సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు(టీఆర్‌టీ) తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 52 కేంద్రాల్లో లాంగ్వేజి పండిట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 17,970 మంది దరఖాస్తు చేసుకోగా.. 17,333 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 16,827 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,473 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రం పేర్లు మారడం.. తప్పుగా ముద్రితమవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లే క్రమంలో ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు.
ఉదయం 9.15 వరకే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. దీంతో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కాగా, టీఎస్‌పీఎస్సీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టీఆర్‌టీ పరీక్షను తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పరీక్ష నిర్వహించామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.
క్షణక్షణం పర్యవేక్షణ..
పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్‌పీఎస్సీ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరీక్ష సమయం ముందు నుంచే చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్ తదితరులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నూతన టెక్నాలజీని వినియోగించుకున్న టీఎస్‌పీఎస్సీ ప్రతి కేంద్రంలో అభ్యర్థి వారీగా పరీక్ష రాసే తీరును పరిశీలించే వీలుంది. దీంతో అభ్యర్థుల హాజరు, ప్రశ్నలు చదవడం, జవాబులు రాయడం తదితర ప్రక్రియ అంతా ట్రాకింగ్ సిస్టం ద్వారా వారు వీక్షించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులపై కేంద్రాలవారీగా సంబంధిత బాధ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ నెల 25వ తేదీన(ఆదివారం) ఉదయం ఎస్టీజీ తెలుగు మీడియం, మధ్యాహ్నం ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
గోడదూకి వెళ్లినా..
టీఆర్‌టీ రాయడానికి ఇబ్రహీంపట్నంకు చెందిన అభ్యర్థి సుధీర్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలీలోని అయాన్ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో పరీక్షా కేంద్రం గోడదూకి లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు.
పరీక్ష కేంద్రం మార్పుతో..
ఇతని పేరు జటావత్ శంకర్. వికలాంగుడైన శంకర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం పులదేవి బండ తండా. టీఆర్‌టీకి దరఖాస్తు చేసిన శంకర్ రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఈ నెల 20న ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లోని ఇయాన్ సెంటర్ పరీక్ష కేంద్రంగా వచ్చింది. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శనివారం ఉదయం పరీక్ష సమయం కన్నా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు.
హాల్‌టికెట్ నంబర్ కనిపించకపోవడంతో నిర్వాహకులను ఆరా తీయగా.. కొందరి నంబర్లు మారాయని, ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోమని చెప్పడంతో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి మళ్లీ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో మల్లాపూర్ ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి వద్ద పరీక్షా కేంద్రానికి మారిందని ఉంది. అప్పటికే పరీక్ష సమయం కావడం.. అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వికలాంగుడైన తనను పరీక్షకు అనుమతించాలని ఇయాన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రాధేయపడ్డాడు. తామేం చేయలేమని వారు చెప్పడంతో నిరాశతో అక్కడే కూలబడి కన్నీరుమున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment