quarterly exams
-
Parenting Tips: పిల్లలందరూ బాగా రాయాలనే అనుకుంటారు! కానీ ఒక్కోసారి
How To Deal With Children When Scoring Low Marks: దసరా సెలవులు వచ్చేశాయి. పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాశారు.. కొందరు రాస్తున్నారు. అందరూ మార్కులు ఎన్నొచ్చాయో ఇంట్లో చెబుతారు. ఎక్కువ రావచ్చు.. తక్కువ రావచ్చు. పిల్లలతో ఎలా మాట్లాడాలి? మరో ఆరు నెలల కాలంలో వారు చదువులో ఎదగడానికి ఇప్పుడు మాట్లాడేదే ముఖ్యం.వారిని నొప్పించవద్దు. మరింత బాగా చదివేలా ఒప్పిద్దాం. వాటి గురించి పిల్లలు హుషారుగా ఎదురు చూసే ముందు పరీక్షలు వస్తాయని వారికి తెలుసు. అవి రాయాలి. మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల, టీచర్ల మెప్పు పొందాలి. ఆ తర్వాత సెలవుల్ని ఎంజాయ్ చేయాలి. తల్లిదండ్రులు కూడా పరీక్షలు బాగా రాయి... సెలవుల్లో ఫలానా చోటుకు తీసుకెళతాము అని చెబుతుంటారు. బాగా రాయడం అంటే బాగా రాయాలనే పిల్లలందరూ అనుకుంటారు. కాని సబ్జెక్ట్లన్నీ ఒకటి కాదు. పిల్లలందరూ ఒకటి కాదు. అన్ని సబ్జెక్టుల్లో అందరు పిల్లలూ ఒక్కలా తెలివి ప్రదర్శించలేరు. తెలివైన పిల్లలు కూడా ఇష్టపడని, సరిగా రాయని సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఇవాళ్టి పరీక్షలకు గత రెండు మూడు వారాల్లో ఏవైనా ఇంట్లో అవాంతరాలు, పిల్లలకు అనారోగ్యాలు వస్తే వాటి ప్రభావం ఉంటుంది. పరీక్షల సమయంలో తెలిసిన ప్రశ్నకు జవాబు తెలిసినా సరిగ్గా రాయకపోవడం ఉంటుంది. పరీక్షలు అయ్యాక పిల్లలు తెచ్చే జవాబు పత్రాలు, వాటిలో కనిపించే మార్కుల వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. కాని తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మార్కులు వందకు వంద, ఎనభైకు ఎనభై, యాభైకు యాభై, ఇరవై అయిదుకు ఇరవై అయిదు కనిపిస్తేనే ఆనందం. సంతోషం. బాగా చదివినట్టు లెక్క. మార్కులు మాత్రమే పిల్లలు బాగా చదివినట్టు నిరూపిస్తాయా? సంతృప్తికి హద్దు పూర్వం తల్లిదండ్రులు పరీక్షల్లో 60 శాతం మార్కులు వస్తే సంతోషపడేవారు. తర్వాత అది ఎనభైకి చేరింది. ఆ తర్వాత తొంభై శాతం మార్కులు తెచ్చిన పిల్లలను నలుగురికీ గర్వంగా చూపేవారు. ఇవాళ వంద శాతం తెచ్చుకుంటే తప్ప తల్లిదండ్రుల ముఖాలలో చిర్నవ్వు కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఎదుట ముఖం చెల్లుబాటు అయ్యేందుకు, తల్లిదండ్రుల తిట్లు (కొందరు కొడతారు) తప్పించుకునేందుకు ఆ సబ్జెక్ట్‌లు వచ్చినా రాకపోయినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే వొత్తిడి పిల్లలు ఎలా తట్టుకోవాలి? టీచర్లు సమర్థులేనా? పిల్లలు మార్కులు తెచ్చారు. వాటిని తల్లిదండ్రులు చూశారు. కొన్ని పేపర్లలో మంచి మార్కులు వచ్చాయి. కొన్నింటిలో తక్కువ వచ్చాయి. వెంటనే ఇరుగింటి వారి ముందు పొరిగింటి వారి ముందు తిట్టడం మొదలుపెట్టకూడదు. ‘గ్రేడ్స్ షేమింగ్’... అంటే ఇతర పిల్లల మార్కులు కనుక్కొని మన పిల్లల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అవమానించవద్దు. వారికి ఎందుకు వచ్చాయి నీకు ఎందుకు రాలేదు అని దబాయించవద్దు. మొదట పిల్లలతో మాట్లాడాలి. స్నేహంగా కూచోబెట్టుకోవాలి. సమస్య ఏమిటో అడగాలి. కొన్ని సబ్జెక్ట్‌లు ఎందుచేతనో పిల్లలకు పట్టుబడవు. కొందరు ఇంగ్లిష్‌లో బాగా చదివి లెక్కల్లో పూర్‌గా ఉంటారు. కొందరు సైన్స్ బాగా చదివి తెలుగు తప్పులు రాస్తారు. ఏ సబ్జెక్ట్‌లో వారికి ఎటువంటి సమస్య ఉందో తెలుసుకోవాలి. స్కూల్లో ఆ సబ్జెక్ట్‌లు చెప్పే టీచర్లతో వారికి స్నేహం ఉందా లేదా ఆ టీచర్లు ఆసక్తిగా చెబుతున్నారా కటువుగా చెప్తున్నారా తెలుసుకోవాలి. వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లు ఇంట్లోగాని ట్యూషన్ ద్వారా గాని చెప్పే అవకాశం గురించి ఆలోచించాలి. ఇవన్నీ లేకుండా మార్కులు తక్కువ వచ్చాయని దండనకు దిగడం పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. పిల్లలూ తప్పులు చేస్తారు పిల్లలు కూడా తప్పులు చేస్తారు. నిర్లక్ష్యంగా ఉంటారు. సరిగా చదవకుండా ఎలాగోలా రాయొచ్చులే అనుకుంటారు. తీరా పరీక్షలు రాశాక తెల్లమొఖం వేస్తారు. మార్కులు వచ్చాక చేసిన తప్పు తెలుసుకుంటారు. వారు కూడా తమకు వచ్చిన మార్కులకు సిగ్గు పడతారు. ఆ స్థితి గమనించి తల్లిదండ్రులు ‘పర్వాలేదు. ఈసారి జాగ్రత్త పడు’ అని చెప్పేలా ఉండాలి. ఇప్పుడు క్వార్టర్లీ రాశారు కనుక హాఫ్ ఇయర్లీ వరకూ ఇంప్రూవ్ కావాలని... యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ది బెస్ట్‌గా ఎదగవచ్చని ధైర్యం చెప్పాలి. అందుకు తాము సాయం చేస్తామని భరోసా ఇవ్వాలి. తక్కువ మార్కులు వచ్చి అసలే ఇబ్బంది పడుతున్న పిల్లలను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. వాస్తవాన్ని అంగీకరించమని చెప్పాలి కష్టపడి చదివి రాయవలసినంత రాయి.. మార్కుల సంగతి ఆ తర్వాత అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లల ఆలోచనలు పరి పరి విధాలుగా పోయే అవకాశం ఉంది. తమ వాస్తవిక పరిస్థితిని వారు అంగీకరించి దానిని తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి. ‘అమ్మో మార్కులు తక్కువ వచ్చాయి. తిడతారు. ఎక్కువ వచ్చాయని అబద్ధం చెబుదాం’ అని పిల్లలు అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఫెయిల్ అయినట్టు లెక్క. ఒక్కోసారి మార్కులు తక్కువ వస్తే పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయారంటే ఆ తల్లిదండ్రులు ఇంకా దారుణమైన పెంపకం వహిస్తున్నట్టు. పిల్లలు ఎలాంటి ఇబ్బంది అయినా తల్లిదండ్రులతో చెప్పే స్నేహం అవసరం. అందుకు సమయం ఇస్తున్నామా లేదా అని తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి. క్వార్టర్లీ పరీక్షలు మీ పిల్లల పరిస్థితిని, వారి పట్ల మీ అవగాహనను తెలియచేశాయి. వార్షిక పరీక్షలకు పిల్లలతో పాటు మీరు వారితో కలిసి ప్రయాణించడానికి ప్రేమతో, ఓర్పుతో, స్నేహంతో దారి వేసుకోండి. పిల్లలను ఉత్సాహపరిస్తే అద్భుతాలు చేస్తారు. బెదరగొడితే చతికిల పడతారు. గమనించండి. ప్రోత్సాహకాలు పిల్లలు బాగా చదివితే ప్రోత్సాహకాలు ఇచ్చి తల్లిదండ్రులు వారిని ఉత్సాహపరచాలి. రోజూ వారితో పాటు కాసేపు కూచుని వారు చదువుకుంటూ ఉంటే మెచ్చుకోవాలి. వారికి సందేహాలుంటే తాము తీర్చగలిగితే తీర్చాలి. లేదా వారి అనుమతితో (వారు వద్దంటే వద్దు) ట్యూషన్లు పెట్టాలి. అన్నింటి కంటే ముఖ్యం ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి దసరా సెలవుల వంటి సందర్భాల్లో కూచోబెట్టి బలవంతంగా చదవమని శిక్ష విధించకూడదు. పిల్లలు వారి సరదా సమయాలను ఎంజాయ్ చేయనివ్వాలి. అదే సమయంలో బాగా చదవడం వారి బాధ్యత అని వారికి తెలియచేయాలి. చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే.. -
పరీక్షలు సరే.. ఫలితాలు మరి..!
సాధారణ పరీక్షలకు విద్యాశాఖ రూ. 22 కోట్లు ఖర్చుచేసినా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రమాణాల పెంపుపై బాహాటంగా వ్యక్తం అవుతున్న విమర్శలతో ఫలితాలు వెల్లడించామని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వివరాలు ఉంచామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అందులో పరిశీలిస్తే కొద్ది పాఠశాలల ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులోను ఏ1 మొదలు బి2 వరకు ఒకే గ్రేడు కేటాయించారు. వ్యక్తిగత మార్కులు మాత్రం లభ్యం కాకపోతుండడం, మరో వైపు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రావీణ్యాన్ని అంచనా వేసుకునేందుకు మార్కుల గురించి పాఠశాలల ఉపాధ్యాయులను, యాజమాన్యాలను అడిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఒంగోలు: సాధారణ పరీక్షలకు సంబంధించి అక్టోబరులో జరగాల్సిన సమ్మేటివ్ 1 (గతంలో క్వార్టర్లీ పరీక్షలు) పరీక్షల ప్రశ్నాపత్రాలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో పాఠశాల విద్యాశాఖ జరిగిన పరీక్షలను సైతం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ఈ పరీక్షలను ఏ జిల్లాకు ఆ జిల్లా నిర్వహించుకునేది. జిల్లాస్థాయిలో ఉన్న ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ ప్రశ్నాపత్రాల రూపకల్పన చేయించేది. కానీ ప్రస్తుతం ఈ పరీక్షలను సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ప్రశ్నాపత్రం అంటూ తెరమీదకు తీసుకువచ్చారు. ఇది ఖర్చు పెరుగుతుందని భావించినా విద్యార్థుల ప్రమాణాల పెంపునకు ఉపయుక్తం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఉమ్మడి ప్రశ్నాపత్రాలు పలు జిల్లాల్లో లీక్ కావడంతో పరీక్షలను రద్దుచేసిన అధికారులు అందుకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టారనేది మాత్రం బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్ తరహా విధానం అంటూ నూతన పంథాను తెరమీదకు తెచ్చారు. దీనికి సంబంధించి పరీక్షల నిర్వహణపైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొన్ని పరీక్షలకు ఒక్కో బిట్‌కు ఒక మార్కు కేటాయించగా పలు పరీక్షలకు మాత్రం బిట్‌కు అరమార్కు మాత్రమే కేటాయించారు. అంతే కాకుండా ఓఎంఆర్ జవాబు పత్రాలను దీనికోసం కేటాయించారు. మొత్తంగా 2017 డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు రూ. 22 కోట్లు కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను ముద్రించి విమానాల్లో రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రత్యేక ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో జిల్లాలకు తరలించారు. అయితే ఇంత ఖర్చుచేసినా ఫలితాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. సగానికిపైగా కనిపించని ఫలితాలు జిల్లాలో 8వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులు 19373 మంది, 27452 మంది ఆంగ్ల మా«ధ్యమం విద్యార్థులు మొత్తం 46825 మంది పరీక్షలకు హాజరయ్యారు. 9వ తరగతికి సంబంధించి 17975 మంది తెలుగుమీడియం, 25250 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు మొత్తం 43225 మంది పరీక్షలు రాశారు. అయితే ఇటీవల విద్యాశాఖ మీద ఫలితాల ఒత్తిడి పెరుగుతుండడంతో హడావుడిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో ఫలితాలు ఉంచారు. 8వ తరగతిలో 13087 మంది విద్యార్థులు తెలుగుమీడియం, 2039 మంది ఆంగ్ల మా«ధ్యమ వివరాలను పాఠశాలల వారీగా అందుబాటులో ఉంచారు. ఇంకా 31699 మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. అలాగే 9వ తరగతిలో 43225 మందిలో 14553 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. 8, 9 తరగతుల విద్యార్థులు కలిపి మొత్తం 46252 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే అవి ఎప్పుడు వెల్లడవుతాయనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. బేజారెత్తిస్తున్న ఫలితాలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నాపత్రాల రూపకల్పన విద్యార్థుల సామర్థ్యాలకు మించి ఇచ్చారన్న విమర్శలు పరీక్షల సమయంలోనే బాహాటంగా వినిపించాయి. అందులో భాగంగా వెలువడిన పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే 8వ తరగతికి సి2 గ్రేడు లభించగా 9వ తరగతికి సి1 గ్రేడు లభించాయి. గణితంలో అయితే ఏకంగా 8, 9 తరగతులు రెండింటిలోనూ డీ1 గ్రేడులు రావడం పడిపోతున్న గణిత సామర్థ్యాలకు ప్రతీకగా భావించాలా లేక గణిత ప్రశ్నాపత్రం విద్యార్థుల సామర్థ్యానికి మించి రూపొందించారా అనే దానిపై కూలంకష చర్చ జరగాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
విద్యార్థులకు విషమ ‘పరీక్ష’
* సిలబస్ పూర్తవకుండానే.. నిర్వహిస్తారట * 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం * వాయిదా వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు గుంటూరు ఎడ్యుకేషన్: సిలబస్ పూర్తి కాకముందే త్రైమాసిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధన పూర్తికాక ముందుగానే ఈ నెల 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కేలండర్లో పొందుపర్చారు. ఫలితంగా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. చదవని పాఠాలపై పరీక్షలు! విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ కేలండర్‌ను అనుసరించి మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్–1) పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు 24 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ ముగిసేందుకు మరో 10 రోజులు వ్యవధి ఉండగానే, నెల మొత్తానికి సంబంధించిన సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలను సైతం ప్రశ్నపత్రాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం.. గతంలో ఏటా ఆగస్టు నెల వరకూ మూడు నెలల సిలబస్‌పై ప్రథమ యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్న విధానంలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు సైతం సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) తో 20 శాతం మార్కులను విద్యార్థుల ఆల్‌రౌండ్ ప్రతిభ ఆధారంగా లెక్కించాల్సి ఉన్న దృష్ట్యా వారి ప్రగతిపై ప్రభావం చేపే అవకాశముంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాయి. దసరా సెలవుల తర్వాత నిర్వహించాలి... సమ్మెటివ్–1 పరీక్షలను అక్టోబర్‌లో దసరా సెలవుల తర్వాత నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీవీఎస్ మణి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ పూర్తవకముందుగానే విద్యార్థులకు తెలియని పాఠ్యాంశాలపై ప్రశ్నపత్రాలను ఏ విధంగా రూపొందిస్తారని ప్రశ్నించారు. పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కలవనున్నట్లు వారు చెప్పారు. -
విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదా
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో పాఠశాల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదాపడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అన్ని పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో త్రైమాసిక పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పాఠశాలల్లో ఆగస్టులో నిర్వహించాల్సిన రెండవ యూనిట్ పరీక్షలను కూడా నిర్వహించలేదు. గత రెండు నెలలుగా విద్యార్థులకు తరగతులు సరిగా జరగడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు కేవలం ఒకటి, రెండు యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి. విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం, సిలబస్ పూర్తి చేయకపోవడం వలన జరిగే నష్టం కంటే రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టమే ఎక్కువ అంటూ ఉపాధ్యాయులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులు కూడా పాఠశాలలకు దూరమయ్యారు. 4.36 లక్షల మందికి పరీక్షల్లేవ్.. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 4.36 లక్షల మంది విద్యార్థులు త్రైమాసిక పరీక్షలకు దూరమవుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు అనంతరం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1.80 లక్షల మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 20 వేల మంది, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 50 వేల మంది 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 1.86 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 24 ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల మంది, 301 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 83 వేల మంది, 43 ఎయిడెడ్ పాఠశాలల్లో 9 వేల మంది, 7 మున్సిపల్ పాఠశాలల్లో 2,700 మంది, 256 ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 65 వేల మంది, 10 మోడల్ స్కూళ్లు, 9 కేజీబీవీల్లో 4 వేల మంది చదువుతున్నారు. 443 యూపీ పాఠశాలల్లో 12 వేల మంది 6,7 తరగతులు చదువుతున్నారు. వీరందరికీ ప్రస్తుతం త్రైమాసిక పరీక్షలు నిర్వహించడం లేదు. అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన త్రైమాసిక పరీక్షలు ఉపాధ్యాయుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రాజేశ్వరరావు తెలిపారు. త్రైమాసిక పరీక్షలు దసరా సెలవుల అనంతరం ఎప్పుడు నిర్వహించేది తేదీలు ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలలకు అక్టోబర్ 4 నుంచి 15వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 16వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, దీంతో దసరా సెలవుల అనంతరం 17న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని డీఈఓ తెలిపారు.