కీవ్‌లో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్, బ్లింకెన్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
వాషింగ్టన్: రష్యాతో యుద్ధంలో విజయం సాధించాలన్న ఉక్రెయిన్ లక్ష్యసాధనకు పూర్తిగా సహకారం అందిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ ఆదివారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై సంఘీభావం ప్రకటించారు. ఫారిన్ మిలిటరీ ఫైనాన్సింగ్ కింద ఉక్రెయిన్‌కు మరో 32.2 కోట్ల డాలర్లు అందజేస్తామని తెలిపారు. 16.5 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయిస్తామని వెల్లడించారు.
వారికి జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. వారితో భేటీ చాలా బాగా జరిగిందంటూ వీడియో సందేశం విడుదల చేశారు. తిరుగు ప్రయాణంలో లాయిడ్, బ్లింకెన్ సోమవారం పోలండ్‌లో మీడియాతో మాట్లాడారు. డోన్బాస్‌పై రష్యా దృష్టి పెట్టడంతో ఉక్రెయిన్ సైనిక అవసరాలూ మారాయన్నారు. ‘‘సరైన ఆయుధ సామగ్రి, మద్దతుంటే ఉక్రెయిన్ నెగ్గడం సులభమే. అందుకు చేయాల్సిందంతా చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. రష్యాకు పరాభవం తప్పదని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యం నెరవేరదని అన్నారు.
త్వరలో ఉక్రెయిన్ ఎంబసీ పునరుద్ధరణ
ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని త్వరలో పునఃప్రారంభిస్తామని అమెరికా ప్రకటించింది. తొలుత లివీవ్‌లో రాయబార కార్యకలాపాలు మొదలు పెడతామని పేర్కొంది. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా బ్రిడ్‌గెట్ బ్రింక్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment