బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ బుధవారం స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్‌బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment