కడప సెవెన్‌రోడ్స్: ఇటీవల నీతిఆయోగ్ దేశంలో 115 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించింది. ఇందులో మన జిల్లా ఒకటి. ఇందుకోసం ఆరు ఇండికేటర్స్ ప్రాతిపదికగా తీసుకున్నారు. 2022నాటికి జిల్లాను బెస్ట్ జిల్లాగా అభివృద్ధి చేయాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే జిల్లాకు కేంద్రం నుంచి నిధులు వెల్లువెత్తుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న నిధులను కన్వర్జెన్సీ మోడ్‌లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపీ ల్యాడ్స్‌ను కూడా ఇందుకు విని యోగించనున్నారు. అప్పటికి గ్యాప్స్ ఏవైనా ఉంటే నీతి ఆయోగ్‌కు ప్రతిపాదిస్తారు. ఆ తరువాత వారు అన్ని పరిశీలించిగానీ ఒక నిర్ణయం తీసుకోరు. కేంద్ర ఫిషరీస్, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి.కిషోర్ బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. దీంతో జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్‌లైంది.
వివిధ అంశాల్లో జిల్లాస్థాయి..
జిల్లాలో బరువు తక్కువ పిల్లలు 34.4 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో తూర్పు గోదావరి 27.1శాతంతో స్టేట్ బెస్ట్‌గా ఉంది. నాగాలండ్‌లోని మొకోక్‌షుంగ్‌లో బరువు తక్కువ పిల్లలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోని 12–23 నెలల పిల్లలు వ్యాధి నిరోధక టీకాలు పొందిన వారు 65.3 శాతం ఉండగా 76.3శాతంతో అనంతపురం మొదటిస్థానంలో ఉంది. ఆసుపత్రుల్లో ప్రసవాలు జిల్లాలో 93.7శాతం ఉండగా 97.5 శాతంతో గుంటూరు మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న పిల్లల్లో ఎత్తు తక్కువ ఉన్నవారు 36.3శాతం బరువు తక్కువ ఉన్నవారు 17.9 శాతం ఉన్నారు. నిరక్షరాస్య మహిళలు 36.4శాతం ఉన్నారు. ఓడీఎఫ్ కింద ప్రకటించిన గ్రామాలు 5.58 శాతం ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో డ్రాప్ అవుట్ రేటు 9శాతం, విద్యార్థుల–ఉపాధ్యాయుల నిష్పత్తి 15శాతం, ఎస్సీఆర్ 15శాతం ఉంది. వ్యక్తిగా మరుగుదొడ్లు కవరైన కుటుంబాలు 32.57 శాతం ఉన్నాయి. తాగునీటి సౌకర్యం కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో 100శాతం ఉండడం గమనార్హం. జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. జిల్లా జనాభాలో 12శాతం బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయి. లోన్ డిపాజిట్ 82శాతం ఉంది. జాబ్‌కార్డులు 100శాతం మంది పొందగా ఉపాధి కింద 84.77శాతం మంది పనులు కల్పించారు. 100 పని దినాలు పూర్తిచేసిన కుటుంబాలు 6.64 శాతం ఉన్నాయి.
2022 నాటికి బెస్ట్ జిల్లాగా కడప
2022నాటికి వైఎస్సార్ జిల్లా అభివృద్ధిలో ఉత్తమ జిల్లాగా ఎదగాలన్నది లక్ష్యమని కేంద్ర ఫిషరీస్, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి.కిషోర్ అన్నారు. నిర్ధేశిత గడువులో జిల్లాను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. నీతిఆయోగ్ వైఎస్సార్ జిల్లాకు మౌలిక సదుపాయాల కమిటీలో సభ్యత్వం ఇచ్చిందని తెలిపారు. ఏ శాఖకు ఎంత బడ్జెట్ వస్తోందో చూసుకోవాలన్నారు. అవసరాలను బట్టి శాఖల మధ్య నిధులను అడ్జస్ట్ చేసుకోవాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ కూడా వినియోగించుకోవాలని ఇంకా అవసరమైతే నీతిఆయోగ్‌కు ప్రతిపాదనలు పంపాలన్నారు. కలెక్టర్ బాబురావునాయుడు, డీఆర్వో బాబయ్య, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment