రెండో రోజూ ప్రశాంతం | secound day peacefull of exam | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ప్రశాంతం

Published Mon, May 11 2015 2:01 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

రెండో రోజూ ప్రశాంతం - Sakshi

రెండో రోజూ ప్రశాంతం

  పకడ్బందీగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ
  అరగంట ముందే కేంద్రాలకు చేరిన అభ్యర్థులు
  పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ

 
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. నిఘా నీడన పరీక్ష మొదలైంది. కేంద్రాలకు వచ్చిన ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం కూడా నిర్ణీత సమయానికే పరీక్ష ప్రారంభించారు. అభ్యర్థులంతా నిర్ణీత సమయానికంటే అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు  చేరుకున్నారు. ఆర్టీసీ బంద్ ఉన్నప్పటికి ఎక్కడా ఎవరు కూడా పరీక్షకు ఆలస్యంగా హాజరుకాలేదు.

డీఎస్సీ మూడు రోజుల పరీక్షలో భాగంగా రెండవ రోజు ఉదయం లాంగ్వేజ్ పండిట్‌లకు, మధ్యాహ్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ)పోస్టులకు పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం రెండవ రోజు  కడపలో ఉదయం 13 కేంద్రాలను, మధ్యాహ్నం 2 కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.

507 మంది గైర్హాజరు
 డీఎస్సీ పరీక్షల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన పరీక్షకు 15 కేంద్రాల్లో 3399 మంది అభ్యర్థులకు గాను 2892  మంది హాజరుకాగా 507 మంది గైర్హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియంకు సంబంధించి ఉదయం 1591 మంది హాజరుకావాల్సి ఉండగా 1411 మంది హాజరుకాగా 180 మంది గైర్హాజరయ్యారు.

అలాగే ఉర్దూ మీడియంకు సంబంధించి 176  మంది హాజరు కావాల్సి ఉండగా 151 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. హిందీ మీడియంకు సంబంధించి 1274 మందికి గాను 1030 మంది హాజరుకాగా 244 మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ) కి సంబంధించి 358 మందికి గాను 300 మంది హాజరుగాకా 58 మంది గైర్హాజరయ్యారు.

 15  కేంద్రాలలో:
 కడపలో డీఎస్సీ పరీక్ష కోసం ఉదయం సాయంత్రం కలిపి 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నగరంలోని  నిర్మల స్కూల్, శాంతినికేతన్ స్కూల్, మదర్‌ఇండియా స్కూల్, గురుకుల విద్యాపీఠ్, నాగాార్జున హైస్కూల్, సెయింట్ మేరీస్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, పవన్ స్కూల్, మరియాపురం సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గాంధీనగర్ స్కూల్‌లలో పరీక్షా కేంద్రాలను ఉదయం ఏర్పాటు చేయగా సాయంత్రం  మున్సిపల్ హైస్కూల్ మెయిన్, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ:
 కడపలోని డీఎస్సీ పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు వనజాక్షి , డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డిలు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును, సెంటర్లలో నెంబరింగ్ ఏర్పాట్లు వంటి వాటితో పాటు విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను అందులోని ఫొటోలను పరిశీలించారు.

వీరితోపాటు డీఎస్సీ పరీక్షా కేంద్రాలను రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖకు సంబంధించిన మూడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు కూడా  కేంద్రాలను పరిశీలించారు.  జిల్లా వ్యాప్తంగా 147 మంది రెండు చోట్ల దరఖాస్తు చేయగా సంబంధిత అభ్యర్థులు ఒకచోటే పరీక్ష రాస్తున్నారా లేక మరెవరినైనా ఏర్పాటు చేసి పరీక్షను రాయిస్తున్నారా అని ఆరా తీశారు.

 నేడు 66 కేంద్రాలలో పరీక్ష:
 11వ తేదీ సోమవారం కడపలోని 66 కేంద్రాలలో 16,567 మంది అభ్యర్థులు డీఎస్సీని రాయనున్నారు. ఉదయం 1067 మంది సోషియల్ అసిస్టెంట్( ఇంగ్లీష్ లాంగ్వేజ్) మధ్యాహ్నం సోషియల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్), మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు, సోషియల్ స్టడీస్‌కు చెందిన 14500 మంది 66 కేంద్రాలలో పరీక్ష రాయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement