సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ను ప్రభుత్వం వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,089 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా గత నెల టీఆర్టీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 80 వేల మంది టీఆర్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పరీక్ష నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఇందుకోసం వారు ముందే సమాయత్తం కావాల్సి ఉంటుంది. మరోవైపు పరీక్ష రాసే అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్తారు.
ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పరీక్ష వాయిదాకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించడంతో విద్యాశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది.
నిరుద్యోగులను మోసగించడమే : ఏఐఎస్‌ఎఫ్
ఎన్నికలు వస్తున్నాయని తెలిసీ నియామక ప్రక్రియను అందుకు అనుగుణంగా చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర శాఖ విమర్శించింది. ఎన్నికలను బూచిగా చూపించి టీఆర్టీ వాయిదా వేయడం నిరుద్యోగులను మోసగించడమేనని పేర్కొంది.
సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. టీచర్ల నియామకంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. మొదట్నుంచీ కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ విమర్శించింది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment