విద్యార్థులకు విషమ ‘పరీక్ష’
* సిలబస్ పూర్తవకుండానే.. నిర్వహిస్తారట
* 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం
* వాయిదా వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సిలబస్ పూర్తి కాకముందే త్రైమాసిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధన పూర్తికాక ముందుగానే ఈ నెల 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కేలండర్‌లో పొందుపర్చారు. ఫలితంగా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి.
చదవని పాఠాలపై పరీక్షలు!
విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ కేలండర్‌ను అనుసరించి మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్–1) పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు 24 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ ముగిసేందుకు మరో 10 రోజులు వ్యవధి ఉండగానే, నెల మొత్తానికి సంబంధించిన సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలను సైతం ప్రశ్నపత్రాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యార్థులకు నష్టం..
గతంలో ఏటా ఆగస్టు నెల వరకూ మూడు నెలల సిలబస్‌పై ప్రథమ యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్న విధానంలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు సైతం సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) తో 20 శాతం మార్కులను విద్యార్థుల ఆల్‌రౌండ్ ప్రతిభ ఆధారంగా లెక్కించాల్సి ఉన్న దృష్ట్యా వారి ప్రగతిపై ప్రభావం చేపే అవకాశముంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాయి.
దసరా సెలవుల తర్వాత నిర్వహించాలి...
సమ్మెటివ్–1 పరీక్షలను అక్టోబర్‌లో దసరా సెలవుల తర్వాత నిర్వహించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సీవీఎస్ మణి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ పూర్తవకముందుగానే విద్యార్థులకు తెలియని పాఠ్యాంశాలపై ప్రశ్నపత్రాలను ఏ విధంగా రూపొందిస్తారని ప్రశ్నించారు. పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కలవనున్నట్లు వారు చెప్పారు.