అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు
77,000 స్థాయిపై ముగిసిన సెన్సెక్స్
బ్యాంకులు, ఐటీ షేర్లకు భారీ డిమాండ్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది.
ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇన్వెస్టర్ల సంపద రయ్...
సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.
⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్‌టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది.
⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment