సాక్షి, గుంటూరు: జగనన్న సర్కార్‌లో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు.. అందుబాటులోకి ఐబీ సిలబస్ రానుంది. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ memorandum of understanding (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.
‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ సిలబస్ అనేది సవాల్‌తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు.
పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి.
ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాతే ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ Olli-Pekka Heinonen, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ Matt Costello పాల్గొని మాట్లాడారు.
ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment