business summit
-
2030 నాటికి 500 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్–అమెరికా మరింతగా కసరత్తు చేస్తున్నాయి. 2023లో సుమారు 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ఇరు దేశాలు పరస్పరం కొనుగోళ్లు, పెట్టుబడులను మరింతగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూఎస్‌జీసీఐ) ఇండియన్ చాప్టర్‌ను అధికారికంగా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు మార్క్ బర్న్స్ ఈ విషయాలు తెలిపారు.ఇరు దేశాల భాగస్వామ్యం .. అసాధారణ వృద్ధి, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. మిషన్ 500 కింద ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులకు ఇరు దేశాలు పెద్ద పీట వేస్తున్నాయన్నారు. భారత్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 54 శాతం అమెరికాకే ఉంటున్నాయని చెప్పారు. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో వంటి దేశీ దిగ్గజాలు తమ దగ్గర, మైక్రోసాఫ్ట్.. గూగుల్ వంటి అమెరికన్ దిగ్గజాలు భారత్‌లోను భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని మార్క్ వివరించారు. యూఎస్ఏఐడీ స్థానంలో యూఎస్‌జీసీఐ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) కొనసాగింపుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు యూఎస్‌జీసీఐ ఉపయోగపడనుంది. యూఎస్ఏఐడీ సహాయం నిలిపివేతతో నిల్చిపోయిన ప్రాజెక్టులను టేకోవర్ చేయడంపై ఇది దృష్టి పెడుతుందని యూఎస్‌జీసీఐ సహ వ్యవస్థాపకుడు ఘజన్ఫర్ అలీ తెలిపారు.ఇది గ్రాంట్ల మీద ఆధారపడకుండా కార్పొరేట్లు, ప్రభుత్వాల భాగస్వామ్యం దన్నుతో పనిచేస్తుందని ఆయన వివరించారు. యూఎస్ఏఐడీ కింద ఏటా 20 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుండగా, ప్రస్తుతం 130 పైచిలుకు దేశాల్లో తత్సంబంధిత ప్రాజెక్టులు దాదాపుగా నిల్చిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటైన తమ సంస్థ, ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు కృషి చేయనుందని వివరించారు. ఇప్పటికే 40 పైగా దేశాలు తమ వద్ద కూడా చాప్టర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వనించినట్లు చెప్పారు. యూఎస్ఏఐడీ ప్రభావిత ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంత దేశాల్లోని ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు. భారత్‌లో యూఎస్‌జీసీఐ ప్రయత్నాలు విజయవంతమైతే మిగతా దేశాల్లోనూ పునరావృతం చేసేందుకు బ్లూప్రింట్‌గా ఉపయోగపడుతుందన్నారు. 5 బిలియన్ డాలర్ల సమీకరణ వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్ డాలర్ల సామాజిక పెట్టుబడులను సమీకరించాలని యూఎస్‌జీఐసీ నిర్దేశించుకున్నట్లు అలీ చెప్పారు. అలాగే నిర్మాణాత్మక పెట్టుబడుల ద్వారా అమెరికా–భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20–30 శాతం వృద్ధి చెందగలదని, ప్రాజెక్టుల పునరుద్ధరణతో 5,00,000 పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెక్నాలజీ, తయారీ, ఇంధనం వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అలీ వివరించారు. యూఎస్‌జీసీఐకి భారత్ కీలక హబ్‌గా నిలవగలదని ఆయన చెప్పారు.టారిఫ్‌లపై క్రియాశీలకంగా భారత్.. వివాదాస్పదమైన టారిఫ్‌లపై స్పందిస్తూ.. ఈ విషయంలో భారత్ క్రియాశీలక చర్యలు తీసుకుందని మార్క్ చెప్పారు. ఇప్పటికే కొన్ని రంగాల్లో టారిఫ్‌లను తగ్గించడం ప్రారంభించిందని, మరిన్ని అంశాల్లో మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అమెరికా నుంచి భారత్ మరింతగా ఆయిల్, గ్యాస్ మొదలైనవి కొనుగోలు చేయనుండగా, కీలకమైన మరిన్ని మిలిటరీ ఉత్పత్తులను అమెరికా అందించనుందని మార్క్ చెప్పారు. -
హైదరాబాద్ వేదికగా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (ఆప్టా కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్)కు భాగ్య నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచస్థాయిలో రాణిస్తున్న తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలతో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు హైటెక్స్‌లో సదస్సు జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు దీన్ని ఏర్పాటు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్టా) అధ్యక్షుడు కోట సుబ్బు తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.3న ఏపీ సీఎం, 4న తెలంగాణ సీఎంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 3న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4న, ప్రముఖ నటుడు చిరంజీవి 5న సదస్సుకు హాజరు కానున్నారని కోట సుబ్బు వివరించారు. కొత్త ఆలో చనలు ఉన్నా ఆర్థిక సహకారం లేనివారికి.. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న మార్గదర్శనం తెలియని వారిని ఒకచోట కలిపి, వ్యాపార సూచ నలు, సలహాలు అందించేందుకు ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.ముఖ్యంగా స్టార్టప్‌లకు ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందన్నారు. పది దేశాల నుంచి సుమారు వెయ్యి మంది వ్యాపార సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని పలువురు అసోసియేషన్ సభ్యులు వివరించారు. సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువ ఉన్న వ్యాపార సంస్థలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 100కుపైగా స్టార్టప్ కంపెనీలు దరకాస్తు చేసుకున్నాయని తెలిపారు. 2016లో 100 మంది సభ్యులతో ఆప్టా బిజినెస్ ఫోరం ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం ఆ సంఖ్య 800 మందికి చేరిందన్నారు. ఆప్టా 35 రకాల సేవా కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. అమెరికా రావాలనుకునే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. సమావేశంలో ఆప్టా బిజినెస్ ఫోరం ప్రతినిధులు రమేశ్, మధు, సాగర్, తేజ్ పాక్యాల, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: విదేశీ పెట్టుబడులతో పాటు లోకల్ బ్రాండింగ్ కోసం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ నేతృత్వంలో ఇవాళ(మంగళవారం) బిజినెస్ సమ్మిట్ మొదలైంది. ఈ సమ్మిట్‌లో నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు హాజరయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, చేనేత, టెక్స్ టైల్ తదితర రంగాల్లో అవకాశాల వివరణకు ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలవనుంది. ప్రముఖంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎగుమతి అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులైన బి.భాస్కర్, పి.హరీష్‌లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో ప్రత్యేకార్షణగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఉద్యానవనం, ఆహారశుద్ధి, వ్యవసాయం, మత్స్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, పర్యాటక విభాగం అథారిటీ సీఈవో కె.కన్నబాబు, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు. సంబంధిత కథనం: 3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు -
‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు’
సింగపూర్: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలుచేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 2034 నాటికి 850 బిలియన్ అమెరికా డాలర్ల ఆర్థికశక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీనికోసం సత్వర ఆర్థిక అభివృద్ధి, భవిష్యత్తు మానవవనరులను సిద్ధంచేయడానికి మానభివృద్ధి రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం, బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించడం, పరిపాలనలో పారదర్శకతను సాధించడం, ఈ నాలుగు అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలుచేస్తున్నామని బుగ్గన విశదీకరించారు. సింగపూర్‌లో నిర్వహించిన ‘‘ఇండియా సింగపూర్ – ది నెక్ట్స్ ఫేజ్ సదస్సు’’లో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనంలో సింగపూర్ కీలక భాగస్వామి అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సమగ్రాభివృద్ధికోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. తమ నాయకుడు 3,648 కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో చేసిన సుదీర్ఘయాత్రలో ప్రజలనుంచి విన్న అనేక సమస్యలు, స్వీకరించిన అనేక విజ్ఞప్తుల ప్రాతిపదికగా విజన్‌ను రూపొందించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2035 నాటికి పట్టణజనాభా 35శాతం నుంచి శాతానికి పెరుగుతుందని తాము అంచనావేస్తున్నట్టు, ఆమేరకు ప్రజల అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని వెల్లడించారు. 86శాతం సీట్లు సాధించి అధికారంలోకి రావడంద్వారా రాజకీయ బలమైన రాజకీయ స్థిరత్వాన్ని సాధించామని, స్థిరమైన అభివృద్ధి ప్రణాళికలను కొనసాగించడానికి ఇదిచాలా దోహదపడుతుందని బుగ్గన చెప్పారు. 2034 నాటికి 850 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇప్పుడున్న అవకాశాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారశ్రామిక విప్లవానికి అవసరమైన నైపుణ్యమున్న మానవనరులను తయారుచేస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యం, సంరక్షణ, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం, యువకులకు, విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వటంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో 30శాతం జీఎస్డీపీ వ్యవసాయ అనుబంధరంగాలదేనని, ఇందులో పెట్టుబడులకు అపారఅవకాశాలున్నాయని బుగ్గన చెప్పారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, ఆక్వాకల్చర్, పశుసంవర్థక రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2030 నాటికి మౌళిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగం, పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రతిఏటా 300 బిలియన్ డాలర్లు ఖర్చుచేయాల్సి వస్తుందని బుగ్గన వివరించారు. వైజాగ్ – చెన్నై, చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడుల ద్వారా ఆ జోన్లను మరింత బలోపేతం చేస్తున్నామని ఆర్థిక మంత్రి వివరించారు. కనెక్టివిటీని మరింత పెంచడానికి గ్రీన్‌ఫీల్డ్‌ఎయిర్ పోర్టును బలోపేతం చేయడమే కాకుండా, మరో రెండు ఎయిర్ పోర్టులను కూడా అభివృద్దిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నవరత్నాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలసహా, అవినీతి రహిత రాష్ట్రంకోసం ఇటీవల తీసుకుంటున్న చర్యలను బుగ్గను వివరించారు. గ్రామ సచివాలయాల ద్వారా అధికార వికేంద్రీకరణ, ప్రజల ముందుకు ప్రభుత్వ సర్వీసులను తీసుకొస్తున్నామని చెప్పారు. పరస్పర ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రగతి బాటలో కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. -
విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమిట్
28, 29 తేదీల్లో నిర్వహణ సాక్షి, విశాఖపట్నం: జాతీయ స్థాయిలో సముద్ర వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో రెండు రోజుల పాటు ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమిట్ నిర్వహించనున్నట్లు మారిటైమ్ గేట్‌వే ఎడిటర్ ఇన్ చీఫ్, పబ్లిషర్ ఆర్.రాంప్రసాద్ బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్, విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రధాన ప్రాయోజిత కంపెనీలుగా వ్యవహరిస్తామని సమావేశంలో పాల్గొన్న పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్, వీసీటీ వైస్ చైర్మన్ అనిల్ నారాయణ్ తెలిపారు. తూర్పు తీరం(ఈస్ట్‌కోస్ట్)లో మారిటైమ్ బిజినెస్‌ను అభివృద్ధి చేయడంపై ఈ సమిట్‌లో చర్చిస్తామన్నారు. విశాఖలో ఈ తరహా సమావేశం ఇది మూడవది. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించనున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సు అరుదైన రాజకీయ కలయికకు వేదిక కానుంది. శుక్ర, శనివారాల్లో జరుగనున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకే వేదిక పంచుకోనున్నారు. శుక్రవారం జరుగనున్న ప్లీనరీ సదస్సులో మొదట జైట్లీ మాట్లాడనుండగా.. ఆ తర్వాత ఇద్దరు వక్తల అనంతరం కేజ్రీవాల్ ప్రసంగించనున్నారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో జైట్లీ-కేజ్రీవాల్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధానికి తెరలేపిన సంగతి తెలిసిందే. జైట్లీ హయాంలో డీడీసీఏలో అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపిస్తే.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేశారు. ఉప్పు-నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదికపై ప్రసంగించనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మమత సర్కార్ వరుసగా రెండోసారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో జైట్లీతోపాటు మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులైన నితిన్ గడ్కరీ, సురేశ్‌ప్రభు, పీయూష్ గోయల్ పాల్గొంటున్నారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, బంగ్లాదేశ్ వాణిజ్యశాఖ మంత్రి తొఫైల్ అహ్మద్‌తోపాటు ముఖేశ్ అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలుస్తోంది.