
‘సమస్య’ తీరుతోంది!
- గ్రూప్1లో ‘డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’కు మంగళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయి. పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. సిలబస్‌లో మాత్రం మార్పులు తీసుకురావాలని సమీక్ష కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులకు ‘సమస్య’గా మారిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశానికి ప్రాధాన్యత తగ్గించాలని భావిస్తోంది. గ్రూప్-1 ఐదో పేపర్‌గా ఉన్న ఈ అంశం స్థానంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టాలని... ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ను 50 మార్కులకు కుదించాలని యోచిస్తోంది.
దీనిపై 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ నాలుగో, ఐదో పేపర్లతో పాటు గ్రూప్-2లో పేపర్-2 సెక్షన్ 1లో, పేపర్-3 సెక్షన్-2లో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పుచేస్తూ గతంలో ఉన్న ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తేనే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయనుంది. ఈ పరీక్షల్లో మార్పులకు సంబంధించిన సిఫారసుల నివేదికను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించాక అమల్లోకి వస్తాయి.
చరిత్ర, రాష్ట్ర వివరాలు:గ్రూప్-2 రెండో పేపర్‌లోని సెక్షన్-1లో ఉన్న ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర స్థానంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సిలబస్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో శాతవాహనులు, కాకతీయులు, నిజాంల పాలన, ఆది హిందూ ఉద్యమం, నిజాం రాష్ట్ర జన సంఘం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక వికాసం తదితర అంశాలను చేర్చబోతోంది.
అలాగే పేపర్-3లో ఏపీ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు స్థానంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు అంశాన్ని చేర్చేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఇందులో వ్యవసాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రణాళిక, వ్యవసాయం, నీటి పారుదల రంగం, ఆదాయ స్థితిగతులు, రవాణా, పర్యాటక రంగాల స్థితిగతులు తదితర అంశాలు ఉంటాయి.
ప్రధాన మార్పులు వీటిలోనే..
గ్రూప్-1లో ఒకటో పేపర్‌గా ఉన్న ‘జనరల్ ఎస్సే’లో తెలంగాణకు సంబంధించిన అంశాలతో సిలబస్‌ను మార్చుతారు. రెండో పేపర్‌లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర’ స్థానంలో ‘తెలంగాణలో వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, వారసత్వం, భౌగోళిక స్థితిగతు’లను చేర్చనుంది. మూడో పేపర్‌లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రం తరువాత సామాజిక మార్పులు, భూ సంస్కరణలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బలాలు-బలహీనతలు’ స్థానంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, భూ సంస్కరణలపై సిలబస్’ను పొందుపరుస్తారు.
ఇండియన్ పాలిటీ, సమాజం, పాలన తదితర అంశాలను కూడా దీనిలోనే చేర్చనుంది. నాలుగో పేపర్‌లో ఇప్పటి వరకు ఉన్న ‘భారతదేశ అభివృద్ధి సైన్స్, టెక్నాలజీ పాత్ర దాని ప్రభావం, లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలపై సాధారణ అవగాహన, పర్యావరణ సమస్యలు, అభివృద్ధి’ తదితర అంశాల్లోని ప్రధాన అంశాలను ఐదో పేపర్‌లోకి మార్చనుంది. నాలుగో పేపర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ఇందులో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంశాలను చేర్చనుంది.
గత 15 ఏళ్లలో ఐదారు దఫాలుగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌లో చాలా మంది అభ్యర్థులు మొదటి నాలుగు పేపర్లలో మంచి మార్కులు సాధించినా... ఐదో పేపర్ అయిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’లో వెనుకబడి... ఇంటర్వ్యూకు వెళ్లలేకపోతున్నారని సమీక్ష కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో ఐదో పేపర్‌లో ప్రస్తుతం ఉన్న ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టబోతోంది. లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలు తదితర అంశాలు ఉండనున్నాయి. అయితే ఈ పేపర్‌లోని 150 మార్కుల్లో 100 మార్కులను వీటికి కేటాయించి... మిగతా 50 మార్కులను ‘డాటాఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశాలకు కేటాయించే లా సిఫారసులను కమిటీ సిద్ధం చేసినట్లు తెలిసింది.