సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,160 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా కింద మాత్రమే భర్తీ చేస్తారు. అయితే, ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఈ కేటగిరీ సీట్లకు ఫీజులు వసూలు చేయనున్నట్లు యూనివర్సిటీలు ప్రకటించాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద సీట్ల భర్తీ ప్రక్రియ దశాబ్దం క్రితమే మొదలైనా.. ఈ స్థాయిలో ఫీజులు పెంచడం ఇదే తొలిసారి.
ఈ ఫీజులు ఇంచుమించు టాప్‌టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు సమానంగా ఉన్నాయి. మూడేళ్లకోసారి ఫీజులను పెంచుతున్నారు. ఈసారి గుట్టు చప్పుడు కాకుండా ఫీజులు పెంచారు. ఈ కేటగిరీ కింద చేరిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఇప్పటివరకూ రూ.35 వేలుగా ఉన్న ఫీజులు ఇకపై రూ.70 వేలకు చేరనుంది.
ఎక్కడెన్ని సీట్లు..
►జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ, మహా త్మాగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నటీ వర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలో మొత్తం 15 కాలేజీలున్నాయి. వీటిల్లో 3,645 ఇంజనీరింగ్ సీట్లున్నాయి.
►వీటిలో 1,160 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద పరిగణిస్తారు. వెయ్యిలోపు ఎంసెట్ ర్యాంకు వచ్చిన వారికే ఈ సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అయినా ప్రైవేటు కాలేజీల్లోని ఫీజులే వీళ్లూ చెల్లించాలి. 10వేల లోపు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు వస్తున్నయ్. అయితే, ఇందులో కొందరు రూ.1.2 లక్షల వరకూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
►ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫీషియల్ ఇం టెలిజెన్స్ కోర్సు ఫీజు ఏడాదికి రూ.1.3 లక్షలు. ప్రైవేటు కాలేజీల్లో (కన్వీనర్ కోటా కింద)నూ ఇదే ఫీజు ఉండటం విశేషం. ప్రభుత్వకాలేజీలు ఆర్థికం గా పుంజుకోవడం కోస మే ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వర్సిటీలు పేర్కొంటున్నాయి. కానీ, మెరిట్ ఉన్న పేద లకు అన్యాయం జరుగుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు.
►కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలార్జికల్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఈ ఏడాది అధికారికంగా ప్రకటించాయి.
►జేఎన్‌టీయూహెచ్ అనుబంధ క్యాంపస్‌ను సిరిసిల్లలో కొత్తగా ఏర్పాటు చేశారు. దీనిలో 6 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. చాలాకాలం నుం చి ఉన్న జగిత్యాలలో 5 కోర్సులు, మాసబ్‌ట్యాంక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌లో 3, కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో 7, ఐదేళ్ల ఇంటి గ్రేటెడ్ కాలేజీ ల్లో 6, సుల్తాన్‌పురలో 2012లో ప్రారంభించిన జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలో 4 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగనున్నాయి.
►కాకతీయ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం కాలేజీలో మూడు, కాకతీయ క్యాంపస్‌లో 4, మహాత్మాగాంధీ వర్సిటీలో 3 కోర్సులు, ఉస్మానియా వర్సిటీ పరిధిలో 6 కోర్సులు, ఇలా ఒక్కో బ్రాంచిలో 30 సీట్లకు తక్కువ కాకుండా, మొత్తం 1,160 సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పరిధిలోకి తెస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment