4 యూనివర్సిటీలకు రూ.383 కోట్లు కేటాయింపు
వైవీయూకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని ప్రభుత్వం
కడప: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేయగా... వైఎస్ఆర్ జిల్లాలోని వైవీయూకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే అభివృద్ధి చెందిందనా? లేదంటే వైఎస్సార్ జిల్లాకు నిధులు ఇవ్వకూడదనే సంకల్పమా? అంటూ విద్యాధికులు నిలదీస్తున్నారు. జిల్లాపై వివక్ష ఉన్నా, విద్యారంగాన్ని రాజకీయ కోణంలో చూడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల పాపం యోగివేమన విశ్వవిద్యాలయానికి శాపంగా పరిణమిస్తోంది. నిధులు లేక నీరసిస్తున్న విశ్వవిద్యాలయానికి ఆర్థిక చేయూతనిచ్చి ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు.. పట్టించుకోకపోవడంతో గత 6 సంవత్సరాలుగా వైవీయూలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 1977 లో ఎస్వీయూ పీజీ సెంటర్‌గా ప్రారంభమైన కళాశాల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో 2006 మార్చి 9 న విశ్వవిద్యాలయంగా అవతరించింది. అప్పట్లో వైవీయూకు నిధుల వరద పారింది. అవసరమైన వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. వైఎస్ మరణానంతరం నిర్మాణంలో ఉన్న పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత పాలకులు వైవీయూ పట్ల చిన్నచూపు చూడటంతో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. 7 విభాగాలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు 26 విభాగాలతో దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులతో దినదినాభివృద్ధి చెందింది. వసతుల పరంగా ఇంకా నాలుగు ప్రధానమైన భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నా నిధుల కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి అయ్యేందుకు అప్పటి అంచనాల ప్రకారమే రూ.20 కోట్లు కావాల్సి ఉంది. పెరిగిన ధరలతో అంచనా వేస్తే అందుకు రెట్టింపు నిధులు అవసరం. వీటితో పాటు అసలు నిర్మాణాలే మొదలు పెట్టని భవనాలను పూర్తి చేయాలంటే మరో రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరం. మొత్తంగా మరో రూ.100 కోట్ల వరకు నిర్మాణాలకు నిధులు అవసరమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జిల్లా పట్ల ఉన్న వివక్ష ప్రదర్శిసోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అకడమిక్‌గా రాణిస్తున్నా...
2006లో ప్రారంభమైన విశ్వవిద్యాలయాలతో పోల్చుకుంటే వైవీయూ శరవేగంగా అభివృద్ధి చెందిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మంజూరైన నిధుల కారణంగా వైవీయూలో చాలా భవనాలు పూర్తయ్యాయి. ఆమేరకు 2012 నవంబర్‌లో 12(బీ) గుర్తింపును యూజీసీ ఇచ్చింది. తాజాగా 2016లో న్యాక్ బీ గ్రేడ్ సాధించింది. ఆలిండియా ర్యాంకింగ్‌లో 92వ స్థానంతో, రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయం అధ్యాపకులు లక్షలాది విలువైన పరిశోధక ప్రాజెక్టులను, యంగ్ సైంటిస్ట్ అవార్డులను దక్కించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కలల స్వప్నంగా నిలిచిన వైవీయూలో ఆయన మరణానంతరం అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం రూ.383కోట్లు 14 యూనివర్సిటీలకు కేటాయించగా అందులో వైవీయూకు స్థానం దక్కకపోవడం గమనార్హం.
అధికారులు నివేదిక పంపినా..
యోగివేమన విశ్వవిద్యాలయంలో నిలిచిపోయిన నిర్మాణాల గురించి గత ఏడాది అధికారులు నివేదికలు పంపారు. మూడు నెలల క్రితం కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో మంత్రి గంటాశ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సైతం ఆ నివేదికలు అందజేశారు. ఇలా మొత్తంగా మూడుసార్లు వైవీయూ అవసరాల గురించి నివేదికలను పంపినట్లు సమాచారం. అయినప్పటీకీ వైఎస్‌ఆర్ జిల్లా పట్ల ఉన్న వివక్షత కారణంగానే నిధులు కేటాయించలేదని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అనేకమార్లు జిల్లా పర్యటనకు వస్తున్నా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో కనీసం ఒక్కసారి కూడా యోగివేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించకపోవడం విచారకరం.
విశ్వవిద్యాలయాలను రాజకీయ కోణంలో చూడొద్దు
మేధో నిలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలను రాజకీయ కోణంలో పాలకులు చూడకూడదు న్యాక్ గ్రేడింగ్ సైతం సాధించిన వైవీయూకు నిధులు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా పాలకులు పునఃసమీక్షించి యోగివేమన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయాలి. - డాక్టర్ కంకణాల గంగయ్య, వైవీయూ అధ్యాపక సంఘం అధ్యక్షుడు
సీట్లు ఇవ్వలేదని కక్ష సాధింపు
ప్రస్తుత పాలకులకు వైఎస్‌ఆర్ జిల్లాలో సీట్లు రాలేదన్న అక్కసును అడుగడుగునా చూపుతున్నారు. విశ్వవిద్యాలయానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా వివక్షత చూపుతున్నారు. ఇలా ఒక్క విశ్వవిద్యాలయాన్ని పక్షపాత ధోరణితో చూడటం పాలకులకు తగదు. - దస్తగిరి, వైవీయూ పరిశోధక విద్యార్థి సంఘం నాయకుడు
వైవీయూకు మొండిచేయి
Published Mon, May 23 2016 1:27 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement