
యూఎస్‌జీసీఐ ఇండియా చాప్టర్ ప్రారంభ కార్యక్రమంలో అపోలో మెడ్‌స్కిల్స్ సీఈవో శ్రీనివాస్ రావు పులిజల, ట్రంప్ సలహాదారు మార్క్ బర్న్స్, యూఎస్‌జీసీఐ ఇండియా చాప్టర్ ఫౌండర్ సోలొమన్ గట్టు తదితరులు (ఎడమ నుంచి)
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం
ట్రంప్ సలహాదారు మార్క్ బర్న్స్ వెల్లడి
యూఎస్‌జీసీఐ ఇండియా చాప్టర్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్–అమెరికా మరింతగా కసరత్తు చేస్తున్నాయి. 2023లో సుమారు 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ఇరు దేశాలు పరస్పరం కొనుగోళ్లు, పెట్టుబడులను మరింతగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూఎస్‌జీసీఐ) ఇండియన్ చాప్టర్‌ను అధికారికంగా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు మార్క్ బర్న్స్ ఈ విషయాలు తెలిపారు.
ఇరు దేశాల భాగస్వామ్యం .. అసాధారణ వృద్ధి, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. మిషన్ 500 కింద ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులకు ఇరు దేశాలు పెద్ద పీట వేస్తున్నాయన్నారు. భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 54 శాతం అమెరికాకే ఉంటున్నాయని చెప్పారు. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో వంటి దేశీ దిగ్గజాలు తమ దగ్గర, మైక్రోసాఫ్ట్.. గూగుల్ వంటి అమెరికన్ దిగ్గజాలు భారత్‌లోను భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని మార్క్ వివరించారు.
యూఎస్‌ఏఐడీ స్థానంలో యూఎస్‌జీసీఐ..
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) కొనసాగింపుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు యూఎస్‌జీసీఐ ఉపయోగపడనుంది. యూఎస్‌ఏఐడీ సహాయం నిలిపివేతతో నిల్చిపోయిన ప్రాజెక్టులను టేకోవర్ చేయడంపై ఇది దృష్టి పెడుతుందని యూఎస్‌జీసీఐ సహ వ్యవస్థాపకుడు ఘజన్‌ఫర్ అలీ తెలిపారు.
ఇది గ్రాంట్ల మీద ఆధారపడకుండా కార్పొరేట్లు, ప్రభుత్వాల భాగస్వామ్యం దన్నుతో పనిచేస్తుందని ఆయన వివరించారు. యూఎస్‌ఏఐడీ కింద ఏటా 20 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుండగా, ప్రస్తుతం 130 పైచిలుకు దేశాల్లో తత్సంబంధిత ప్రాజెక్టులు దాదాపుగా నిల్చిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటైన తమ సంస్థ, ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు కృషి చేయనుందని వివరించారు.
ఇప్పటికే 40 పైగా దేశాలు తమ వద్ద కూడా చాప్టర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వనించినట్లు చెప్పారు. యూఎస్‌ఏఐడీ ప్రభావిత ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంత దేశాల్లోని ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు. భారత్‌లో యూఎస్‌జీసీఐ ప్రయత్నాలు విజయవంతమైతే మిగతా దేశాల్లోనూ పునరావృతం చేసేందుకు బ్లూప్రింట్‌గా ఉపయోగపడుతుందన్నారు.
5 బిలియన్ డాలర్ల సమీకరణ
వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్ డాలర్ల సామాజిక పెట్టుబడులను సమీకరించాలని యూఎస్‌జీఐసీ నిర్దేశించుకున్నట్లు అలీ చెప్పారు. అలాగే నిర్మాణాత్మక పెట్టుబడుల ద్వారా అమెరికా–భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20–30 శాతం వృద్ధి చెందగలదని, ప్రాజెక్టుల పునరుద్ధరణతో 5,00,000 పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెక్నాలజీ, తయారీ, ఇంధనం వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అలీ వివరించారు. యూఎస్‌జీసీఐకి భారత్ కీలక హబ్‌గా నిలవగలదని ఆయన చెప్పారు.
టారిఫ్‌లపై క్రియాశీలకంగా భారత్..
వివాదాస్పదమైన టారిఫ్‌లపై స్పందిస్తూ.. ఈ విషయంలో భారత్ క్రియాశీలక చర్యలు తీసుకుందని మార్క్ చెప్పారు. ఇప్పటికే కొన్ని రంగాల్లో టారిఫ్‌లను తగ్గించడం ప్రారంభించిందని, మరిన్ని అంశాల్లో మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అమెరికా నుంచి భారత్ మరింతగా ఆయిల్, గ్యాస్ మొదలైనవి కొనుగోలు చేయనుండగా, కీలకమైన మరిన్ని మిలిటరీ ఉత్పత్తులను అమెరికా అందించనుందని మార్క్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment