Teacher recruitment exam
-
టీఆర్టీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ను ప్రభుత్వం వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,089 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా గత నెల టీఆర్టీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 80 వేల మంది టీఆర్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పరీక్ష నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఇందుకోసం వారు ముందే సమాయత్తం కావాల్సి ఉంటుంది. మరోవైపు పరీక్ష రాసే అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పరీక్ష వాయిదాకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించడంతో విద్యాశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. నిరుద్యోగులను మోసగించడమే : ఏఐఎస్ఎఫ్ ఎన్నికలు వస్తున్నాయని తెలిసీ నియామక ప్రక్రియను అందుకు అనుగుణంగా చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శాఖ విమర్శించింది. ఎన్నికలను బూచిగా చూపించి టీఆర్టీ వాయిదా వేయడం నిరుద్యోగులను మోసగించడమేనని పేర్కొంది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. టీచర్ల నియామకంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. మొదట్నుంచీ కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ విమర్శించింది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. -
502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ యాజమాన్య పాఠశాలల్లో 502 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్లు జారీ చేసింది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (లిమిటెడ్ రిక్రూట్మెంట్) ద్వారా వీటిని భర్తీ చేయనుంది. గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లా పరిషత్ (జెడ్పీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207, మున్సిపల్ స్కూళ్లలో 15, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటరాధారితంగా పరీక్షలు ఈ టీచర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్), స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్), టీజీటీ (లాంగ్వేజెస్), టీజీటీ (నాన్ లాంగ్వేజెస్), టీజీటీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ), పీజీటీ (లాంగ్వేజెస్), పీజీటీ (నాన్ లాంగ్వేజెస్), పీజీటీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్), మ్యూజిక్, ఆర్ట్స్ విభాగాల వారీగా ఈ పరీక్షలుంటాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్ మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. -
టీఆర్టీ ప్రశాంతం
-
టీఆర్టీ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు(టీఆర్టీ) తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 52 కేంద్రాల్లో లాంగ్వేజి పండిట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 17,970 మంది దరఖాస్తు చేసుకోగా.. 17,333 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 16,827 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,473 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల హాల్టికెట్లలో పరీక్ష కేంద్రం పేర్లు మారడం.. తప్పుగా ముద్రితమవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లే క్రమంలో ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 9.15 వరకే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. దీంతో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కాగా, టీఎస్పీఎస్సీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టీఆర్టీ పరీక్షను తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పరీక్ష నిర్వహించామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. క్షణక్షణం పర్యవేక్షణ.. పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరీక్ష సమయం ముందు నుంచే చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్ తదితరులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నూతన టెక్నాలజీని వినియోగించుకున్న టీఎస్పీఎస్సీ ప్రతి కేంద్రంలో అభ్యర్థి వారీగా పరీక్ష రాసే తీరును పరిశీలించే వీలుంది. దీంతో అభ్యర్థుల హాజరు, ప్రశ్నలు చదవడం, జవాబులు రాయడం తదితర ప్రక్రియ అంతా ట్రాకింగ్ సిస్టం ద్వారా వారు వీక్షించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులపై కేంద్రాలవారీగా సంబంధిత బాధ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ నెల 25వ తేదీన(ఆదివారం) ఉదయం ఎస్టీజీ తెలుగు మీడియం, మధ్యాహ్నం ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గోడదూకి వెళ్లినా.. టీఆర్టీ రాయడానికి ఇబ్రహీంపట్నంకు చెందిన అభ్యర్థి సుధీర్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలీలోని అయాన్ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో పరీక్షా కేంద్రం గోడదూకి లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో.. ఇతని పేరు జటావత్ శంకర్. వికలాంగుడైన శంకర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం పులదేవి బండ తండా. టీఆర్టీకి దరఖాస్తు చేసిన శంకర్ రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఈ నెల 20న ఆన్లైన్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లోని ఇయాన్ సెంటర్ పరీక్ష కేంద్రంగా వచ్చింది. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శనివారం ఉదయం పరీక్ష సమయం కన్నా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. హాల్‌టికెట్ నంబర్ కనిపించకపోవడంతో నిర్వాహకులను ఆరా తీయగా.. కొందరి నంబర్లు మారాయని, ఆన్లైన్లో చెక్ చేసుకోమని చెప్పడంతో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి మళ్లీ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో మల్లాపూర్ ఎన్ఎఫ్సీ బ్రిడ్జి వద్ద పరీక్షా కేంద్రానికి మారిందని ఉంది. అప్పటికే పరీక్ష సమయం కావడం.. అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వికలాంగుడైన తనను పరీక్షకు అనుమతించాలని ఇయాన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రాధేయపడ్డాడు. తామేం చేయలేమని వారు చెప్పడంతో నిరాశతో అక్కడే కూలబడి కన్నీరుమున్నీరయ్యాడు. -
రెండో రోజూ ప్రశాంతం
పకడ్బందీగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ అరగంట ముందే కేంద్రాలకు చేరిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. నిఘా నీడన పరీక్ష మొదలైంది. కేంద్రాలకు వచ్చిన ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం కూడా నిర్ణీత సమయానికే పరీక్ష ప్రారంభించారు. అభ్యర్థులంతా నిర్ణీత సమయానికంటే అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆర్టీసీ బంద్ ఉన్నప్పటికి ఎక్కడా ఎవరు కూడా పరీక్షకు ఆలస్యంగా హాజరుకాలేదు. డీఎస్సీ మూడు రోజుల పరీక్షలో భాగంగా రెండవ రోజు ఉదయం లాంగ్వేజ్ పండిట్లకు, మధ్యాహ్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ)పోస్టులకు పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం రెండవ రోజు కడపలో ఉదయం 13 కేంద్రాలను, మధ్యాహ్నం 2 కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 507 మంది గైర్హాజరు డీఎస్సీ పరీక్షల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన పరీక్షకు 15 కేంద్రాల్లో 3399 మంది అభ్యర్థులకు గాను 2892 మంది హాజరుకాగా 507 మంది గైర్హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియంకు సంబంధించి ఉదయం 1591 మంది హాజరుకావాల్సి ఉండగా 1411 మంది హాజరుకాగా 180 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఉర్దూ మీడియంకు సంబంధించి 176 మంది హాజరు కావాల్సి ఉండగా 151 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. హిందీ మీడియంకు సంబంధించి 1274 మందికి గాను 1030 మంది హాజరుకాగా 244 మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ) కి సంబంధించి 358 మందికి గాను 300 మంది హాజరుగాకా 58 మంది గైర్హాజరయ్యారు. 15 కేంద్రాలలో: కడపలో డీఎస్సీ పరీక్ష కోసం ఉదయం సాయంత్రం కలిపి 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నగరంలోని నిర్మల స్కూల్, శాంతినికేతన్ స్కూల్, మదర్ఇండియా స్కూల్, గురుకుల విద్యాపీఠ్, నాగాార్జున హైస్కూల్, సెయింట్ మేరీస్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, పవన్ స్కూల్, మరియాపురం సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గాంధీనగర్ స్కూల్లలో పరీక్షా కేంద్రాలను ఉదయం ఏర్పాటు చేయగా సాయంత్రం మున్సిపల్ హైస్కూల్ మెయిన్, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ: కడపలోని డీఎస్సీ పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు వనజాక్షి , డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డిలు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును, సెంటర్లలో నెంబరింగ్ ఏర్పాట్లు వంటి వాటితో పాటు విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను అందులోని ఫొటోలను పరిశీలించారు. వీరితోపాటు డీఎస్సీ పరీక్షా కేంద్రాలను రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖకు సంబంధించిన మూడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు కూడా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 147 మంది రెండు చోట్ల దరఖాస్తు చేయగా సంబంధిత అభ్యర్థులు ఒకచోటే పరీక్ష రాస్తున్నారా లేక మరెవరినైనా ఏర్పాటు చేసి పరీక్షను రాయిస్తున్నారా అని ఆరా తీశారు. నేడు 66 కేంద్రాలలో పరీక్ష: 11వ తేదీ సోమవారం కడపలోని 66 కేంద్రాలలో 16,567 మంది అభ్యర్థులు డీఎస్సీని రాయనున్నారు. ఉదయం 1067 మంది సోషియల్ అసిస్టెంట్( ఇంగ్లీష్ లాంగ్వేజ్) మధ్యాహ్నం సోషియల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్), మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు, సోషియల్ స్టడీస్‌కు చెందిన 14500 మంది 66 కేంద్రాలలో పరీక్ష రాయనున్నారు.