♦ వైవీయూలో కొనసాగుతున్న సమ్మె
♦ వీసీ కారు డ్రైవర్ సహా అందరూ సమ్మెలోకి..
♦ మంగళవారం విధులకు గైర్హాజరు
♦ బోధనేతర సిబ్బంది సమస్యలపై కమిటీ ఏర్పాటు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణలో భాగంగా మంగళవారం విధులకు గైర్హాజరయ్యారు. స్నాతకోత్సవ పనులకు సైతం వీరంతా దూరంగా ఉండిపోయారు. విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నీటిసమస్య తలెత్తడంతో అధికారులు బయటి నుంచి మినరల్ వాటర్ తెప్పించుకుని పనులు కానించారు. దీంతో పాటు వైస్ చాన్స్‌లర్ వాహన డ్రైవర్ సైతం సమ్మెలోకి వెళ్లడంతో ఆయన ప్రైవేట్ డ్రైవర్‌ను పిలిపించుకుని విధులకు హాజరయ్యారు.
సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ...!
గత నాలుగురోజులుగా బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో వైవీయూలో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. కాగా బోధనేతర సిబ్బంది పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటుండగా... తమ సమస్యలను పట్టించుకోనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని బోధనేతర సిబ్బంది వాదిస్తున్నారు. దీనికి తోడు స్నాతకోత్సవం, ఈనెల 30 నుంచి వైవీయూ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సమ్మె మరింతకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. సమ్మెను విరమించేందుకు పలు ప్రతిపాదనలతో సబ్‌కమిటీ వేసినట్లు సమాచారం. వైవీయూ రెక్టార్, పాలకమండలి సభ్యుడు అయిన ఆచార్య ఎం. ధనుంజయనాయుడు అధ్యక్షతన పలువురు పాలకమండలి సభ్యులతో పాలకమండలి సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.