పదికి పదిలమే | Read the planned | Sakshi
Sakshi News home page

పదికి పదిలమే

Published Sat, Mar 14 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

Read the planned

ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
నూతన సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి
అప్పుడే పదికి పది పాయింట్లు సాధ్యం

 
మరి కొద్ది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సిలబస్ అందునా సీసీఈ మోడల్ పరీక్ష విధానం మొదటి సారిగా అమలు చేయనున్నారు. దీంతో విద్యార్థులో కాస్త భయం, ఎలా ప్రిపేరవ్వాలా అన్న ప్రశ్న వేధిస్తున్నాయి. సరైన ప్రణాళి కతో చదువుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ పది పాయింట్లు సాధించొచ్చని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.   
                    - లబ్బీపేట
 
తెలుగులో మార్కులు సులువే
 
ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి.
ప్రతిపదార్థాలు చదివేటప్పుడు నక్షత్రం గుర్తుగల పద్యాలను ఎక్కువగా చదవాలి.
పద్య పూరణలు చేసేటప్పుడు ప్రాస            అక్షరాలను సరిచూసుకోవాలి.
అపరిచిత పద్యగద్యాలను చదవి అర్థం          చేసుకుంటే మార్కులు ఎక్కువ పొందొచ్చు.
వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు సామెతలు గానీ, జాతీయాలు గానీ వాడితే ఎక్కువ మార్కులు వస్తాయి.
ఉపవాచకంలో సంఘటనలను వరుసక్రమంలో రాసేందుకు క్షుణ్ణంగా ఉపవాచక పఠనం చేయాలి.
ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే పార్ట్-బీ          విషయంలో తగిన శ్రద్ధ వహించాలి
వాక్యాలు, వానిలోని రకాలు అన్నింటిలోను ప్రాక్టీసు చేయాలి.
సంస్కృతం చదివేటప్పుడు, రాసేటప్పుడు సారాంశాలను క్షుణ్ణంగా చదవాలి.
శబ్దధాతువులను ఎక్కువుగా సాధన చేయాలి.
 
 హిందీపై ఆందోళన అనవసరం
 
హిందీలో పది పాయింట్లు సాధించడానికి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉండేలా సాధన చేయాలి. పాఠ్యపుస్తకాలను చదవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే పూర్తిసామర్థ్యంతో సారాంశం రాయగలుగుతారు.
వ్యాకరణంలో కూడా 25 కి 25 మార్కులు సాధించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకంలోని భాషను ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఏ విధంగా ప్రశ్నను అడిగినా         సమాధానం రాయగలిగేలా సాధాన చేయాలి.
ప్రతి వాక్యాన్ని అర్థవంతంగా రాయాలి. ప్రతి ప్రశ్నకూ కవిని పరిచయం చేస్తూ సమాధానం రాయాలి. దీని వల్ల పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా మన సమాధానం ఉండాలి.
లేఖ రాసేటప్పుడు ఒక్క పేజీలోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.
వ్యాసం రాసేటప్పుడు ముఖ్యాంశాలను పరిచయం చేస్తూ, సైడ్ హెడ్డింగ్ రాస్తూ పేరాలుగా విభజించాలి.
పాఠ్యపుస్తకంలోని ప్రతిపాఠం వెనుక ఇచ్చిన వ్యాకరణాన్ని తప్పకుండా చదివి సాధన చేయాలి.
 
 ఇంగ్లిషులో మార్కులు ఎంతో ఈజీ
 
మొదట ఇచ్చిన పశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి
సమాధానాలను వరుసక్రమంలో రాయాలి.
ఇంగ్లిష్‌లో ప్రశ్నలకు మూడు విధాలుగా మార్కులు కేటాయిస్తారు. ఒక మార్క్, రెండు మార్కులు, పది మార్కులు విభాగాలు ఉంటాయి.
రెండు మార్కుల విభాగంలో రెండుకు రెండు మార్కులు వచ్చే విధంగా పది వ్యాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయాలి.
ఒక మార్కు ప్రశ్నలకు 3, 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ముఖ్యమైన వాక్యాలను అండర్‌లైన్ చేయాలి.
టెక్ట్స్‌బుక్ ఒకేబులరీని తప్పనిసరిగా వాడాలి. వ్యాక్యాలు సమాధానానికి సంబంధించినవిగా ఉండాలి.
పేపర్-2లో ఉండే పది మార్కుల ప్రశ్నలకు రైటింగ్ స్కిల్స్ అండ్ లెటర్ రైటింగ్ రెండు పేజీలకు తగ్గకుండా టాఫిక్‌కు సంబంధించిన పదాలను వాడుతూ సమాధానాలను రాయాలి.
లెటర్ రైటింగ్‌లో ఫార్మెట్‌ను ఫన్‌క్చ్యుయేషన్ సహా పాటించాలి. మంచి పదాలను ప్రయోగించాలి.
 
 గణితమంటే భయమొద్దు
 
గణితంపై భయం వీడాలి. భావనలు, పద్ధతులను ఉపయోగించి లెక్కల సాధన రోజూ చేయాలి.
సూత్రాలను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఉదాహరణ సమస్యలను అవగాహన చేసుకోవాలి.
సమస్యలో ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకుని లెక్క చేసే పద్ధతిని తెలుసుకోవాలి.
వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, ప్రోగ్రేషన్స్, ప్రాబబులిటీ, కో ఆర్డినెట్ జామెట్రీ, మెన్సురేషన్, సంఖ్యాకశాస్త్ర అంశాలపై దృష్టి సారించాలి.
లెక్కల సాధనకు అన్ని సూత్రాలను నేర్చుకోవాలి.
పార్ట్-బీ కోసం ఎక్కువ బిట్స్‌ను సాధన చేయాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నా పత్రాలు సాధన చేయాలి.
ఒక్క మార్కు ప్రశ్నల కోసం అన్ని అధ్యాయాలందు ఉన్న నిర్వచనాలు, ఫజిల్స్, పదసమస్యలు, పట సమస్యలను సాధన చేయాలి.
 
సాంఘికశాస్త్రంలో బిట్లు, మ్యాపులు కీలకం
 
ప్రస్తుత సిలబస్‌ని అనుసరించి ప్రతి విద్యార్థి పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన పొందాలి.
సాంఘికశాస్త్రంలో పది పాయింట్లు రావడానికి ముఖ్యమైన అంశంగా బిట్స్ మ్యాప్ పాయింటింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి.
ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులను విద్యార్థి అవగాహన చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు.
ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో ఏ విధంగా ప్రశ్న అడిగినప్పటికీ సరైన సమాధానం రాసేలా సాధన చేసి సిద్ధంగా ఉండాలి.
పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా నేర్చుకుని వాటిపై పట్టు సాధించాలి.
ఆయా పాఠ్యాంశాలు, ప్రశ్నలకు సంబంధించిన కాలం(సంవత్సరాలు), వ్యక్తుల పేర్లపై పూర్తి అవగాహన పొందాలి.
పాఠ్య పుస్తకంలో ఇచ్చిన బార్ గ్రాఫులను, వెన్, డయాగ్రామ్స్, టైమ్ లైన్ చార్ట్స్‌ను అర్థం చేసుకుని రాయగలిగితే పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది.
 
ఫిజికల్ సైన్స్.. పాఠ్యపుస్తకాలను చదవాలి
 
విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.
అకడమిక్ స్టాండర్డ్స్ మార్కుల వెయిటేజీ గురించి అవగాహన ఉండాలి.
కెమిస్ట్రీలో ఉన్న ఈక్వేషన్స్‌ను బాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి.
పాఠ్యపుస్తకంలోని బొమ్మలు, వాటి భాగాలను సరైన విధంగా గుర్తించేటట్లుగా సాధన చేయాలి, భాగాల విధులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు, బిట్స్‌కు ప్రధాన్యత ఇవ్వాలి. సమ్స్(సాల్వ్‌డ్, అన్‌సాల్వ్‌డ్)ను సాధన చేయాలి.
డు యు నో దిస్, ట్రై దిస్, అడిషనల్ ఇన్షర్మేషన్, థింక్ అండ్ డిస్‌కస్, బిల్డ్ అప్ క్వశ్చన్స్, ఇన్‌ఫర్‌మాటిక్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇన్‌టెక్ట్స్ క్వశ్చన్స్ వంటి వాటిని హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్(హాట్స్)గా అడగవచ్చు.
కేటాయించిన మార్కులను బట్టి సమాధానాలు హెచ్చుతగ్గులు లేకుండా రాయాలి. ముఖ్యమైన పదాలను అండర్‌లైన్ చేయాలి.
ప్రతి లెసన్‌కు మైండ్ మ్యాపింగ్ ఫార్మెట్‌ను తయారు చేసుకుని దానిని సాధన చేయాలి.
 
నేచురల్ సైన్స్‌లో.. విశ్లేషించి జవాబులు రాయాలి

పాఠ్యపుస్తకాలను అనుసరించి విషయ పరిజ్ఞానం పొందడంతో పాటు, దానిలోని అన్ని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి సమాధానాలు రాయాలి.
రాసిన సమాధానాలను పుస్తక పరిభాషను అనుసరించేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిత్రాలు గీసేటప్పుడు చెక్కినట్లుగా అర్థవంతంగా గీయాలి. అన్ని భాగాలను సరిగా గుర్తించాలి.
దైనందిన జీవితంలో జరిగే విషయాల గురించి అవగాహన ఉన్నచో సమాధానాలు సులువుగా రాయగలుగుతారు.
అన్నింటికంటే మంచి ఆరోగ్యం,         {పశాంతమైన మనస్సు ఎంతో అవసరం
 
సరిగా ప్రజెంట్ చేయడం ముఖ్యం

 మనం ఎంతకష్టపడి చదవినా దానిని సరిగా ప్రజెంట్ చేయలేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందమైన చేతిరాత, మార్జిన్లు కొట్టడం, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పాటించడం ముఖ్యం. పేజీకి 18 నుంచి 20 వాక్యాలు ఉండేలా రాయాలి. సైడ్ హెడ్డింగ్స్‌కు తప్పనిసరిగా అండర్‌లైన్ చేయాలి. బ్లూ, బ్లాక్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలి. స్కెచెస్, షేడ్‌పెన్స్ వాడకూడదు. పరీక్ష సమయానికి అర్ధగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. పరీక్ష రాసేటప్పుడు పూర్తి ఏకాగ్రత, సమయపాలన పాటించాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే పదిలో పదికి పది పాయింట్లు తేలిగ్గా సాధించవచ్చు.          
  - మురళీకృష్ణ, ఏజీఎం, శ్రీ చైతన్య స్కూల్స్
 
ఒత్తిడిని దూరంచేయాలి

 పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా కామన్ పరీక్షలు రాస్తున్నారు. అందునా ఈ ఏడాది కొత్త సిలబస్ ఎలా ఉంటుందోనని ఆందోళన సహజం. అయితే ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కచ్చితంగా సమాధానం రాయగలమనే సానుకూల దృక్పథంతో పరీక్ష హాలులోకి వెళ్లాలి. ఎటువంటి ఒత్తిడికి తావివ్వకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే చదివిన ప్రశ్నలు కూడా సమాధానం రాయలేని స్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో ముందుగానే ఎలా ప్రశ్నలు సమాధానాలు రాయాలి. మంచి మార్కులు పొందడం ఎలా అనే అంశంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంతో పరీక్షకు ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాలి. ఒకేవేళ్ల ట్రాఫిక్‌లో చిక్కుకుని పరీక్షకు ఆలస్యంగా వెళ్తే ఆ ఒత్తిడిలో సరైన సమాధానాలు రాయలేరు.  అందుకే కేర్‌ఫుల్‌గా ఉంటే మంచి మార్కులు పొందవచ్చు.
 - డాక్టర్ టి.ఎస్.రావు, సైకాలజిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement