- దక్కన్ చరిత్ర, తెలంగాణ ఉద్యమంపై పాఠాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ స్థాయిలో ఉన్న చరిత్ర పుస్తకాల సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఫుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డిగ్రీ చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పులపై బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, వివిధ వర్సిటీల చరిత్ర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిలబస్ మార్పుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు మనోహర్‌రావు, అర్జున్‌రావు, సుదర్శన్, వరలక్ష్మి, సదానందం, 8 మంది డిగ్రీ లెక్చరర్లు ఉంటారు.
ఇవీ మార్పులు: దక్కన్ చరిత్రకు మార్పుల్లో పెద్ద పీట వేస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై పాఠ్యాంశాలు ఉంటాయి. అంతేకాక హుస్సేన్‌సాగర్, రామప్ప, లక్నవరం వంటి చెరువులు, వాటిని తవ్వించిన రాజులు, అప్పటి పాలన విధానం, వారి ప్రాధాన్యాలపై పాఠ్యాంశాలు ఉంటాయి. వాటితోపాటు కాకతీయులు, సమక్క-సారలమ్మ, నాటి పరిస్థితులపై పాఠాలుంటాయి.చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి తెలంగాణ యోధులు, 1969 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం, అందులో వివిధ రంగాల పాత్ర, తెలంగాణ భాష, సంస్కృతిపై పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు.