కడప ఎడ్యుకేషన్ : గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఓ మోస్తారు ఫలితాలు సాధించారు. 52 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 13వ స్థానంలో (చిట్టచివరి) నిలిచారు. గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ యేడాది ఒక్కశాతం పెరుగుదలతో 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే అట్టడుగు స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 21,393 మంది విద్యార్థులు హాజరుకాగా 11,167 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,526 మందికి గాను 4,877 మంది పాసై 46 శాతం ఉతీర్ణత సాధించారు.
బాలికల విభాగంలో 10,867 మందికి గాను 6,290 మంది ఉత్తీర్ణత సాధించి 58 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 777 మందికి గాను 454 మంది ఉత్తీర్ణత సాధించి 58 శాతం ఫలితాలు సాధించారు. బాలుర విభాగంలో 487 మందికి గాను 281 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల విభాగంలో 290 మందికి గాను 173 మంది పాసై 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఒకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానం సాధించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 3,451 మందికి గాను 1,728 మంది ఉత్తీర్ణత సాధించి 50 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో బాలురు 1305 మందికి గాను 577 మంది, బాలికల విభాగంలో 2146 మందికి గాను 1151 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలల్లో 261 మందికి గాను 183 మంది ఉత్తీర్ణత సాధించి 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా గతేడాదితో పోల్చితే ఒక శాతం ఫలితాలు మెరుగు పరుచుకున్నప్పటికి రెండు మెట్లు దిగి చివరి స్థానంలో నిలిచింది. 2012 ఫలితాల్లో 12వ స్థానం, 2013 ఫలితాల్లో 11వ స్థానంలో నిలిచిన జిల్లా 2014 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం, 2015 ఫలితాల్లో 13వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఒక శాతం ఫలితాలు మెరుగుపడ్డాయని, ఒకేషనల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచామని ఆర్‌ఐఓ జి.ఆర్.ఆర్. ప్రసాదరావు తెలిపారు.
మంచి ఫలితాలు సాధించిన జిల్లా విద్యార్థులు..
కాగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ప్రొద్దుటూరుకు చెందిన అభ్యాస్ కళాశాల విద్యార్థులు చెన్నా యామిని ఎంపీసీ విభాగంలో 464, భావన జూనియర్ కళాశాలకు చెందిన బి. శ్రీవిద్య 464 మార్కులతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. కడప శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు బి. లలిత్‌కుమార్ ఎంపీసీ విభాగంలో 463 మార్కులు, కే.ఆర్. శిరీష 463 మార్కులతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
బైపీసీ విభాగంలో విజయవర్షిణి 434 మార్కులు, శ్రీనాథ్ 433 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. విజయవాణి కళాశాలకు చెందిన సాయిచేతన ఎంపీసీలో 462 మార్కులు సాధించింది. గాయత్రి కళాశాలకు చెందిన కె.అనీల ఎంపీసీలో 462 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో కడప నగరానికి చెందిన శ్రీమేధా ‘వి’ విద్యార్థులు ఎం. విష్ణుఫణీంద్ర 485 మార్కులు, డి. మౌనిక 483 మార్కులు, బి. మానస 479, ఎస్. ఆదిల్ 473, రెడ్డినాగసాయి 472 మార్కులు సాధించారు.
లాస్ట్ నుంచి ఫస్ట్!
Published Fri, Apr 24 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement