
ఇక సరికొత్త 'టెన్త్'
పదో తరగతి సిలబస్‌తో పాటు పరీక్షా విధానంలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి మార్పులు రానున్నాయి. రాత పరీక్షలను 80 శాతానికే పరిమితం చేయనున్నారు. మిగతా 20 శాతం మార్కులను నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా నిర్థారిస్తారు.
పదో తరగతిలో సంస్కరణలు
పరీక్షల విధానంలోనూ మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్షలు
20 మార్కులకు నిర్మాణాత్మక మూల్యాంకనం
మొత్తం 40 మార్కులు వస్తేనే పాస్
‘బట్టీ’ జవాబులకు సెలవు..
9, 10కి అదనపు పాఠ్యకార్యక్రమాలు
రాష్ట్ర విద్య, పరిశోధన సంస్థ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి సిలబస్‌తో పాటు పరీక్షా విధానంలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి మార్పులు రానున్నాయి. రాత పరీక్షలను 80 శాతానికే పరిమితం చేయనున్నారు. మిగతా 20 శాతం మార్కులను నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా నిర్థారిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఈ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కేవలం రాత పరీక్షల ద్వారానే.. అది కూడా బట్టీపట్టి రాయడానికి వీలున్న పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే విద్యార్థుల ప్రతిభను కొలిచే పద్ధతిలో మార్పు తీసుకొచ్చే విధంగా పదో తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకురానున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ సంస్థ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సంస్కరణలు, ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు...
నాలుగు సార్లు నిర్మాణాత్మక మూల్యాంకనాలు...
ప్రతి సబ్జెక్ట్‌లో 80 శాతానికే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా 20 శాతం మార్కులను నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా నిర్ణయిస్తారు. విద్యాసంవత్సరంలో నాలుగు యూనిట్ పరీక్షల తరహాలో నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఉంటాయి. వాటి సగటును లెక్కిస్తారు.
సబ్జెక్ట్‌కు ఒకటే పేపర్
ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ద్వితీయ బాష (తెలుగు/హిందీ) మినహాయించి మిగతా అన్ని సబ్జెక్ట్‌లకు రెండేసి పేపర్లు ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి సైన్స్‌కు మినహా మిగతా సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రం, జీవ శాస్త్రాలను వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి ఒక్కోదానికి 50 మార్కులు ఉంటాయి.
కనీసం 40 శాతం మార్కులు వస్తేనే పాస్
రాత పరీక్ష ఒక్కో సబ్జెక్టు 80 మార్కులకు ఉంటుంది. పాస్ కావాలంటే కనీసం 30 మార్కులు తెచ్చుకోవాలి. భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు 50 మార్కులకే నిర్వహిస్తారు. ఆ పరీక్షలు ఒక్కో దానిలో కనీసం 15 మార్కులు వస్తేనే పాస్ అవుతారు. రాత పరీక్ష, నిర్మాణాత్మక మూల్యాంకనం కలిపి 100 మార్కులకు ఉంటుంది. రెండు కలిపినప్పుడు 40 మార్కులు (40 శాతం) వస్తేనే పాస్ అయినట్లు భావిస్తారు. రాత పరీక్షలో 30 మార్కుల కంటే తక్కువ వచ్చి, మొత్తం 40 శాతం వచ్చినా ఫెయిల్ అయినట్లే.
ఆలోచించి జవాబులు రాసేలా పరీక్షలు...
బట్టీపట్టి రాయటానికి వీలు లేని విధంగా ప్రశ్నా పత్రాన్ని రూపొందించనున్నారు. విద్యార్థులు ఆలోచించి జవాబులు రాసేలా ఉంటుంది. విశ్లేషణ, వివరణలతో పాటు బహుళ సమాధానాలు వచ్చే విధంగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పరీక్షలో.. 5 మార్కుల ప్రశ్నలు 4 (20 మార్కులు), 3 మార్కుల ప్రశ్నలు 10 (30 మార్కులు), 2 మార్కుల ప్రశ్నలు 10 (20 మార్కులు), ఒక మార్కు ప్రశ్నలు 10 (10 మార్కులు) చొప్పున మొత్తం 80 మార్కులకు ప్రశ్నలుంటాయి. 5, 3 మార్కుల ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు. పరీక్షలను కూడా రోజు విడిచి రోజు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ప్రశ్నాపత్రాన్ని చదివి అర్థం చేసుకోవడానికి అదనంగా 15 నిమిషాలు ఇవ్వనున్నారు.
అదనపు పాఠ్య కార్యక్రమాలు
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా 1 నుంచి 8 తరగతులకు ఆరోగ్య విద్య, కళలు - సంస్కృతి విద్య, పని - కంప్యూటర్ విద్య, విలువ - జీవన నైపుణ్యాలు.. సబ్జెక్టులను కూడా పాఠ్య విషయాలుగానే భావిస్తున్నారు. వీటికి కూడా మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇదే విధానాన్ని 9, 10 తరగతులకు కూడా విస్తరించనున్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు 50 మార్కులు ఉంటాయి. పదో తరగతి మార్కుల మెమోలో ఈ సబ్జెక్టుల గ్రేడ్లు కూడా పేర్కొననున్నారు. వీటికి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఉండదు. తొలి, మలి సంగ్రహణాత్మక మూల్యాంకనాల సగటును లెక్కించి హెడ్మాస్టర్ ఆన్‌లైన్ ద్వారా డేటా సమర్పించాలి.
నిర్మాణాత్మక మూల్యాంకనం ఇలా..
తరగతి గది బోధన సమయంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకు.. 5 మార్కులు
విద్యార్థుల నోట్‌బుక్స్‌లో సొంతంగా రాసిన జవాబులకు .. 5 మార్కులు
ప్రాజెక్టు పనులకు.. 5 మార్కులు
లఘు పరీక్షలకు.. 5 మార్కులు