సాధారణ పరీక్షలకు విద్యాశాఖ రూ. 22 కోట్లు ఖర్చుచేసినా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రమాణాల పెంపుపై బాహాటంగా వ్యక్తం అవుతున్న విమర్శలతో ఫలితాలు వెల్లడించామని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అందులో పరిశీలిస్తే కొద్ది పాఠశాలల ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులోను ఏ1 మొదలు బి2 వరకు ఒకే గ్రేడు కేటాయించారు. వ్యక్తిగత మార్కులు మాత్రం లభ్యం కాకపోతుండడం, మరో వైపు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రావీణ్యాన్ని అంచనా వేసుకునేందుకు మార్కుల గురించి పాఠశాలల ఉపాధ్యాయులను, యాజమాన్యాలను అడిగినా ప్రయోజనం ఉండటం లేదు.
ఒంగోలు: సాధారణ పరీక్షలకు సంబంధించి అక్టోబరులో జరగాల్సిన సమ్మేటివ్ 1 (గతంలో క్వార్టర్లీ పరీక్షలు) పరీక్షల ప్రశ్నాపత్రాలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో పాఠశాల విద్యాశాఖ జరిగిన పరీక్షలను సైతం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ఈ పరీక్షలను ఏ జిల్లాకు ఆ జిల్లా నిర్వహించుకునేది. జిల్లాస్థాయిలో ఉన్న ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ ప్రశ్నాపత్రాల రూపకల్పన చేయించేది. కానీ ప్రస్తుతం ఈ పరీక్షలను సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ప్రశ్నాపత్రం అంటూ తెరమీదకు తీసుకువచ్చారు. ఇది ఖర్చు పెరుగుతుందని భావించినా విద్యార్థుల ప్రమాణాల పెంపునకు ఉపయుక్తం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఉమ్మడి ప్రశ్నాపత్రాలు పలు జిల్లాల్లో లీక్ కావడంతో పరీక్షలను రద్దుచేసిన అధికారులు అందుకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టారనేది మాత్రం బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్ తరహా విధానం అంటూ నూతన పంథాను తెరమీదకు తెచ్చారు. దీనికి సంబంధించి పరీక్షల నిర్వహణపైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొన్ని పరీక్షలకు ఒక్కో బిట్‌కు ఒక మార్కు కేటాయించగా పలు పరీక్షలకు మాత్రం బిట్‌కు అరమార్కు మాత్రమే కేటాయించారు. అంతే కాకుండా ఓఎంఆర్ జవాబు పత్రాలను దీనికోసం కేటాయించారు. మొత్తంగా 2017 డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు రూ. 22 కోట్లు కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను ముద్రించి విమానాల్లో రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రత్యేక ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో జిల్లాలకు తరలించారు. అయితే ఇంత ఖర్చుచేసినా ఫలితాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి.
సగానికిపైగా కనిపించని ఫలితాలు
జిల్లాలో 8వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులు 19373 మంది, 27452 మంది ఆంగ్ల మా«ధ్యమం విద్యార్థులు మొత్తం 46825 మంది పరీక్షలకు హాజరయ్యారు. 9వ తరగతికి సంబంధించి 17975 మంది తెలుగుమీడియం, 25250 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు మొత్తం 43225 మంది పరీక్షలు రాశారు. అయితే ఇటీవల విద్యాశాఖ మీద ఫలితాల ఒత్తిడి పెరుగుతుండడంతో హడావుడిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచారు. 8వ తరగతిలో 13087 మంది విద్యార్థులు తెలుగుమీడియం, 2039 మంది ఆంగ్ల మా«ధ్యమ వివరాలను పాఠశాలల వారీగా అందుబాటులో ఉంచారు. ఇంకా 31699 మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. అలాగే 9వ తరగతిలో 43225 మందిలో 14553 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. 8, 9 తరగతుల విద్యార్థులు కలిపి మొత్తం 46252 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే అవి ఎప్పుడు వెల్లడవుతాయనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది.
బేజారెత్తిస్తున్న ఫలితాలు
ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నాపత్రాల రూపకల్పన విద్యార్థుల సామర్థ్యాలకు మించి ఇచ్చారన్న విమర్శలు పరీక్షల సమయంలోనే బాహాటంగా వినిపించాయి. అందులో భాగంగా వెలువడిన పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే 8వ తరగతికి సి2 గ్రేడు లభించగా 9వ తరగతికి సి1 గ్రేడు లభించాయి. గణితంలో అయితే ఏకంగా 8, 9 తరగతులు రెండింటిలోనూ డీ1 గ్రేడులు రావడం పడిపోతున్న గణిత సామర్థ్యాలకు ప్రతీకగా భావించాలా లేక గణిత ప్రశ్నాపత్రం విద్యార్థుల సామర్థ్యానికి మించి రూపొందించారా అనే దానిపై కూలంకష చర్చ జరగాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment