రేపటి గురించి ఆలోచించండి!
కనువిప్పు
‘రేపటి పని ఇవ్వాళే చేయాలి... ఇవాళ్టి పనిని ఇప్పుడే చేయాలి’ అనే మాటను చాలాసార్లు విన్నాను గానీ ఎప్పుడూ దాన్ని ఆచరించిన పాపాన పోలేదు. ఏ రోజు సిలబస్ ఆ రోజే చదువుకోవాలనుకునేవాడిని. తరువాత ఆ విషయమే మరచిపోయేవాడిని. తీరా పరీక్షలు దగ్గర పడగానే గుండెలు పట్టుకునేవాడిని. కొండ లాంటి సిలబస్ అనకొండలా భయపెట్టేది. అలా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తప్పాను. సప్లిమెంటరీ పరీక్ష రాసి గట్టెక్కాను.
రెండో సంవత్సరం పరిస్థితి కూడా అంతే. డిగ్రీ మొదటి సంవత్సరంలో మాత్రం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఎప్పటి సిలబస్ అప్పుడే చదువుకోవడం ప్రారంభించాను. ఎప్పటి సిలబస్ అప్పుడే చదువుకోవడం వల్ల... పరీక్షలు ఎప్పుడొస్తాయనే ఉత్సాహం తప్ప... భయమనేది ఉండేది కాదు.
నేను అనుకున్నట్లుగానే డిగ్రీ మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో పాసయ్యాను. నా అనుభవం ఎందరో విద్యార్థులకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాను.
- పి. అమర్, నెల్లూరు