ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో పాఠశాల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదాపడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అన్ని పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో త్రైమాసిక పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పాఠశాలల్లో ఆగస్టులో నిర్వహించాల్సిన రెండవ యూనిట్ పరీక్షలను కూడా నిర్వహించలేదు. గత రెండు నెలలుగా విద్యార్థులకు తరగతులు సరిగా జరగడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు కేవలం ఒకటి, రెండు యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి. విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం, సిలబస్ పూర్తి చేయకపోవడం వలన జరిగే నష్టం కంటే రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టమే ఎక్కువ అంటూ ఉపాధ్యాయులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులు కూడా పాఠశాలలకు దూరమయ్యారు.
4.36 లక్షల మందికి పరీక్షల్లేవ్..
జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 4.36 లక్షల మంది విద్యార్థులు త్రైమాసిక పరీక్షలకు దూరమవుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు అనంతరం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1.80 లక్షల మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 20 వేల మంది, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 50 వేల మంది 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 1.86 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 24 ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల మంది, 301 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 83 వేల మంది, 43 ఎయిడెడ్ పాఠశాలల్లో 9 వేల మంది, 7 మున్సిపల్ పాఠశాలల్లో 2,700 మంది, 256 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 65 వేల మంది, 10 మోడల్ స్కూళ్లు, 9 కేజీబీవీల్లో 4 వేల మంది చదువుతున్నారు. 443 యూపీ పాఠశాలల్లో 12 వేల మంది 6,7 తరగతులు చదువుతున్నారు. వీరందరికీ ప్రస్తుతం త్రైమాసిక పరీక్షలు నిర్వహించడం లేదు.
అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు
జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన త్రైమాసిక పరీక్షలు ఉపాధ్యాయుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రాజేశ్వరరావు తెలిపారు. త్రైమాసిక పరీక్షలు దసరా సెలవుల అనంతరం ఎప్పుడు నిర్వహించేది తేదీలు ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలలకు అక్టోబర్ 4 నుంచి 15వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 16వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, దీంతో దసరా సెలవుల అనంతరం 17న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని డీఈఓ తెలిపారు.
విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదా
Published Thu, Sep 26 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement