హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ | Global Business Conference to be held in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌

Published Wed, Jan 1 2025 1:19 AM | Last Updated on Wed, Jan 1 2025 1:19 AM

Global Business Conference to be held in Hyderabad

హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీనటుడు చిరంజీవి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (ఆప్టా కేటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌)కు భాగ్య నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచస్థాయిలో రాణిస్తున్న తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలతో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు హైటెక్స్‌లో సదస్సు జరగనుంది. 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు దీన్ని ఏర్పాటు చేస్తున్న అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్టా) అధ్యక్షుడు కోట సుబ్బు తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

3న ఏపీ సీఎం, 4న తెలంగాణ సీఎం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 3న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4న, ప్రముఖ నటుడు చిరంజీవి 5న సదస్సుకు హాజరు కానున్నారని కోట సుబ్బు వివరించారు. కొత్త ఆలో చనలు ఉన్నా ఆర్థిక సహకారం లేనివారికి.. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న మార్గదర్శనం తెలియని వారిని ఒకచోట కలిపి, వ్యాపార సూచ నలు, సలహాలు అందించేందుకు ఈ కాన్ఫరెన్స్‌ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యంగా స్టార్టప్‌లకు ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందన్నారు. పది దేశాల నుంచి సుమారు వెయ్యి మంది వ్యాపార సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని పలువురు అసోసియేషన్‌ సభ్యులు వివరించారు. సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువ ఉన్న వ్యాపార సంస్థలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

100కుపైగా స్టార్టప్‌ కంపెనీలు దరకాస్తు చేసుకున్నాయని తెలిపారు. 2016లో 100 మంది సభ్యులతో ఆప్టా బిజినెస్‌ ఫోరం ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం ఆ సంఖ్య 800 మందికి చేరిందన్నారు. ఆప్టా 35 రకాల సేవా కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. అమెరికా రావాలనుకునే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. సమావేశంలో ఆప్టా బిజినెస్‌ ఫోరం ప్రతినిధులు రమేశ్, మధు, సాగర్, తేజ్‌ పాక్యాల, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement