సిలబసే కొంపముంచిందా?
♦ నిరాశపరిచిన ‘టెట్’
♦ సగానికిపైగా అనుత్తీర్ణత
♦ ఆందోళనలో అభ్యర్థులు
నిజామాబాద్‌అర్బన్ : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు అభ్యర్థులను నిరాశపరిచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉత్తీర్ణత నమోదవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. టెట్‌పై స్పష్టత కరువవడం, సిలబస్లు కొంపముంచాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 22వ తేదీన టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా టెట్ పేపర్-1కు సంబంధించి 8,595 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,910 మంది(57.13 శాతం) అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పేపర్-2కు 19,930 అభ్యర్థులు హాజరుకాగా 4,500 మంది(22.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 77.42 శాతం అనుత్తీర్ణులవ్వడం గమనార్హం. టెట్ ఉత్తీర్ణులు కాకపోవడంతో డీఎస్సీకి అర్హత సాధించలేకపోయారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
సిలబస్‌పై గందరగోళం..
టెట్‌లో తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడానికి సిలబస్‌తోపాటు, పరీక్ష తరచూ వాయిదా పడుతూ రావడం కారణంగా తెలుస్తోంది. ఏడాది కిందట టెట్‌కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి పరీక్ష తేదీ ప్రకటన వరకు ఎలాంటి సిలబస్ విధివిధానాలు ప్రకటించలేదు. మరోవైపు కోచింగ్ సెం టర్లు సైతం ఎవరికి తోచిన సిలబస్‌ను వారు బోధిం చారు. చాలా మంది మార్కెట్‌లో లభించిన పోటీ పరీక్ష ల పుస్తకాలు కొనుగోలు చేసి చదివారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సిలబస్ ఉంటుందని భావించి పలువురు బోల్తాపడ్డారు. సిలబస్ ఎలా ఉంటుందో తెలియకపోవడం, పరీక్ష తేదీ తరయచూ వాయిదా పడుతూ రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.
కోచింగ్‌లతో ఫలితమేమి?
జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో కలిపి పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లు 36 ఉన్నాయి. డీఎస్సీ, టెట్‌కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే బ్యాచ్‌లు నిర్వహించారు. నోటిఫికేషన్ ఇచ్చాక బ్యాచ్‌ల జోరు పెరిగింది. వేలాది మంది ఆయా కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ సెంటర్లు ఒక్కో అభ్యర్థినుంచి కనీసం రూ. 5 వేలు వసూలు చేశాయి. ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నాలుగు కోచింగ్ సెంటర్లు వెలిశాయి. అభ్యర్థులను ఎక్కువ మొత్తంలో చేర్చుకున్న పలు కోచింగ్ సెంటర్లు.. స్థలం సరిపోక కళ్యాణ మండపాలు, కుల సంఘాలు, ఇతర భవనాలను అద్దెకు తీసుకొని మరీ కోచింగ్ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. వేలాది రూపాయలు బూడిదలో పోసినట్తైదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ పరీక్ష నిర్వహించాలి
టెట్ -2లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. సెలబస్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. డీఎస్సీకంటే ముందే మరోసారి టెట్ -2 నిర్వహించాలి. - కె.శ్రీనివాస్, టెట్-2 అభ్యర్థి