్షన్‌లు మొదలైన రోజునే రెన్యూవల్ చేయడంలేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన చందం’గా మారింది. గత సంవత్సరం తొలిదఫా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ముగిసేనాటికి కేవలం 3,722 సీట్లు మాత్రమే నిండాయి.
కనీస సంఖ్యలో విద్యార్థులను చేర్పించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని కళాశాలలైతే విద్యార్థులకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ కాలేజీలో చేర్చుకున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని పలు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ ఫలితాలు వచ్చిన నాటి నుండే విద్యార్థుల వేటలో పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా బీహార్ తదితర రాష్ట్రాల నుంచీ విద్యార్థులను చేర్పించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇందుకోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఈ పరిస్థితిలో కళాశాలలు రెన్యూవల్స్ కాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మలివిడత కౌన్సెలింగ్ నాటికైనా రెన్యూవల్స్ చేయించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్‌లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించడం యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇంజనీరింగ్ కళాశాలల భవితవ్యం ఏవిధంగా ఉంటుందో అని జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఆ కాలేజీల కథ కంచికేనా..?
Published Mon, Aug 18 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement