ఏఈఈ రవీంద్రుడు మృతి
► మూడ్రోజుల తరువాత వెలుగులోకి..
► ఉబ్బిపోయిన మృతదేహం
అనంతపురం : అనంతపురంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈ)గా పని చేసే పల్లా రవీంద్రుడు (50) మరణించారు. తన గదిలో మూడ్రోజుల కిందట ఆయన మరణించగా శుక్రవారం సాయంత్రం కొనుగొన్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రవీంద్రుడు రెండేళ్ల కిందట అనంతపురం జిల్లాకు బదిలీపై వచ్చారు. అవివాహితుడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన హౌసింగ్ బోర్డులోని ఓ అద్దె గదిలో ఉండేవారు. ఇటీవల గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారారు. ఈ నెల 23న కాంట్రాక్టర్ నల్లయ్యతో కలసి ఉరవకొండకు క్యాంపు వెళ్లారు. అక్కడ నిర్మాణ పనులు చూసుకుని మధ్యాహ్నం గదికి చేరుకున్నారు. అంతే అప్పటి నుంచి బయటకు రాలేదు. గదికి రెండు తలుపులు ఉండగా రెండింటికీ లోపలే గడియ పెట్టుకున్నాడు. ఆయన మొబైల్‌కు కార్యాలయ అధికారులు, సిబ్బంది, స్నేహితులు, కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రింగ్ అవుతున్నా...రిసీవ్ చేయలేదు.
వెలుగులోకి వచ్చింది ఇలా... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని రవీంద్రుడు నిర్మించారు. ఆలయ నిర్వహణకు కొందరిని నియమించాడు. అయితే ఆ ఆలయానికి కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలో నిర్వాహకులు 23 నుంచి పలుమార్లు రవీంద్రుడికి ఫోన్ చేశారు. స్పందన లేదు. ఈ క్రమంలో శుక్రవారం గురుప్రసాద్ అనే వ్యక్తి జమ్మలమడుగు నుంచి నేరుగా అనంతపురంలోని రవీంద్రుడి గదికి చేరుకున్నాడు. గడియ పెట్టుకోవడంతో ఎంతసేపు పిలిచినా స్పందించలేదు. తర్వాత కిటీలో నుంచి తొంగిచూడగా ఆయన రక్తపుమడుగులో పడి ఉన్నాడు.
వెంటనే అపార్టుమెంట్ యజమానికి సమాచారం అందించాడు. ఆయన వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ శుభకుమార్ తమ సిబ్బందితో వచ్చి వాకిలిని బలవంతంగా తొలిగించి లోపలికి వెళ్లారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి భరించలేనంతగా వాసన వస్తోంది. మృతదేహం నుంచి అధికంగా రక్తస్రావమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు.
ఏమై ఉంటుంది..?
రవీంద్రుడు కొంతకాలంగా బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎండ తీవ్రత నెలకొన్న పరిస్థితుల్లో క్యాంపునకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారా, లే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు.