‘పరీక్షల్లో’ మార్పులు కొన్నే...
- టీఎస్‌పీఎస్‌సీకి సమీక్షా కమిటీ నివేదిక
- ప్రస్తుత పరీక్ష విధానంపై సిఫార్సులు
- ఒక్క ఏడాదికే వర్తింపజేయాలని సూచన
- గ్రూప్-1లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వద్దని సలహా
- సిలబస్‌లో తెలంగాణ అంశాలతో మార్పులు
- ఇక తుది నిర్ణయం సర్కారుదే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చే స్తూ గత ంలో వెలువడిన ఉత్తర్వుల అమలు విషయంలో నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పరీక్షల విధానంపై ఏర్పాటైన సమీక్ష కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఆ ఉత్తర్వుల అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు.
పోస్టుల విలీనంపై 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పారు. పైగా అందులో స్పష్టత లేనందువల్ల ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. పోటీ పరీక్షల విధానంపై సమీక్ష కమిటీ సిఫారసులతో కూడిన నివేదికను టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి హరగోపాల్, కోదండరాం గురువారం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పరీక్షల విధానంలో కొద్దిపాటి మార్పులనే సూచించినట్లు చెప్పారు. నిరుద్యోగులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఒక్క ఏడాదికి మాత్రమే వర్తించేలా మార్పులను సిఫారసు చేశామన్నారు.
ఆ తర్వాత అవసరమైన మార్పులను కమిషన్ చేసుకోవచ్చన్నారు. సిలబస్‌లో మాత్రం తెలంగాణకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక స్థితిగ తులు, చరిత్ర, రాజకీయ అంశాలను సిలబస్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పాలనాయంత్రాంగంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు పాలుపంచుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు సూచించామన్నారు. గ్రూప్-1 ఐదో పేపరులో మార్పుల విషయంలో నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. తమది సలహా కమిటీ మాత్రమేనని, సిఫారసులను టీఎస్‌పీఎస్‌సీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల్లో పేర్కొనే అంశాలే అమల్లోకి వస్తాయని వివరించారు. ఉద్యోగాలకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
ఏ దశలోనైనా మార్పులు: చక్రపాణి
ప్రస్తుతం కమిటీ చేసిన సిఫారసులపై కమిషన్‌లో చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, ఆ తర్వాతే ఉత్తర్వులు జారీ అవుతాయని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల్లో ఏ దశలోనైనా మార్పులు జరుగవచ్చన్నారు. అయితే భిన్న రంగాలకు చెందిన మేధావులతో కూడిన ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులను యథాతధంగా ఆమోదించే అవకాశముందన్నారు. వయోపరిమితి పెంపు, ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు.
సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష మేలు: హరగోపాల్
రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీసెస్ విధానం ఉంటే మంచిదేనని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పరీక్షా విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వేర్వేరు పరీక్షలు కాకుండా సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యే వారు మాత్రమే ఐఏఎస్ హోదాకు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. కర్ణాటకలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కేడర్ ఉందని, దానికి ఎంపికైన వారికి సీనియారిటీ ఆధారంగా ఐఏఎస్ హోదా కల్పిస్తున్నారని, అలాంటి విధానం తెలంగాణలోనూ ఉంటే బాగుంటుందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.